Hyderabad లో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యస్తం.. వాహనదారుల విలవిల..!

ABN , First Publish Date - 2021-09-06T17:06:29+05:30 IST

Hyderabad లో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యస్తం.. వాహనదారుల విలవిల..!

Hyderabad లో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యస్తం.. వాహనదారుల విలవిల..!

  • గుంతల రోడ్లపై ముందుకు కదలని వాహనాలు
  • ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సమస్య మరింత జఠిలం

హైదరాబాద్‌ సిటీ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రోడ్డుపై ఏర్పడ్డ గుంతలు.. కంకరతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు సాగుతున్న ప్రాంతాల్లో సమస్య మరింత జఠిలంగా ఉన్నా ట్రాఫిక్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారుల విలువైన సమయం వృథా అవుతోంది. రెండేళ్ల క్రితం వర్షాకాలంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించిన ట్రాఫిక్‌ పోలీసులు నివారణ చర్యలు చేపట్టడానికి అప్పట్లో నడుం కట్టారు. దానికోసం ప్రత్యేకంగా సర్వే చేశారు. బ్లాక్‌స్పాట్‌లను గుర్తించారు. అక్కడ ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. కానీ ప్రస్తుతం సమస్యలు మళ్లీ మొదలయ్యాయి.


పలు ప్రాంతాల్లో ఇలా..

- అత్తాపూర్‌ నుంచి డైరీఫాం వరకు వెళ్లే రోడ్డుపై పిల్లర్‌ నెంబర్‌ 160 నుంచి 180 మధ్యలో చిన్న పాటి వర్షానికే నాలుగు నుంచి ఐదు అడుగుల నీరు నిలిచిపోతోంది. వాహనదారులు గంటల తరబడి ఇక్కడ నరకం చూస్తున్నారు.

- బహదూర్‌పురా క్రాస్‌రోడ్స్‌ వద్ద మూడేళ్లుగా సాగుతున్న ఫ్లైఓవర్‌ నిర్మాణం పుణ్యమా అని ట్రాఫిక్‌ వ్యవస్థ ఏళ్ల తరబడి అస్తవ్యస్తంగా మారింది. వర్షాలు కురుస్తు న్న సమయంలో అక్కడ వాహనాలు ముందుకు కదలడం లేదు. యూ టర్న్‌ కారణంగా వాహనదారులను రెండేసి కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి రావ డంతో గుంతల రోడ్లలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరుగుతోంది. ఫ్లై ఓవర్‌ కింది నుం చి వాహనదారులు నేరుగా వెళ్లే అవకాశం కల్పిస్తే సమస్య పరిష్కారమవుతుంది. 

- టోలీచౌకి ఫ్లై ఓవర్‌ పుణ్యమా అని అక్కడా అదే దుస్థితి. అక్కడా రెండు వైపులా రోడ్డును ఆక్రమించుకున్న నిర్మాణ పనుల కారణంగా చిన్న దారిలో భారీ వాహనాలు వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారుతోంది. ఓ ట్రాఫిక్‌ అధికారిని అక్కడ కేటాయిస్తే సమస్యను అధిగమించవచ్చు.

- గోల్కొండ ఖిల్లా లోపల రెండు చోట్ల సిగ్నల్స్‌ ఉన్నా వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. వర్షాలు పడుతున్న సమయంలో స్థానికులే అప్పుడప్పుడు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. 

- చాంద్రాయణగుట్ట రుమాన్‌ హోటల్‌ నుంచి ఫ్లై ఓవర్‌ వరకు తవ్విన తవ్వకాల కారణంగా ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నిర్మాణం చేపట్టడం అభినందనీయమే అయినా, వాహనదారులకు ప్రత్యామ్నాయం చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

- ఫలక్‌నుమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనుల నిమిత్తం ఆరు నెలల పాటు (ఆగస్టు 31 వరకు) ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గడువు ముగిసింది. కానీ ఇప్పటి వరకు సగం పని కూడా కాలేదు. ప్రత్యామ్నాయ దారి లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు సందులు, గల్లీలు తిరుగుతూ వెళ్తుండగా కార్లకు, ఇతర పెద్ద వాహనాల సమస్య వర్ణనాతీతం. 

- సంతో్‌షనగర్‌లో రక్షాపురం కాలనీ గేటు నుంచి ఓవైసీ హాస్పిటల్‌ వరకు ప్లైఓవర్‌ నిర్మాణ పనులు సాగుతున్నా... ప్రత్యామ్నాయ దారులు లేవు. ప్రమాదాలు జరుగుతున్నా ట్రాఫిక్‌ సిబ్బంది కనిపించడం లేదు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఎన్నో సమస్యలు నగరంలో ప్రతి రోజు వాహనదారులు ఎదుర్కొంటున్నారు. 

Updated Date - 2021-09-06T17:06:29+05:30 IST