ఆడుకునేందుకు వెళ్లి మృత్యు ఒడిలోకి

ABN , First Publish Date - 2020-09-24T11:01:08+05:30 IST

తండ్రి సైన్యంలో ఉండగా తల్లి, సోదరితో కలిసి ఉంటున్న ఆరేళ్ల బాలుడు అదృశమైన కొన్ని గంటలకే చెరువులో పడి విగతజీవుడైన విషా

ఆడుకునేందుకు వెళ్లి మృత్యు ఒడిలోకి

చెరువులో పడి ఆరేళ్ల బాలుడి దుర్మరణం

అదృశ్యమైన కొన్ని గంటలకే ఘటన

పీలేరు కోటపల్లెలో విషాదం


పీలేరు, సెప్టెంబరు 23: తండ్రి సైన్యంలో ఉండగా తల్లి, సోదరితో కలిసి ఉంటున్న ఆరేళ్ల బాలుడు అదృశమైన కొన్ని గంటలకే చెరువులో పడి విగతజీవుడైన విషాద సంఘటన బుధవారం పీలేరు పట్టణంలో జరిగింది.  కోటపల్లెలోని జి.వి.చంద్రశేఖర్‌ నగర్‌లో ఆర్మీ ఉద్యోగి వెంకటరమణారెడ్డి కుటుంబం నివాసం ఉంది. ఉద్యోగరీత్యా వెంకటరమణారెడ్డి కోయంబత్తూరులో విధులు నిర్వహిస్తుండగా భార్య పూజిత కుమార్తె, కుమారుడితో కలసి కోటపల్లెలో ఉంటున్నారు. వెంకటరమణారెడ్డి కుమారుడు వరుణ్‌రెడ్డి (6) మంగళవారం సాయంత్రం ఆడుకునేందుకు ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యాడు.


దీంతో తల్లి పూజిత ఇరుగు పొరుగు వారితో కలిసి బాలుడి కోసం పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లేకపోవడంతో అదృశమైనట్లు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా రంగంలోకి దిగి బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి దాటినా ఎక్కడ ఆచూకీ దొరకలేదు. దీంతో బాలుడు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కోటపల్లె శివారులోని మోటచెరువులో బాలుడు శవం తేలియాడుతున్నట్లు బుధవారం ఉదయం స్థానికులు  గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ శివకుమార్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు.


అనంతరం పూజితాను పిలిపించి మృతదేహాన్ని చూపగా చనిపోయింది తన కుమారుడేనని ఆమె గుర్తించారు. విగతజీవిగా పడివున్న బాలుడిని చూసి తల్లి, బంధువులు గుండెలు పగిలేలా రోధించారు. ఈ ఘటన కోటపల్లెలో విషాదాన్ని నింపింది. ఆడుకేందుకు వెళ్లిన చిన్నారి కొన్ని గంటల్లోనే శవమవడంతో ఆ తల్లి  గుండెలు బాదుకుంటూ విలపించడం అక్కడివారిని కంటతడి పెట్టించింది.


మంగళవారం భోజనం చేసిన తర్వాత నిద్రపోయిన వరుణ్‌రెడ్డి సాయంత్రం నిద్రలేచిన తర్వాత ఆడుకునేందుకు వెళ్లాడని, అంతకు ముందు ఉదయం కొందరు యువకులు చేపలు పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లగా స్నేహితులతో కలిసి ఆ బాలుడు కూడా సరదాగా వారి వెంట వెళ్లినట్లు తెలిసింది. చేపల సరదాతో తిరిగి సాయంత్రం కూడా చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. పోలీసులు బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-09-24T11:01:08+05:30 IST