‘టాయ్‌లెస్‌’.. మహిళలకు మాత్రమే!

ABN , First Publish Date - 2022-06-15T07:52:07+05:30 IST

సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగితేనే సంతృప్తి అంటోంది నేటితరం. అలాంటి వాళ్లలో లక్ష్మీ మీనన్‌ ఒకరు.

‘టాయ్‌లెస్‌’..  మహిళలకు మాత్రమే!

వ్యాపారమంటే కేవలం లాభాపేక్ష కాదని కొందరు యువ వ్యాపారవేత్తలు ఆలోచిస్తున్నారు.సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగితేనే సంతృప్తి అంటోంది నేటితరం. అలాంటి వాళ్లలో లక్ష్మీ మీనన్‌ ఒకరు. కేరళకు చెందిన ఈమె ప్రయాణాలు చేసే మహిళలకు శుభ్రమైన వాష్‌రూమ్స్‌ సదుపాయం కలిగించాలనే ఉద్దేశంతో ‘టాయ్‌లెస్‌’ అనే స్టార్టప్‌ కంపెనీ ప్రారంభించారు. 


‘‘అది ఆగస్టు 2021..

కొచ్చి నుంచి కాసర్‌గడ్‌కి వెళ్తున్నా. దాదాపు 265 కిలోమీటర్ల ప్రయాణమది. దారి వెంట హోటళ్లు, షాపులు, చిరువ్యాపారులుండే స్థలాలు ఖాళీగా కనిపించాయి. కరోనా దెబ్బ, ఈ-కామర్స్‌ సంస్థల వల్ల వీళ్లు దెబ్బతిన్నారని అర్థమైంది. పెద్ద హోటల్స్‌లో మాత్రమే టాయ్‌లెట్స్‌ శుభ్రంగా ఉంటాయి. అయితే అక్కడికి అందరూ పోలేరు కదా అనిపించింది. చిన్న హోటల్స్‌లో, రోడ్డు పక్కన టాయ్‌లెట్స్‌లో చూసినా అశుభ్రంగా కనిపించాయి. ఆ రోజు కేవలం మహిళలకోసం ఏమీ చేయలేమా? అని ఆలోచించా. అలా ‘టాయ్‌లెస్‌’ స్టార్ట్‌పకి అంకురార్పణ పడింది. 


ఇదీ నా నేపథ్యం.. 

కేరళలోని కొట్టాయం దగ్గర ఉండే పల్లెటూళ్లో పుట్టి పెరిగా. ఇంటీరియర్‌ డిజైనింగ్‌తో పాటు ఫ్యాషన్‌, క్లే పాట్‌, హ్యాండీ క్రాఫ్ట్‌ డిజైనర్‌ను. ‘ప్యూర్‌ లివింగ్‌’ పేరుతో ఓ సంస్థను స్థాపించా. హోమ్‌సైన్స్‌లో డిగ్రీ చదివిన నేను ఫ్యాషన్‌ రంగంలో న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌ వరకూ వెళ్లొచ్చా. నేను గీసిన ‘హే ఆర్ట్‌’ కనీసం వేల పుస్తకాలకు ముఖచిత్రంగా ఉపయోగించుకున్నారు. ఇక సామాజిక బాధ్యతగా ప్లాస్టిక్‌కు దూరంగా ‘పేపర్‌ పెన్‌’ కాన్సెప్ట్‌ తీసుకొచ్చా. నా పనితీరును చూసి దేశంలోనే కాకుండా విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు చర్చించడానికి ఆహ్వానించాయి. ‘ఏదైనా రియలైజ్‌ కావటమే గొప్ప. పని చేస్తే రేపటి రోజు నీదే అవుతుంది’ అని యువతకు చెబుతుంటా. నేను ఏ పని చేసినా.. సామాజిక బాధ్యత కోణంలోనే ఆలోచిస్తుంటా.


‘టాయ్‌లెస్‌’ ప్రత్యేకత...

కేరళ వరదల సమయంలో, కరోనా సమయంలో నావంతు సాయం చేశా. ఈ సమాజానికి ఏదోటి చేయాలనే కాంక్ష చిన్నప్పటి నుంచే ఉండేది. చదువు పూర్తయ్యాక.. అది కూడా కరోనా వ్యాపిస్తున్న సమయంలో ఈ ఆలోచన కలిగింది. మహిళలు కాసేపు ఫ్రెషప్‌ అవ్వటానికి చక్కని వాష్‌రూమ్‌ ఎలా ఉండాలో డిజైన్‌ చేశా. అద్దంతో పాటు తువాలు ఏర్పాటు ఉంటుంది. మొబైల్‌ ఉంచుకోవటానికి, ఛార్జింగ్‌కు ఓ బాక్స్‌ ఉంటుంది. దుపట్టా, బ్యాగ్‌ తగిలించుకోవటానికి హుక్స్‌ ఉంటాయి. టిష్యూలు, డస్ట్‌బిన్‌ ఉంటాయి. వాష్‌రూమ్‌ ఎప్పుడూ పొడిగా ఉండాలి. ఇదే ప్రమాణాలు ‘టాయ్‌లె్‌స’లో ఉంటాయి. హోటల్స్‌, రెస్టారెంట్స్‌, బొటిక్స్‌, వాణిజ్య స్థలం, మ్యారేజ్‌ గార్డెన్స్‌ దగ్గర ఒప్పందం కుదుర్చుకున్నా. వీటిని ఉయోగించుకోవాలంటే యాభై రూపాయలు చెల్లించాలి. ఎందుకంటే ఆ నిర్వహణ బాధ్యత ఆ స్థలం వారిదే కాబట్టి.


అదే నాలక్ష్యం

ఖతర్‌లోని ఓ మలయాళీ సాఫ్ట్‌వేర్‌ టెక్కీ మా ప్రయత్నం చూసి ఫోన్‌ చేశారు. వెబ్‌ యాప్‌ డెవలప్‌ చేశారు. కేరళలోని ఏ ప్రాంతాల్లో ‘టాయ్‌లెస్‌’ వాష్‌రూమ్స్‌ ఎక్కడున్నాయో సులభంగా గుర్తించవచ్చు. గూగుల్‌లో అయినా చెక్‌ చేసుకోవచ్చు. భవిష్యత్‌లో ‘టాయ్‌లెస్‌’ పవర్‌ఫుల్‌ మార్కెటింగ్‌ టూల్స్‌ అవుతాయి. వాటిమీద యాడ్స్‌ వేయచ్చు. నేటి యువతరం వారికుండే సొంత స్థలంలో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కేఫ్‌ లాంటి ప్రదేశాల్లో వీటిని నిర్వహించవచ్చు. సామాజిక బాధ్యత ఉండే వాళ్లు ఆలోచిస్తే సరి. ఆ టాయ్‌లెట్‌ తన నిర్వహణకి తానే సంపాదించుకుంటుంది. ‘టాయ్‌లెస్‌’ కేవలం మహిళలకే. పురుషులకు కాదు. భవిష్యత్‌లో ‘టాయ్‌లెస్‌’ కాన్సెప్ట్‌ కేరళ అంతా వ్యాప్తిచేయాలన్నదే నా లక్ష్యం’’


టాయ్‌లెట్స్‌ నిర్వహణ అంత సులువు కాదు. చెప్పాపెట్టకుండా వెళ్లి మేం తనిఖీ చేస్తుంటాం. నిబంధనలు పాటిస్తేనే ఫ్రాంచైజీలను కంటిన్యూ చేస్తున్నాం. టాయ్‌లెట్స్‌ క్లీన్‌ చేసే వారిని గౌరవించాలి. వాష్‌రూమ్స్‌ శుభ్రంగా ఉంచడం మాకు ప్రతి రోజూ సవాల్‌. ‘టాయ్‌లెస్‌’ బావుందనే ఫీడ్‌బ్యాక్‌ మమ్మల్ని నడిపిస్తోంది. 

Updated Date - 2022-06-15T07:52:07+05:30 IST