Abn logo
Jan 27 2021 @ 00:12AM

ఢిల్లీలోని రైతులకు మద్దతుగా ట్రాక్టర్‌ ర్యాలీ

ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం నుంచి ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

ఆదిలాబాద్‌టౌన్‌, జనవరి 26: దేశ జనాభాలో 70శాతం ఉన్న రైతులకు అన్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో 60 రోజులుగా ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా జిల్లా కేంద్రంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం నుంచి కిషాన్‌చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయాల్సింది పోయి కార్పొరేట్‌ వ్యవస్థకు లాభం చేసే విధంగా నడుస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఇన్‌చార్జీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌, మాజీ మార్కెట్‌ చైర్మన్లు నర్సింగ్‌రావ్‌, సంజీవ్‌రెడ్డి, రూరల్‌ జడ్పీటీసీ అభ్యర్థి గంగాధర్‌, పార్టీ నాయకులు తదితరులున్నారు.

రైతు సంఘాల నాయకుల బైక్‌ ర్యాలీ..

ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా జిల్లా కేంద్రంలో రైతు సంఘాల నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రైతులను నట్టేట ముంచే చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంత వరకు నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇందులో రైతు సంఘాల నాయకులు ముడుపు ప్రభాకర్‌రెడ్డి, బండి దత్తాత్రి, సంగెపు బొర్రన్న, కిరణ్‌, అరుణ్‌ కుమార్‌, లక్ష్మణ్‌, లోకారి పోశెట్టి తదితరులున్నారు.

Advertisement
Advertisement