రైలులో పసిబిడ్డను అపహరించిన మహిళ అరెస్టు

ABN , First Publish Date - 2021-10-17T08:01:23+05:30 IST

విశాఖ-కాచిగూడ రైలులో పసిబిడ్డను అపహరించిన మహిళను అరెస్టు చేసినట్టు రైల్వే డీఎస్పీ బీవీఎస్‌ నాగేశ్వరరావు శనివారం తెలిపారు.

రైలులో పసిబిడ్డను అపహరించిన మహిళ అరెస్టు

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 16: విశాఖ-కాచిగూడ రైలులో పసిబిడ్డను అపహరించిన మహిళను అరెస్టు చేసినట్టు రైల్వే డీఎస్పీ బీవీఎస్‌ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం హుక్కంపేట డీబ్లాక్‌కు చెందిన ముళ్లపూడి భవాని అలియాస్‌ మేఖన డబ్బుకు ఆశపడి పిల్లలను అపహరించేది. ఆమె ఇంటికి సమీపంలో నివాసం ఉండే పొన్నాడ రామకృష్ణ, వెంకటరత్నం దంపతులు పరిచయంతో పిల్లలను తీసుకొచ్చి సంతానం లేని తల్లిదండ్రులకు అమ్మితే పెద్దమొత్తంలో డబ్బులు వస్తాయని ఆశపడింది. గతనెల 29న విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో విశాఖ-కాచిగూడ రైలులో సుభాష్‌ కుటుంబం నలుగురు పిల్లలతో కనిపించగా వారితో మాట కలిపి వారి 18నెలల పసిబిడ్డను అపహరించి రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో దిగింది. ఆ బిడ్డను హుక్కంపేటలోని రామకృష్ణ దంపతులకు ఇచ్చి వెళ్లిపోయింది. ఈ బిడ్డకు బేరం రాకపోవడంతో రామకృష్ణవద్దే బిడ్డను ఉంచుకున్నారు. రైల్వేస్టేషన్‌ సీఏపీ జయశంకర్‌ సమాచారంతో ఆర్‌పీ ఎస్‌ఐలు మావుళ్లు, శ్రీనివాస్‌ భవానిని అరెస్టు చేశారు. ఆమె ఇచ్చిన సమాచారంతో బిడ్డను దాచి ఉంచిన రామకృష్ణ దంపతులను అరెస్టు చేసి సుభాష్‌కు తన కుమారుడ్ని అప్పగించామన్నారు.


Updated Date - 2021-10-17T08:01:23+05:30 IST