Advertisement
Advertisement
Abn logo
Advertisement

వందశాతం వ్యాక్సినేషన్‌ దిశగా

మూడో ముప్పు నేపథ్యంలో...

ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్న ఉద్యోగులు

గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ల నిర్వహణ

ఉమ్మడి జిల్లాలో 32.43లక్షల డోస్‌ల వ్యాక్సిన్‌ పంపిణీ

(సూర్యాపేట కలెక్టరేట్‌, భువనగిరి టౌన్‌, నల్లగొండ అర్బన్‌)

ఒమైక్రాన్‌ ముప్పు పొంచి ఉండటం, తాజాగా ఉమ్మడి జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో వంద శాతం వ్యాక్సినేషన్‌ దిశగా వైద్యశాఖ అడుగులు వేస్తోంది. కరోనాకు వ్యాక్సిన్‌తోనే రక్షణ అని వైద్య నిపుణులు పేర్కొంటుండగా, వైద్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించడంతోపాటు గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటుచేసి టీకా వేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ జనవరి నెలలో ప్రారంభమైంది. తొలుత అనుకున్న సంఖ్యలో డోసులు అందుబాటులో రాకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తరువాత కరోనా రెండో దశలో ఎక్కువ మంది వైరస్‌ బారినపడటంతో వ్యాక్సిన్‌ కోసం ప్రజలు ఆస్పత్రుల ఎదుట క్యూ కట్టారు. ఈ లోగా డోసులు అందుబాటులోకి రాగా, కరోనా ప్రభావం తగ్గింది. దీంతో వ్యాక్సిన్‌ తీసుకోవడంలో అంతా నిర్లక్ష్యం చూపారు. దీంతో ఈ ప్రక్రియ మందగించగా, వైద్యశాఖ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి టీకా ఇచ్చింది. ప్రస్తుతం కరోనా మూడో ముప్పు పొంచి ఉండటంతో వందశాతం వ్యాక్సినేషన్‌ కోసం వైద్యశాఖ చర్యలు తీసుకుంది.

ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 32.43లక్షల కొవిడ్‌ డోసులను వైద్యశాఖ పంపిణీచేసింది. సూర్యాపేట జిల్లాలో 18ఏళ్లకు పైబడినవారు 7,97,475 మంది ఉండగా, తొలి డోసు 6,46,255 మంది తీసుకున్నారు. ఇక రెండో డోసు 2,95,752 మంది తీసుకున్నారు. మొత్తం 9,42,007 వ్యాక్సిన్‌ను వైద్యశాఖ ప్రజలకు వేసింది. జిల్ల్లాలో ఐదు మునిసిపాలిటీల పరిధిలో 141 వార్డులు ఉండగా, ఇప్పటికి వరకు 105 వార్డులు, 475 ఆవాసాల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. వ్యాక్సినేషన్‌ లక్ష్యంలో జిల్లా రాష్ట్రస్థాయిలో 22వ స్థానంలో ఉంది. యాదాద్రి జిల్లాలో 5,23,068మంది అర్హులు కాగా, తెలి డోసు 5,03,685మంది తీసుకున్నారు. రెండో డోసు 3,05,454మంది తీసుకున్నారు. నల్లగొండ జిల్లాలో 12.50లక్షల మంది అర్హులు కాగా, ఇప్పటి వరకు తొలి డోసు 10,90,546మంది తీసుకున్నారు. రెండో డోసు 4,00,619మంది తీసుకున్నారు. అయితే రెండో డోసు తీసుకోవడంలో చాలామంది నిర్లక్ష్యం వహిస్తుండటంతో వారి సెల్‌ నంబర్లకు వైద్యఆరోగ్యశాఖ మెసేజ్‌లు పంపుతున్నారు. రెవెన్యూ, ఐసీడీఎస్‌, పంచాయతీరాజ్‌, ఐకేపీ సిబ్బంది సహకారంతో ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తున్నారు. అంతేగాక అక్కడిక్కడే వ్యాక్సిన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

వ్యాక్సిన్‌ తీసుకుంటేనే మేలు..

కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసుల తీసుకుంటేనే రోగనిరోధక శక్తిపెరిగి ఉపయోగం ఉంటుందని, వ్యాక్సిన్‌ తీసుకున్నా జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్‌తో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్‌ ఉండవు. కొంతమందికి తలనొప్పి, జ్వరం రావడం, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉన్నా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. అదే విధంగా వ్యాక్సిన్‌ తీసుకున్నా విధిగా మాస్క్‌ ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలి. అంతేగాక ఎప్పటికప్పుడు శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకుంటేనే మూడో ముప్పు నుంచి బయటపడతామని నిపుణులు చెబుతున్నారు.

వ్యాక్సిన్‌తోనే రక్షణ : డాక్టర్‌ పెండెం వెంకటరమణ, సూర్యాపేట జిల్లా వ్యాక్సినేషన్‌ ఇన్‌చార్జి

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాక్సిన్‌తో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో కరోనా సోకినా ఇబ్బందులు ఉండవు. వ్యాక్సిన్‌ వేసుకున్నా జాగ్రత్తలు విధిగా పాటించాల్సిందే. మాస్క్‌ ధరించడంతోపాటు సామాజిదూరం, శానిటైజర్‌ వంటి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి.

వంద శాతం వ్యాక్సినేషన్‌కు సహకరించాలి

సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేటటౌన్‌: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్‌కు ప్రజలు సహకరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌, కొత్తబస్టాండ్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ సెంటర్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీకాలు అందుబాటులో ఉన్నాయని, మూడో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అపోహలు వీడి వ్యాక్సిన్‌ వేసుకోవాలన్నారు. ప్రజలకు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. ఆయన వెంట మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, కౌన్సిలర్‌ వెలుగు వెంకన్న, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

తొండ గ్రామంలో రహదారిపైనే టీకా వేస్తున్న ఏఎన్‌ఎం మాధవి

ఎక్కడ దొరికితే అక్కడే టీకా

తిరుమలగిరి రూరల్‌: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అర్హులు ఎక్కడ దొరికితే అక్కడే వైద్యసిబ్బంది కరోనా టీకా వేస్తున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో పర్యటించిన ఆశాకార్యకర్తలు, గ్రామ ఏఎన్‌ఎం మాధవి పలువురికి టీకా వేశారు. అనంతరం గ్రామ రహదారి వద్ద వేచి చూసి ఆ దారిలో వెళుతున్న తొండ గ్రామానికి చెందిన గండమళ్ల అనిల్‌ అక్కడే టీకా వేశారు. ఇలా ఎనిమిది మందికి టీకా వేశారు. 

Advertisement
Advertisement