Abn logo
Nov 22 2020 @ 04:06AM

వణికిస్తున్న వన్య మృగాలు

Kaakateeya

ఆళ్లపల్లి మండలంలో ఆవును చంపిన పులి 

గుండాల మండలంలో పాదముద్రల గుర్తింపు 

ఎలుగుబంటి దాడిలో గిరిజన రైతుకు తీవ్ర గాయాలు

పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు


గుండాల/ఆళ్లపల్లి/తలమడుగు, నవంబరు 21: వన్య మృగాలు జనావాసాల్లోకి చొరబడి తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని అడవుల్లో పులి సంచారంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఆళ్లపల్లి మండలంలో పాతూరు పరిధిలోని కర్ణగూడెం గ్రామంలో తన ఆవును పులి చంపిందని ఆ గ్రామానికి చెందిన కొమరం సత్యనారాయణ అనే రైతు తెలిపాడు. గుండాల మండలం బాటన్ననగర్‌లోని అడవుల్లో పులి సంచరించినట్లు అడుగుజాడల ఆధారంగా అధికారులు గుర్తించారు. ఆళ్లపల్లి మండలంలో మర్కోడు ప్రాంతంలోని కర్ణగూడెం అడవుల్లో పులి జాడను కనుగొనేందుకు అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.


పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోడు రైతులు మొక్కజొన్న, పత్తి చేల వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని మారుమూల గ్రామాలకు చెందిన వాహనదారులు, ఇతర గ్రామాలకు వాహనాలపై వెళ్లేందుకు భయపడుతున్నారు. పులి సంచారంపై అటవీశాఖాధికారులు నిఘా పెట్టడడంతో పాటు, అడవుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరో ఘటనలో ఎలుగుబంటి దాడిలో గిరిజన రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలోని నందిగామ గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన గిరిజన రైతు లక్ష్మణ్‌ రోజూలాగే ఉదయం తన పొలానికి వెళ్లాడు. పనుల్లో నిమగ్నమైన ఆయనపై ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. మధ్యాహ్నం వేళ గమనించిన తోటి కూలీలు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. తల, కడుపు భాగంలో తీవ్ర గాయాలు కావడంతో రైతు పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
Advertisement