టమోటా మార్కెట్‌లో ట్రాఫిక్‌ కష్టాలు

ABN , First Publish Date - 2021-06-05T05:51:03+05:30 IST

మదనపల్లె టమోటా మార్కెట్‌లో ట్రాఫిక్‌ కష్టాలు అధికమయ్యాయి. పరిష్కరించాల్సిన మార్కెటింగ్‌ శాఖ, పోలీసులు పట్టించుకోవడం లేదు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే టమోటా ట్రాక్టర్లు, మినీ ట్రక్కులు, ఆటోలు మార్కెట్‌లో సరుకు దించి వెలుపలికి వెళ్లడం గగనంగా మారింది.

టమోటా మార్కెట్‌లో ట్రాఫిక్‌ కష్టాలు
టమోటా మార్కెట్‌లో నిలిచిపోయిన వాహనాలు

మదనపల్లె, జూన్‌ 4: మదనపల్లె టమోటా మార్కెట్‌లో ట్రాఫిక్‌ కష్టాలు అధికమయ్యాయి. పరిష్కరించాల్సిన మార్కెటింగ్‌ శాఖ, పోలీసులు పట్టించుకోవడం లేదు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే టమోటా ట్రాక్టర్లు, మినీ ట్రక్కులు, ఆటోలు మార్కెట్‌లో సరుకు దించి వెలుపలికి వెళ్లడం గగనంగా మారింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటలకు వరకూ ట్రాఫిక్‌ స్తంభించి పోతోంది. నీరుగట్టువారిపల్లె రోడ్డుపై వాహనాలు నిలిచిపోతున్నాయి. అలాగే ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఇదే పరిస్థితి. దిగుబడి గణనీయంగా పెరిగిపోవడంతో మార్కెట్‌ను టామోటాలు ముంచెత్తుతున్నాయి. ధర లేకపోయినా రైతులు టామోటాలను పొలంలో వదిలేయలేక మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. కొత్త పంట కూడా చేతికి రావడంతో  వారంరోజులుగా రోజూ వెయ్యి నుంచి 1200 మెట్రిక్‌ టన్నులు టమోటాలు వస్తున్నాయి. స్థానిక పంటతోపాటు బయటి ప్రాంతాల రైతులూ టమోటాను ఇక్కడికే తెస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో మార్కెట్‌ సాంతం ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ధరల పతనానికి ఇది కూడా ఓ కారణమని అటు రైతులు, ఇటు వ్యాపారులు చెబుతున్నారు.  లారీలు లోడ్‌ చేసిన ఐదారు గంటలకు కానీ వాహనాలు వెలుపలికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో బయటి మార్కెట్‌కు సకాలంలో చేరుకునే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కొందరు వ్యాపారులు ఈ సీజన్‌లో మదనపల్లె మార్కెట్‌కు రావడానికి భయపడుతున్నారు. అధికారులు మండీలకు లైసెన్సులు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేయడం, లైసెన్సు ఒక చోట ఉంటే, మరోచోట మండీలు నిర్వస్తుండడం, తమకు కేటాయించిన స్థలం కంటే ఎక్కువగా ఆక్రమించి వ్యాపారం చేస్తుండడంతో ఈ పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు మండీలో స్థలం ఉన్నా... రోడ్డుపై క్రేట్లు పెట్టి టమోటాలు పేర్చడం, తదితర కారణాలతో రాకపోకల సమస్య తీవ్రరూపం దాల్చింది. రద్దీకి తగినట్లు వచ్చే వెళ్లే వాహనాలను అటు అధికారులు, ఇటు పోలీసులు నియంత్రించ లేకపోవడంతో ఇష్టానుసారం వ్యవహిస్తూ సమస్యకు కారణమవుతున్నారు.


రేషన్‌ సరుకుల సరఫరాలో అంతరాయం


మార్కెట్‌యార్డు ఆవరణలోనే సివిల్‌ సప్లయ్స్‌ గోదాము ఉంది. ఇక్కడి నుంచే మదనపల్లె మున్సిపాలిటీ, మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట మండలాల పరిధిలోని 165 చౌకదుకాణాలకు బియ్యం, చెక్కెర, కందిపప్పు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయాల్సి ఉంది. సాయంత్రం నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ మార్కెట్‌ను ట్రాఫిక్‌ ముంచెత్తడంతో నిత్యావసర వస్తువులు సరఫరా చేసే లారీలు మధ్యలో ఇరుక్కుపోతున్నారు. రోజుకు ఒక ట్రిప్పుతోలడమే కష్టంగా ఉందని కాంట్రాక్టర్‌ వాపోతున్నారు. రాత్రిలోడు చేసుకున్న వాహనాలు ఉదయాన్నే వెళ్లడం తప్పా, తిరిగి గోదామునకు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో మధ్యాహ్నం 12గంటలకు రోడ్లు మూసేస్తుండడం, దీనిపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. కరోనా నేపథ్యంలో కేంద్రం ఇస్తున్న అదనపు కోటా కారణంగా ప్రతి దుకాణానికి రెండు  సార్లు సరకులు సరఫరా చేయాలని, సకాలంలో అవి చేరాలంటే ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్‌ కోరుతున్నారు.

Updated Date - 2021-06-05T05:51:03+05:30 IST