ట్రైన మిస్‌!

ABN , First Publish Date - 2021-10-18T04:51:53+05:30 IST

రెండు రైల్వే జోన్ల మధ్య తలెత్తిన సమన్వయలోపం ప్రయాణికులను ఇబ్బందికి గురిచేసింది.

ట్రైన మిస్‌!
పట్టికలో చూపుతున్న రైలు వేళలు

షెడ్యూల్‌లో చూపిన సమయం కంటే ముందే బయలుదేరిన రైలు

సవరణ షెడ్యూలు అప్‌డేట్‌ చేయని రైల్వే అధికారులు

రైల్వే అధికారులను నిలదీసిన ప్రయాణికులు 

గుంటూరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రెండు రైల్వే జోన్ల మధ్య తలెత్తిన సమన్వయలోపం ప్రయాణికులను ఇబ్బందికి గురిచేసింది. నెంబరు. 08197 టాటానగర్‌ - కాచిగూడ ప్రత్యేక రైలుకు తొలుత ఒక షెడ్యూల్‌ని ప్రకటించారు. ఈ రైలు శనివారం వేకువజామున 5.40 గంటలకు గుంటూరుకు వచ్చి 5.42కి బయలుదేరి వెళుతుంది. ఈ షెడ్యూల్‌ని రైల్వేబోర్డు 11వ తేదీన సవరించింది. సవరించిన సమయపట్టిక ప్రకారం గుంటూరుకు శనివారం వేకువజామున 3.50 గంటలకు వచ్చి 3.55 గంటలకు బయలుదేరి వెళుతుంది. అయితే సవరించిన షెడ్యూల్‌ని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో పాటు రైల్వే ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌లో అప్‌డేట్‌ చేయడాన్ని నార్త్‌ ఈస్టు రైల్వే జోన్‌ అధికారులు విస్మరించారు. అంతేకాకుండా కొత్తగా సత్తెనపల్లి, నల్గొండ రైల్వేస్టేషన్లలో ఇచ్చిన హాల్టింగ్‌లు కూడా కనిపించడం లేదు. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం 3.50 గంటలకు రావాల్సిన రైలు ఆలస్యంగా 5.15 గంటలకు వచ్చి 5.20 గంటలకల్లా బయలుదేరి వెళ్లిపోయింది. ఈ విషయం అడ్వాన్స్‌ టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకొన్న ప్రయాణీకులకు తెలియదు. వారంతా తాము ఎక్కాల్సిన రైలు వేకువజామున 5.40 గంటలకు వస్తుందని ఎదురుచూస్తూ గడిపారు. నిర్ణీత సమయానికి రాకపోవడంతో వెళ్లి ఎంక్వయరీ సిబ్బందిని వాకబు చేయగా మీరు ఎక్కాల్సిన రైలు వెళ్లిపోయిందని సమాధానం ఇచ్చారు.  చివరికి రైల్వే అధికారులు పీఆర్‌ఎస్‌లో సవరించిన టైంటేబుల్‌ అప్‌డేట్‌ కాలేదని తెలుసుకొని వచ్చి ప్రయాణికులకు నచ్చజెప్పి వారిని పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కి పంపించారు. కాగా ఆదివారం సాయంత్రం వరకు కూడా జరిగిన తప్పుని రైల్వే సరిదిద్దుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.  


Updated Date - 2021-10-18T04:51:53+05:30 IST