వణికిస్తున్న చలి

ABN , First Publish Date - 2022-01-31T05:11:20+05:30 IST

జిల్లాను చలి వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా చలిగాలులతో పాటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. తీవ్రమైన చలిగాలులతో ప్రజలు అనారోగ్యం భారిన పడుతున్నారు.

వణికిస్తున్న చలి
చలి తీవ్రతతో చలిమంట వేసుకుంటున్న ప్రజలు

- జిల్లాలో అమాంతంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

- 12.02 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

- చెలరేగుతున్న చల్లటి ఇదురు గాలులు

- మరో వారం రోజుల పాటు ఇదేతరహాలో వాతావరణం ఉంటుందంటున్న అధికారులు


కామారెడి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): జిల్లాను చలి వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా చలిగాలులతో పాటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. తీవ్రమైన చలిగాలులతో ప్రజలు అనారోగ్యం భారిన పడుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనే తేడా లేకుండా రోజంతా శీతలగాలులు వీస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో చలిగాలులు పెరిగి ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా జ్వర పీడితులు పెరిగారు. థర్డ్‌వేవ్‌తో సతమతం అవుతుంటే ప్రతీ ఇంట్లో జలుబు, జ్వరం, గొంతు సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువవుతున్నారు. జిల్లాలో ఆదివారం 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత్ర నమోదైంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు ఎక్కువ శాతం బయటకు రాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

అమాంతంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

జిల్లా పరిధిలో గత వారం రోజుల వ్యవధిలోనే ఉష్ణోగ్రతలు అమాంతంగా పడిపోయాయి. వారం రోజుల కిందట కనిష్ఠ ఉష్ణోగ్రత 16.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా ఆదివారం 12.02 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతకు పడిపోయింది. దీంతో చలి తీవ్రత అధికమైంది. తెల్లవారు జామున పనులు చేసుకునేవారు చలిని తట్టుకోలేకపోతున్నారు. చల్లటి వాతావరణం ఉండడంతో తమ పనులు చేసుకోవడానికి వారు అవస్థలు పడుతున్నారు. అలాగే కూలీనాలి చేసుకునే కార్మికులు జీవనోపాధి కోసం రాత్రిళ్లు వాచ్‌మెన్‌ విధులు నిర్వహించే వారు మంట వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉత్తర దిశ నుంచి వీస్తున్న చలిగాలులతో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలితో రక్తం మందంగా మారే అవకాశం ఉన్నందున బీపీ, షుగర్‌, గుండె సంబంధ వ్యాధులున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. కాగా చలిగాలులతో ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు జ్వరం, జలుబు, దగ్గు, వంటి సమస్యలతో బాధపడుతున్నారు.

డోంగ్లీలో 8 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

చలి ప్రభావం కామారెడ్డి జిల్లాపై తీవ్రంగానే ఉంది. జిల్లాలోని పలు మండలాల్లో, గ్రామాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలోనే పడిపోయాయి. మద్నూర్‌ మండలం డోంగ్లి గ్రామంలో 8 డిగ్రీల సెల్సియస్‌కు అమాంతంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మద్నూర్‌ మండల కేంద్రంలో 9.5, లింగంపేటలో 9.4, మాచారెడ్డి మండలం లచ్చంపేటలో 10.1, గాంధారి మండలం రామలక్ష్మణపల్లిలో 8.9, బిచ్కుంద మండలం పుల్కల్‌, జుక్కల్‌లో 10.1, మాచారెడ్డి మండలం ఇసాయిపేటలో, గాంధారిలో, ఎల్లారెడ్డి మండలం మచాపూర్‌లో 10.4, బీబీపేటలో 10.6, బీర్కూర్‌లో 10.7, పిట్లంలో 10.8,  నిజాంసాగర్‌ మండలం మద్దుంపూర్‌, దోమకొండ, నాగిరెడ్డిపేట, పెద్దకొడప్‌గల్‌, భిక్కనూర్‌లో, నస్రూల్లాబాద్‌, బాస్సువాడ కొల్లూర్‌, కామారెడ్డి పాతరాజంపేట, రామారెడ్డి, రాజంపేట,  సదాశివనగర్‌, తాడ్వాయిల్లో 11.5 కనిష్ఠ సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చలితో వ్యాధుల భారిన పడుతున్న ప్రజలు

జిల్లాలో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండడంతో  ప్రజలు జాగ్రత్త వహించాలని వైద్యులు పేర్కొంటున్నారు. చలితో వ్యాధుల భారిన పడుతూ ఆసుపత్రులకు ఎక్కువగా వస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చలితీవ్రత పెరుగుతున్నందున కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌కు చలి ప్రభావం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉండనున్నాయని ప్రజలు ఎప్పటికప్పుడు మాస్క్‌లు, శానిటైజర్‌లు వాడడంతో పాటు భౌతికదూరం పాటించాలని పేర్కొంటున్నారు. చలితీవ్రత వల్ల వృద్ధులు, చిన్నారులు ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిదనే సూచనలు చేస్తున్నారు.

Updated Date - 2022-01-31T05:11:20+05:30 IST