మహోన్నత వ్యక్తి జైపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-17T08:31:49+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సాధనలో కేంద్ర మాజీ మంత్రి దివంగత జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయ విలువలు

మహోన్నత వ్యక్తి జైపాల్‌రెడ్డి

స్వరాష్ట్ర ఏర్పాటులో ఆయనది కీలక పాత్ర : రేవంత్‌

స్ఫూర్తి స్థల్‌లో జైపాల్‌రెడ్డికి ప్రముఖుల నివాళులు

కవాడిగూడ/అనంతగిరి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో కేంద్ర మాజీ మంత్రి దివంగత జైపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయ విలువలు పాటించిన మహోన్నత వ్యక్తి, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, ఉత్తమ రాజకీయ నాయకుడిగా, కాంగ్రె్‌సవాదిగా దేశానికే వన్నె తెచ్చారని కొనియాడారు. ఆదివారం జైపాల్‌రెడ్డి 80వ జయంతిని పురస్కరించుకొని నెక్లె్‌సరోడ్‌లోని జైపాల్‌రెడ్డి స్ఫూర్తి స్థల్‌లో రేవంత్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రిగా జైపాల్‌రెడ్డి చేసిన కృషి వల్లే హైదరాబాద్‌కు మెట్రో వచ్చిందని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాకారంలో జైపాల్‌రెడ్డి చొరవ ఎంతో ఉందని చెప్పారు.


జైపాల్‌రెడ్డి ఆలోచనలు, సూచనలతోనే ఆ ప్రాజెక్టు మంజూరయిందని తెలిపారు. ఏ శాఖ చేపట్టినా సమర్థంగా నిర్వహించే ఘనత జైపాల్‌రెడ్డికే సొంతమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొనియాడారు. జైపాల్‌రెడ్డి జయంతి రోజున సీఎం కేసీఆర్‌ నివాళులర్పించకపోవడం బాఽధాకరమన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదంపై తర్జన భర్జన పడుతుంటే సభ నియమాలు తెలిసిన జైపాల్‌రెడ్డి సూచనలతోనే పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందిందని అని ప్రొఫెసర్‌ కోదండరాం పేర్కొన్నారు. మారుమూల ప్రాంతంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఉత్తమ పార్లమెంటేరియన్‌, కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన నేత జైపాల్‌రెడ్డి అని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు. టీపీసీసీ నేతలు మధుయాష్కీ, అంజన్‌కుమార్‌, మల్లు రవి, మాజీ మంత్రులు గీతారెడ్డి, చిన్నారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఏఐసీసీ నేత సంపత్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, బీజేపీ నేత వివేక్‌, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి, తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణ మోహన్‌ తదితరులతో పాటు జైపాల్‌రెడ్డి కుటుం బ సభ్యులు, అభిమానులు స్ఫూర్తి స్థల్‌లో జైపాల్‌రెడ్డికి నివాళులర్పించారు.


టీఆర్‌ఎ్‌సది దోపిడీ పాలన: ఉత్తమ్‌

‘ల్యాండ్‌, శాండ్‌, మైన్స్‌, వైన్స్‌ పేరిట దోచుకుందాం.. దాచుకుందాం’ అన్న విధంగా టీఆర్‌ఎస్‌ పాలన ఉందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం రైతు బంధు సంబరాలను నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్తమ్‌ మాట్లాడారు. తెలంగాణలో ఫసల్‌ బీమా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే డబ్బు చెల్లించాలని, లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఉత్తమ్‌ హెచ్చరించారు.

Updated Date - 2022-01-17T08:31:49+05:30 IST