Abn logo
Oct 30 2020 @ 14:39PM

టీపీసీసీ చీఫ్ మార్పుకు బ్రేక్ పడిందా?

టీపీసీసీ చీఫ్ మార్పుకు బ్రేక్ పడిందా? ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియ ఆగిపోయిందా? మొన్నటి దాకా ఈ విషయంపై జోరుగా చర్చలు సాగించిన నాయకులు ఇప్పుడు సైలెంట్‌ అయ్యారా? టీపీసీసీ పదవి చేపట్టాలని ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసిన నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు? కొత్త ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్ పార్టీ నేతలకు ఎలాంటి ఆదేశం ఇచ్చారు? అందుకోసం టీకాంగ్రెస్ నేతలు పడుతోన్న పాట్లు ఏంటి? 


తెలంగాణ పీసీసీ అధ్యక్షుని మార్పు ఖాయమని హస్తం పార్టీలో కొన్నేళ్లుగా జోరుగా జరుగుతున్న చర్చకు సడన్‌గా బ్రేక్ పడింది. ఆయన స్థానంలో సీనియర్లకు అవకాశం ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే కొత్త ఇంన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్ నియామకం తర్వాత సీన్‌ మారిపోయింది. అప్పటివరకు రాష్ట్ర సారథి మార్పుపై జరిగిన ప్రచారం ఒక్కసారిగా తెరమరుగైంది. తమకు అవకాశం ఇవ్వాలని బహిరంగంగానే మాట్లాడిన నాయకులు, హస్తినలో తెరవెనుక ప్రయత్నాలు చేసిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. నిజానికి పీసీసీని మారుస్తారని ఎప్పటినుంచో పార్టీలో చర్చజరుగుతోంది. గత ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ కుంతియాను, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను మార్చాలంటూ ఢిల్లీ పెద్దలకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. అయితే రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్న అధిష్టాన పెద్దలు...ఇటీవల కుంతియాను తప్పించి మాణికం ఠాగూర్‌కు కొత్త ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. దాంతో ఉత్తమ్ కుమార్ రెడ్డే తరువాయి అన్న చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడటం పొలిటికల్ గ్రౌండ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 

పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. కంటిన్యూగా ఆరో ఏడాది కూడా ఆయనే ప్రెసిడెంట్‌గా కొనసాగడం ఓ రికార్డుగానే కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే ఉత్తమ్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయి విజయాలు సాధించక పోయినా.. హైకమాండ్‌ మాత్రం ఆయనపై విశ్వాసాన్ని కోల్పోలేదు.  అపజయాలకు బాధ్యుడిగా రాష్ట్ర నేతల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తినా..ఆయన్నే కొనసాగిస్తోంది. అయితే లోక్‌సభ, హుజూర్ నగర్ ఉప ఎన్నికల తర్వాత తాను తప్పుకోవడానికి రెడీ అంటూ అధిష్టాన పెద్దలకు ఉత్తమ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన స్థానంలో కొత్త పీసీసీ చీఫ్‌ కోసం హైకమాండ్ కసరత్తు చేసినట్లు గుసగుసలు వినిపించాయి. వివిధ వర్గాల ద్వారా కొత్త అధ్యక్షుడి కోసం సర్వేలు జరిపించినట్లు చర్చ జరిగింది. ఈ తరుణంలో ఆశావహులు ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలో ఒకరికి తెలంగాణ పార్టీ పగ్గాలు దక్కొచ్చనే వార్తలు వినిపించాయి. అయితే ఓ వైపు వరుస ఓటములు, మరోవైపు పీసీసీ మార్పుపై రోజుకో వార్త రావడంతో పార్టీ శ్రేణుల్లో స్తబ్దత ఏర్పడింది.


పీసీసీ మార్పు అంశానికి కొత్త ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ వ్యూహాత్మకంగా ఫుల్ స్టాప్ పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేతలెవరూ బహిరంగంగా మాట్లాడకుండా హితబోధ చేశారట. మీడియాలో పార్టీకి డ్యామేజ్ జరిగేలా ప్రకటనలు ఇచ్చే నేతల నుంచి వెంటనే వివరణ కోరుతున్నారట. పనిచేసే వారికే పదవులని తేల్చి చెబుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ప్రతీ నాయకుని పనితీరును లెక్క కడతామని, నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాసమస్యలపై పోరాడే వారికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందన్నట్లు చర్చ జరుగుతోంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలను కూడా బూత్ స్థాయి నుంచి లెక్కలు తీసి నాయకుల పనితీరుకు మార్కులు వేస్తామని ప్రకటించారు. అక్కడి ఇంఛార్జీలు మెజారిటీ ఓట్లు సాధించేలా గ్రామాలు, మండలాలకు వెళ్లాలని ఆదేశించారు. ప్రతీ రోజు ఏ గ్రామంలో ప్రచారం చేసింది, అక్కడ పార్టీ పరిస్థితిని వాట్సాప్ ద్వారా తనకు వివరించాలని నాయకులకు ఆయన నిర్దేశించారు. 


ఠాగూర్‌ అసలే రాహుల్ దూత కావడం, పదవులకు పనితీరు ప్రామాణికం అని చెప్పడంతో హస్తం పార్టీ నాయకులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆ కారణంగానే ప్రస్తుతం పీసీసీ విషయంలో నేతలంతా సైలెంట్ అయినట్లు చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక నుంచే తమ పనితీరును ఋజువుచేసుకోవాలని ఇన్‌ఛార్జ్‌లు ప్రయత్నిస్తున్నారట. ఇక్కడ మెజారిటీ ఓట్లు సాధించి ఠాగూర్‌ దృష్టిలో పడాలని తెగ ఆరాట పడుతున్నారట. అభ్యర్థిపై ఆధారపడకుండా ఎన్నికల ఖర్చును సైతం ఇంఛార్జీలుగా వెళ్లినవారే భరిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇలా నేతలంతా దుబ్బాకలో తిష్టవేసి ప్రచార బిజీలో ఉండటంతో ప్రస్తుతానికి పీసీసీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికైతే బ్రేక్‌ పడింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ విషయంపై దృష్టిసారించే అవకాశాలుండొచ్చని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అయితే దుబ్బాకలో గెలిచినా ఓడినా 2021 మార్చి వరకు ఉత్తమ్ పదవికి డోకా ఉండదని మరికొందరు వాదిస్తున్నారు. మార్చి లో ఉత్తమ్ థర్డ్ టర్మ్ పదవీ కాలం పూర్తి అవుతుందని..అప్పుడు మాత్రమే ఆయన్ని తొలగించాలా, కంటిన్యూ చేయాలా అనేది అధిష్టానం ఆలోచిస్తుందని చెబుతున్నారు. మొత్తంగా ప్రస్తుతం పీసీసీ మార్పుపై ప్రచారానికి ఫుల్ స్టాప్ పడటం, దుబ్బాక ఉప ఎన్నికలో నేతలంతా ఐక్యంగా పనిచేయడంతో కేడర్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement