ట్రాఫిక్ పోలీసులు మకతిక!
ABN , First Publish Date - 2021-10-18T06:25:56+05:30 IST
కారు నడిపినా వాళ్లు హెల్మెట్ ధరించాలా? వీధిలో ఇంటి ముందు వాహనాన్ని పార్కింగ్ చేయకూడదా?... అంటే నగర పోలీసుల తీరుచూస్తే అవుననే అనుమానం కలుగుతున్నది. పోలీసులు జారీ చేస్తున్న ట్రాఫిక్ ఈ-చలానాలను పరిశీలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే!
కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోవాలా?
బైక్ రైడర్లు సీటు బెల్టు ధరించాలా?
ఉల్లంఘనల పేరుతో వాహనదారులకు అడ్డగోలుగా ఈ-చలానాలు
లబోదిబోమంటున్న బాధితులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కారు నడిపినా వాళ్లు హెల్మెట్ ధరించాలా? వీధిలో ఇంటి ముందు వాహనాన్ని పార్కింగ్ చేయకూడదా?... అంటే నగర పోలీసుల తీరుచూస్తే అవుననే అనుమానం కలుగుతున్నది. పోలీసులు జారీ చేస్తున్న ట్రాఫిక్ ఈ-చలానాలను పరిశీలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే!
ట్రాఫిక్ సమస్య పెరగడంతో పలువురు వాహనచోదకులు సిగ్నల్స్‌ను, నిబంధనలను పట్టించుకోవడంలేదు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా ఇవి తగ్గడంలేదు. దీంతో నగరంలో పనిచేస్తున్న హోంగార్డు నుంచి సీఐ వరకూ అందరికీ ట్రాఫిక్ ఉల్లంఘనుల ఫొటోలు తీసి, ఈ-చలాన్ నమోదు చేసేందుకు ఉన్నతాధికారులు అనుమతిచ్చారు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, మైనర్లు వాహనాలను నడుపుతున్నా, సిగ్నల్ జంపింగ్‌కు పాల్పడినా... ఆయా హోంగార్డులు, కానిస్టేబుళ్లు తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి, వారి వివరాలు, లొకేషన్ పేర్కొంటూ ఎస్‌ఐ, సీఐలకు పంపించాలి. ఆ అధికారులు తమ సెల్‌ఫోన్‌లోని యాప్‌లోకి అప్‌లోడ్ చేసి వాహనం నంబర్ ఆధారంగా యజమానికి జరిమానాతో కూడిన ఈ-చలాన్ జారీచేస్తారు. అయితే పోలీసుల నిర్లక్ష్యం, బాధ్యతారహిత్యం కారణంగా.... పొరపాటు చేయని వాహనచోదకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కారుని నడిపేవారికి కూడా హెల్మెట్ ఉండాలని, బైక్ నడిపేవారు సీటుబెల్ట్ పెట్టుకోవాలని, వీధిలో వాహనం పార్కింగ్ చేశారంటూ ట్రాఫిక్ పోలీసులు ఈ-చలానాలు జారీచేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగాఏపీ 31ఏఎక్స్441 నంబరు గలకారుని ఎంవీపీకాలనీ సర్కిల్ వద్ద హెల్మెట్ లేకుండా నడుపుతున్నారని పేర్కొంటూ కారు ఫొటోతో సహా ఈ-చలాన్ జారీ చేశారు. అలాగే ఏపీ39ఎఫ్‌ఏ 3768 నంబరు గల ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తికారుకి ట్రిపుల్ రైడింగ్, వితవుట్ హెల్మెట్ పేరుతో రూ.635 జరిమానా విధిస్తూ ఈ-చలాన్ జారీచేయడం విశేషం. అలాగే ఒక వ్యక్తి పెదవాల్తేరులో తన ఇంటి ముందు కారు పార్కింగ్ చేస్తే నోపార్కింగ్ పేరుతో ఈ-చలాన్ జారీచేశారు. ఇలా చెప్పుకుంటూపోతే చాంతాడంత జాబితా ఉంది. తాము ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్టు జరిమానా విధిస్తూ ఈ-చలాన్ వివరాలు సెల్‌ఫోన్ల్‌ను వస్తుండడంతో వాహనదారులు ఉలిక్కిపడుతున్నారు. ఈ-చలాన్‌లో పేర్కొన్న సమయంలో తమవాహనం ఇంటి వద్దనే వుందని నిర్ధారించుకున్న సదరు వాహన యజమానులు... ఈ-చలాన్‌కు సంబంధించిన మెసేజ్‌ను వెబ్‌సైట్‌లో పరిశీలిస్తే అది వేరొకరి వాహనంగా గుర్తించి అవాక్కవుతున్నారు. వీటిపై పలువురు పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు.