విషాద గణాంకాలు!

ABN , First Publish Date - 2020-06-09T06:04:54+05:30 IST

మూడురకాల అబద్ధాలుంటాయట, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, గణాంకాలు. బాగా కోపంగా అన్నట్టున్నారు కానీ ఆ మాట, గణాంకాలకు వాటి ఉపయోగం వాటికి ఉంటుంది...

విషాద గణాంకాలు!

మూడురకాల అబద్ధాలుంటాయట, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, గణాంకాలు. బాగా కోపంగా అన్నట్టున్నారు కానీ ఆ మాట, గణాంకాలకు వాటి ఉపయోగం వాటికి ఉంటుంది. అట్లాగని, వాటితో సమస్య లేదని కాదు. ప్రకృతికి ఉన్నట్టే, మానవసమాజానికి కూడా పునరావృత్తమయ్యే సరళి ఉంటుంది. మానవసమూహాలకు, వారి స్వభావాలకు, ప్రవర్తనలకు, చర్యలకు, ఆలోచనలకు, వారి దైహిక, బౌద్ధిక నైపుణ్యాలకు, రుగ్మతలకు – కూడా ధోరణులు ఉంటాయి. విడి విడి జీవితాలే కానీ, స్థూలంగా పరిశీలించినప్పుడు పోలికలు, ఆవృత్తాలు, క్రమాలు ఆశ్చర్యకరంగా కనిపిస్తాయి. ఆ పరిశీలనలు మూకుమ్మడివి. అటువంటి పరిశీలనల ద్వారానే మానవవిజ్ఞానం అభివృద్ధి చెందింది. మూకుమ్మడి పరిశీలనలకు భిన్నంగా వ్యక్తిగత అనుభవాలు అనేకం ఉంటాయి. సూక్ష్మస్థాయి అవసరాలు స్థూల పరిశీలనలలో లెక్కకు రావు, లెక్కించరు. ఆ శాస్త్రధోరణిని పరిపాలనలో లేదా సమష్టి ఆచరణలో ఉపయోగిస్తున్నప్పుడు, అందులో వ్యక్తిగత స్పర్శ, మానవీయ ఆర్ద్రత లోపిస్తుంది. విధానాల అమలు కోసం, విజ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం కోసం స్థూల పరిశీలనలు పనికివస్తాయి కానీ, అవి మనుషులకు, సమాజానికి వెలిగా ఉన్న అంకెల వలె కనిపిస్తాయి. అందుకే స్టాలిన్‌ ఒక మాట అన్నాడు, ఒకరు చనిపోతే విషాదం, పదిలక్షల మంది చనిపోతే గణాంకం– అని. 


దేశంలో 20 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువ ఉన్నారు అన్న సమాచారం ఒక నిర్లిప్తతను కలిగిస్తుంది. అదే, రోజుకు డాలర్‌ ఆదాయం కూడా లేనివారు దేశంలో 20 కోట్ల మంది ఉన్నారు అన్న మాట, ఆ వాస్తవికతను హృదయానికి దగ్గరగా తీసుకువస్తాయి. దేశాల, రాష్ట్రాల, అంతర్జాతీయ సంస్థల భవిష్యత్‌ ప్రణాళికలు, పూర్వ నివేదికలు అన్నీ అంకెలతో కిటకిట లాడుతుంటాయి. ఆ అంకెలు వాస్తవంగా మనుషులకు బదులుగాఉన్న సంజ్ఞలు అని గుర్తింపు ఉండదు. స్థూలతను మాత్రమే చూసి నిర్దిష్టతను చూడలేకపోతే, 20 లక్షల కోట్ల ప్యాకేజీ అయినా, సామాన్యుడికి చిల్లిగవ్వగా కూడా అనుభవంలోకి రాదు. మార్క్‌ ట్వైన్‌ ఒకచోట అంటాడు, వాస్తవాలు చాలా కఠినమైనవి, గణాంకాలదేముంది ఎట్లా అయినా వంచుకోవచ్చు. 


జబ్బులు, అనారోగ్యాల విషయంలో కూడా గణాంకాలు మనలను పలకరిస్తాయి. ఫలానా జబ్బు లక్ష మందిలో ఒకరికి వస్తుంది, ఫలానా వ్యాధి ప్రతి వేయి మందిలో ఇద్దరికి వస్తుందని ఇట్లా చెబుతుంటారు. ఆ అంకెలు ఆ వ్యాధుల ధోరణులను చెబుతాయి. ఎవరికో వచ్చే జబ్బు మనకు రాదులే అన్న ధీమా కూడా ప్రజలలో కలిగించవచ్చు. అయితే, ఒక ప్రజావైద్య నిపుణుడు ఆ గణాంకాలను ఎద్దేవా చేశారు– లక్ష మందిలో ఒకరివి నీవే అయితే, ఆ గణాంకాలు నీకు చేసే మేలు ఏమీ లేదు, నీ దృష్టిలో వ్యాధి వ్యాప్తి నూటికి నూరుశాతమే. అట్లాగే, ఇప్పుడు కొవిడ్‌–19 వ్యాధి విషయంలో కూడా, నూటికి 80 మందికి ఆస్పత్రిలో చేరవలసిన అవసరం ఉండదని, చేరినవారిలో కూడా అతి తక్కువ మందికి మాత్రమే అత్యవసర సేవలు అవసరమవుతాయని, కేవలం 3 శాతం మాత్రమే మరణిస్తారని చెబుతున్నారు. ఈ అంకెలన్నీ నిజమే కావచ్చును. కానీ, ప్రజలు తమను తాము ఆ 3 శాతంలోనే చూసుకుంటున్నారు. 97 శాతంలో చూసుకోవాలని ప్రభుత్వం, నిపుణులు ఆశిస్తున్నారు కానీ, మానవ మనస్తత్వం అట్లా ఉండదు. పైగా, ఇతర జబ్బులున్నవారికి మాత్రమే మృత్యువు సంభవిస్తుంది, ఫలానా వయసు దాటిన వారికే ఎక్కువ ప్రమాదం– వంటి వివరాలు చెబుతున్నవారు– మెజారిటీ మనుషులలో స్థైర్యాన్నినింపుతున్నట్టు కనిపిస్తుంది కానీ, అందులో అమానవీయత కూడా ఉన్నది. వయసు మీరిన వారు చనిపోతే పరవాలేదా? ఇతర జబ్బులున్నవారి ప్రాణాలను తేలికగా తీసుకోవచ్చా? గణాంకాలను ఈ రకమైన ప్రయోజనాలకు వీలుగా అర్థం చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా పాలకులు, కొందరి ప్రాణాలను గాలికి వదిలేసి, విచక్షణారహితమైన సడలింపులు ఇస్తున్నారు.


సమాజంలో ఎంతగా భయం ఉన్నదంటే, క్వారంటైన్‌లో ఉన్నవారిని కూడా తమ నివాసాల మధ్య మెలగడానికి అనుమతించడం లేదు. కానీ, పాలకులు మాత్రం, పాజిటివ్‌ పేషంట్లను ఇళ్లలోనే ఉంచి చికిత్స చేస్తామంటున్నారు. అల్పాదాయ వర్గాలలోని వృద్ధులు, చిన్నపిల్లల ఆరోగ్యానికి పూచీ లేకుండానే, వ్యాధివ్యాప్తికి అనుకూలించే చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధి ముఖ్యమే, ఆర్థిక ప్రక్రియలు మొదలుకావడం ముఖ్యమే. కానీ, మొదలుకు చెడ్డ బేరమెందుకు? దైవస్థలాలను ప్రజలకు తెరవడం ఇప్పుడు అవసరమా? ప్రతి మత విధానంలోనూ, ఆపత్కాలంలో వ్యవహరించేదుకు అనేక వెసులుబాట్లు ఉన్నాయి. అంతే కాక, భగవంతుడు సర్వాంతర్యామి అని విశ్వసించి, ఎక్కడినుంచి అయినా ప్రార్థనలు, స్మరణలు చేసుకోవచ్చునని విశ్వసించేవారు ఉన్నారు. బార్లు, పబ్బులు ఇప్పుడు తెరవవలసిన అవసరం ఉన్నదా? తెరచినా, వారికి కావలసినంత వ్యాపారం జరుగుతుందా? ఇవన్నీ అంతిమంగా, బలహీనులను, వయోధికులను, ఇరుకు ప్రాంతాలలో నివసించేవారిని, పేదవారిని బలిపశువులుగా నిలబెడతాయి.


ఈ పరిస్థితి కొత్తదే. దీన్నిఎదుర్కొనడమూ కొత్తదే. పరిష్కారాలను వెదకడంలో ప్రజలను, ప్రజానిపుణులను కలుపుకొని పోవడం ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలవరచుకోవాలి. ఒకవైపున కేసుల, మరణాల అంకెలు భయపెడుతున్నాయి. మరోవైపు ప్రజల ముందుకు రావడానికి కూడా మొహమాటపడుతూ సడలింపులు చేస్తున్న నేతలూ భయపెడుతున్నారు. పరీక్షలు ఎవరెన్ని చేస్తున్నారన్న లెక్కలు, చర్చలు కావు, కట్టడిలో చిత్తశుద్ధి ఉన్నదా లేదా అన్నదే సమస్య.

Updated Date - 2020-06-09T06:04:54+05:30 IST