Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీఆర్‌ఎస్‌ డ్రామా ముగిసింది

  • బీజేపీతో ఆ పార్టీకి ఒప్పందం కుదిరింది
  • నేడే ఎంపీలంతా హైదరాబాద్‌కు వచ్చేస్తారు
  • బియ్యం మాయంపై సీబీఐ దర్యాప్తు చేయాలి: రేవంత్‌


న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలుకు సంబంధించి పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీల డ్రామా ముగిసిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, కేంద్రం నిర్లక్ష్యంపై కాంగ్రెస్‌ తెలిపిన నిరసన, రైతుల బాధలను కప్పిపుచ్చడానికి టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి నాటకాలాడాయని ఆరోపించారు. రెండు పార్టీల ఒప్పం దం మేరకే వారం పది రోజులు హడావిడి చేశారన్నారు. ఇక మంగళవారం నుంచి పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసనలు తెలపరని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్‌కు ఆదేశాలు వెళ్లాయని, దీంతో ఎంపీలందరినీ హైదరాబాద్‌ రావాల్సిందిగా కేసీఆర్‌ ఆదేశించారని పేర్కొన్నారు. మంగళవారం కొద్దిసేపు హడావిడి చేసి మధ్యాహ్నం తర్వాత మాయమవుతారని తెలిపారు. సోమవారం ఢిల్లీలో రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇన్నాళ్లూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ప్లకార్డులు పట్టుకొని ఫొటోలు దిగి.. సభలో ఆందోళన చేస్తున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.


నిజంగా నిరసన తెలపాలని ఉంటే సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి ఎందుకు ఆ పని చేయడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ వచ్చి జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేయాలని, చివరి గింజ వరకూ ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల కల్లాల్లో రైతులు అల్లాడుతున్నారని, వారి గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చలికి వణికి, వానకు తడిసి కొందరు చనిపోయారని చెప్పారు. రోజుకు ఐదారుగురు రైతులు చనిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. మరణించిన రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని, తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. 


రైస్‌ మిల్లర్ల కోసమే లక్ష్యం తగ్గింపు..

ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాలు చేపడుతోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. అయినా ముఖ్యమంత్రి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. ఇప్పటివరకు కోటి 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొంటామని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని ప్రకటించి తాజాగా 25 లక్షల మెట్రిక్‌ టన్నులు తగ్గించారని తెలిపారు. రైస్‌ మిల్లర్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని, రైస్‌ మిల్లర్ల మాఫి యా చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వం బందీ అయి రైతులను మిల్లర్లకు అప్పజెబుతోందన్నారు. ప్రభుత్వం కేవలం 32 శాతం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. ప్రతీ ఏటా నిర్దేశిత లక్ష్యం కంటే దాదాపు 25 శాతం తక్కువగా ఉప్పుడు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందటూ కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఇందుకు కారణం ఎవరని ప్రశ్నించారు.


తనిఖీల్లో వరంగల్‌లో 25 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం తక్కువగా ఉన్నట్లు తేలిందని, కేంద్ర మంత్రి ప్రకటించినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. నిధుల గోల్‌మాల్‌ జరిగితే కేంద్రం సీబీఐ దర్యాప్తు ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. ఈ గోల్‌మాల్‌లో బీజేపీ పాత్ర ఏంటో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ నేతలు అక్రమాలకు పాల్పడితే వారిని బీజేపీ ఎందుకు కాపాడుతోందని అన్నారు. సీబీఐ దర్యాప్తు జరిపించి నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 


ఆగని ఆందోళనలు

ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌: రబీ సీజన్‌ ప్రారంభం అవుతున్నా, ఖరీఫ్‌ కష్టాలను అన్నదాతలు ఇంకా దాటలేదు. రాష్ట్రంలో పలుజిల్లాల్లో ఇంకా ధాన్యం అమ్ముకోవటానికే నానా కష్టాలు పడుతున్నారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటం, కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవటం, తరుగు పేరిట దోపిడీ, బ్యాంకులో జమ అయిన నగదు ఇవ్వకపోవటం వంటి కారణాలతో అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు. సోమవారం కూడా పలుచోట్ల ఆందోళనలు జరిగాయి. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జగిత్యాల జిల్లా ఎఖీన్‌పూర్‌లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారని భూషన్‌రావుపేట, కథలాపూర్‌ మండలంలోని భూషన్‌రావుపేటలో ధర్నా చేశారు.  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం గట్టేపల్లి, రాంపూర్‌ తండా రైతులు ఆందోళన చేశారు. కాగా, బ్యాంకులో జమ అయిన ధాన్యం డబ్బులను ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా లింగంపేటలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు ఎదుట రైతులు బైఠాయించారు.  

Advertisement
Advertisement