వ్యాపారులు కరోనా జాగ్రత్తలు పాటించాలి

ABN , First Publish Date - 2021-04-12T05:59:20+05:30 IST

జిల్లాలో కరోనా తీవ్ర రూపం దాలుస్తుందని పట్టణంలోని స్ర్టీట్‌ వెండర్స్‌, కూరగాయలు, పండ్లు, దుకాణ వ్యాపారస్థులు తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ ఆదేశించారు.

వ్యాపారులు కరోనా జాగ్రత్తలు పాటించాలి
కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులకు సూచనలు చేస్తున్న అదనపు కలెక్టర్‌

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 11: జిల్లాలో కరోనా తీవ్ర రూపం దాలుస్తుందని పట్టణంలోని స్ర్టీట్‌ వెండర్స్‌, కూరగాయలు, పండ్లు, దుకాణ వ్యాపారస్థులు తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్‌, మెప్మా, మున్సిపల్‌ శానిటరి, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల తో కలిసి జిల్లా కేంద్రంలోని అన్ని మార్కెట్‌లను సందర్శించి ఆదివారం తనిఖీ చేపట్టారు. కూరగాయలు, పండ్లు విక్రయించే వారు తగిన జాగ్రత్తలు తీసుకో వాలని, ప్లాస్టిక్‌ గ్లాసులు వినియోగించాలని సూచించారు. దుకాణదారులు, సూపర్‌ మార్కెట్‌ నిర్వాహకులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకో వాలని, మాస్కులు ధరిస్తేనే సరుకులు అందించాలని ఆదేశించారు. ఇందులో ఇన్‌చార్జి డీఆర్‌వో రాజేశ్వర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, మెప్మా మేనేజర్‌ సుభాష్‌ తదితరులున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ట్రాఫిక్‌ సీఐ గంగాధర్‌ సూచించారు. ఆదివారం పట్టణంలోని పంజాబ్‌చౌక్‌ వద్ద గల ట్రాలీ డ్రైవర్లకు, స్థానిక ప్రయాణికులకు కరోనా నిబంధనలు తెలియజేస్తూ జాగ్రత్తలు పాటించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్లు రామారావు, అబ్దుల్‌బాకీ, సిబ్బంది తదితరులున్నారు.

మాస్కు లేకుంటే వెయ్యి జరిమానా..

మాస్కు లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయల జరిమానా కట్టాల్సిందేనని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఈ నిబంధనలు ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్లకు సూచిస్తూ ఆదివారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బోథ్‌ రూరల్‌: 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఎంపీడీవో రాధ తెలిపారు. ఆదివారం మండలంలోని పట్నాపూర్‌ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలని అలాగే భౌతిక దూరాన్ని పాటించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పంద్రం సుగుణ శంకర్‌, అంగన్వాడి సుశీల, ఆత్రం మోహన్‌, తోడసం గోపాల్‌ పాల్గొన్నారు.

నార్నూర్‌: ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఎస్సై  మాదాసు విజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం మండలంలోని నడ్డంగూడ గ్రామంలో ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   భౌతిక దూరాన్ని పాటిస్తూ బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలన్నారు.  ఆయన వెంట పోలీసు సిబ్బంది సంతోష్‌, బాలాజీ తదితరులు ఉన్నారు.

ఉట్నూర్‌: ఉట్నూర్‌ వారసంతలో ఆదివారం ఆటోకు మైకు పెట్టి ప్రజలకు కరోనా పట్ల  అవగాహన కల్పించారు. బయటకు వెళ్లే వారు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజర్‌ను ఉపయోగించాలని, పంచాయతీ ఇన్‌చార్జి ఈవో ఉప్పుల సత్యనారాయణ, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ నూర్‌సింగ్‌, ఎలమల మనోహర్‌ ఉన్నారు.

ఇంద్రవెల్లి: ప్రతి వ్యాపారి విధిగా మాస్కులు ధరించి తమ లావాదేవీలను నిర్వహించుకోవాలని ఎస్సై ఎస్‌ నాగనాథ్‌ ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని పలు వ్యాపారుస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మాస్కు లేకుండా తిరిగుతున్న వారికి వెయ్యి చొప్పున జరిమానా విధించామని తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

జైనథ్‌: ఇచ్చోడ మండలంలో పోలీసులు అవగాహన  చేపట్టారు. ఆదివారం చించోలి, జల్దా, ధర్మపురి గ్రామాల్లో ఇచ్చోడ ఎస్సై ఫరీద్‌ ఆధ్వర్యంలో ప్రచారాన్ని చేపట్టారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, 45ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. 

భీంపూర్‌: గోనా ఎక్స్‌రోడ్డులో మాస్కులు లేకుండా తిరుగుతున్న ఐదుగురికి జరిమానా విధించి వారితో మాస్కులు ధరింప చేశామని ఎస్సై అరీఫ్‌  అన్నారు. మహారాష్ట్ర సరిహద్దు సమీపాన ఉన్న భీంపూర్‌ మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సై హెచ్చరించారు.

సిరికొండ: మండలంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలని ఎస్సై కృష్ణకుమార్‌ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. మండలంలోని లక్ష్మీపూర్‌(బి) గ్రామపంచాయతీలోని తుమ్మలపాడ్‌లో కరోనా కేసులు పెరిగిన దృష్ట్యా కరోనాపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-12T05:59:20+05:30 IST