పండుగ పూట విషాదం

ABN , First Publish Date - 2022-01-17T03:51:50+05:30 IST

సంక్రాంతి పండుగ రోజున జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. సరదా కోసం గాలి పటాలు ఎగురవేసే చైనా మాంజా దారం మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి మెడకు చుట్టుకుని గొంతు తెగి మృతిచెందిన సంఘటన కలకలం రేపింది.

పండుగ పూట  విషాదం
పతంగుల దుకాణంలో తనిఖీలు నిర్వహిస్తున్న సీఐ నారాయణనాయక్‌

గొంతుకు మాంజా దారం చుట్టుకొని వ్యక్తి దుర్మణం

ఏసీసీ, జనవరి 16: సంక్రాంతి పండుగ రోజున జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. సరదా కోసం గాలి పటాలు ఎగురవేసే చైనా మాంజా దారం మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి మెడకు చుట్టుకుని గొంతు తెగి మృతిచెందిన సంఘటన కలకలం రేపింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మం డలం గుంజపడుగు గ్రామానికి చెందిన పాస్తం భీమన్న (36) బతుకుదెరువు కోసం కుటుంబ సభ్యులతో కలిసి 10 సంవత్స రాలుగా పాత మంచిర్యాలలో అద్దెకు ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంట్లో కోడిని కోసే క్రమంలో చేతికి గాయం కాగా జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. తిరిగి పాత మంచిర్యాల వైపు మోటార్‌సైకిల్‌పై వస్తుండగా మంచిర్యాల-లక్షెట్టిపేట నేషనల్‌ హైవేపై గాలిపటం ఎగురవేసేందుకు ఉపయోగించిన చైనా మాంజా దారం భీమన్న మెడకు చుట్టుకుని కింద పడిపో యాడు. గొంతు కోసుకుపోయి తీవ్రరక్తస్రావం కాగా స్ధానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య శారద,  కొడుకు, కూతురు ఉన్నారు.  మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ  తహసీనుద్దీన్‌ తెలిపారు. 

నిషేధం ఉన్నా

చైనా మాంజాను ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధిం చింది.  అయినప్పటికీ పతంగుల షాపుల్లో యథేచ్ఛగా వాటిని విక్రయిస్తున్నారు. చైనా మాంజా వినియోగంతో గతంలో అనేక ప్రమాదాలు జరుగగా, ప్రస్తుతం ఏకంగా మనిషి ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. మాంజా విక్ర యాలు జరుగకుండా చర్యలు చేపట్టవలసిన అధికారుల నిర్ల క్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఊహించని రీతి లో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు బాధ్యులనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

షాపుల్లో తనిఖీలు

మాంజా దారం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడంతో పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆదివారం పట్టణం లోని పతంగుల దుకాణాల్లో పోలీసులు బృందాలుగా ఏర్పడి పట్టణ సీఐ నారాయణనాయక్‌ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ చైనా మాంజా దారాన్ని ప్రభుత్వం నిషేధించిందని, నిబంధనలు ఉల్లంఘించి మాంజాను విక్రయించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పక్షులకు, మనుషులకు హాని చేసే చైనా మాంజా దారాన్ని దుకాణదారులు అమ్మ వద్దని, ప్రజలు కొనుగోలు చేయవద్దని సూచించారు.  

Updated Date - 2022-01-17T03:51:50+05:30 IST