విహారంలో విషాదం

ABN , First Publish Date - 2021-11-29T04:21:22+05:30 IST

అందరిలాగే ఆ యువకుడు కూడా స్నేహితులతో పిక్నిక్‌కు బయలుదేరాడు. మిత్రులతో ఆటలు ఆడాడు. సరదాగా కేరింతలు కొట్టాడు. మధ్యాహ్నం భోజనం అనంతరం కూడా అందరితో ఉత్సాహంగా జలాశయంలోకి దిగాడు. అంతవరకు నవ్వుతూ కనిపించిన ఆ యువకుడు క్షణాల్లో మునిగిపోయాడు. కలవరపడిన తోటివారంతా కష్టపడి బయటకు తీసుకొచ్చారు.

విహారంలో విషాదం
రౌతు దుర్గాప్రసాద్‌, దళాయి సంతోష్‌ (ఫైల్‌ఫొటోలు)

జంఝావతి రబ్బరుడ్యాంలో పడి విద్యార్థి మృతి

కొమరాడ/ పార్వతీపురం రూరల్‌/ బొబ్బిలి రూరల్‌, నవంబరు 28: అందరిలాగే ఆ యువకుడు కూడా స్నేహితులతో పిక్నిక్‌కు బయలుదేరాడు.  మిత్రులతో ఆటలు ఆడాడు. సరదాగా కేరింతలు కొట్టాడు. మధ్యాహ్నం భోజనం అనంతరం కూడా అందరితో ఉత్సాహంగా జలాశయంలోకి దిగాడు. అంతవరకు నవ్వుతూ కనిపించిన ఆ యువకుడు క్షణాల్లో మునిగిపోయాడు. కలవరపడిన తోటివారంతా కష్టపడి బయటకు తీసుకొచ్చారు. స్నేహితుడ్ని ఎలాగైనా బతికించుకుందామని వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. వారొకటి తలిస్తే విధి మరోలా చేసింది. ఆస్పత్రిలో చేర్చకుముందే ప్రాణాలు తీసుకుపోయింది. పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన రౌతు దుర్గాప్రసాద్‌ (17) విషాదాంతమిది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

ప్వాతీపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులంతా ఆదివారం పిక్నిక్‌ వేసుకున్నారు. జంఝావతి రబ్బరుడ్యాం చూసేందుకు వెళ్లారు. మధ్యాహ్న భోజనం అనంతరం నీరు పారే ప్రాంతంలో స్నానం కోసం కొందరు విద్యార్థులు దిగారు. వారితో పాటు రౌతు దుర్గాప్రసాద్‌ కూడా ఉన్నాడు. స్నానం చేసే ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండడంతో పాటు ఈత రాక దుర్గాప్రసాద్‌ కొద్దిక్షణాల్లోనే మునిగిపోయాడు. తోటి స్నేహితులు రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చి పార్వతీపురం వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో దుర్గాప్రసాద్‌ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రయోగమూర్తి తెలిపారు. దుర్గాప్రసాద్‌ మృతితో తల్లిదండ్రులు కృష్ణ, లక్ష్మి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు స్థానిక ఏరియా ఆసుపత్రికి వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు.

బొబ్బిలిలో ఐటీఐ విద్యార్థి

బొబ్బిలి మండలం భోజరాజపురం వద్ద వేగావతి నదీ తీరానికి పిక్నిక్‌ కోసం వెళ్లిన ఐటీఐ విద్యార్థి దళాయి సంతోష్‌ (17) అనుకోని కష్టంతో ఆదివారం మృతి చెందాడు. స్నేహితులతో సరదాగా వెళ్లిన యువకుడు అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మృతికి ఇద్దమిధ్ధమైన కారణాలేవీ తెలియరాలేదు. వేగావతిలోని గోతిలో పడి ఈతరాక మునిగిపోయి ఉండవచ్చునని, ఫిట్స్‌ రావడంతో ఇసుకలో కూరుకుపోయి ఊపిరాడక మృతిచెంది ఉంటాడని తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు భావిస్తున్నారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంతోష్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావు తెలిపారు.  సంతోష్‌ తండ్రి మధుసూదనరావు పట్టణంలోని ఐటీఐ కాలనీలో నివాసముంటూ గ్రోత్‌సెంటరులోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. తల్లి పశుపోషణ చూస్తోంది. అక్క కావేరికి ఇటీవల పెళ్లయినట్లు బంధువులు తెలిపారు.




Updated Date - 2021-11-29T04:21:22+05:30 IST