దివ్యాంగులకు ఎక్కడికక్కడే రైల్వే పాస్‌లు

ABN , First Publish Date - 2022-01-20T05:41:01+05:30 IST

రైల్వేలో రాయితీ పాస్‌ల కోసం దివ్యాంగులు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయానికి రానవసరం లేదని గుంటూరు డివిజనల్‌ సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ నరేంద్రకుమార్‌ తెలిపారు.

దివ్యాంగులకు ఎక్కడికక్కడే రైల్వే పాస్‌లు

డీఆర్‌ఎం కార్యాలయానికి రానక్కర్లేదని సూచన

గుంటూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రైల్వేలో రాయితీ పాస్‌ల కోసం దివ్యాంగులు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయానికి రానవసరం లేదని గుంటూరు డివిజనల్‌ సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ నరేంద్రకుమార్‌ తెలిపారు. దరఖాస్తు పొందే దశ నుంచి ఐడీ కార్డు వరకు సమీపంలోని రైల్వేస్టేషన్‌లోనే సంప్రదించాలన్నారు. గుంటూరు, మంగళగిరి, రేపల్లె, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, నంద్యాల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ రైల్వేస్టేషన్లలో రైల్వే కమర్షియల్‌ విభాగం సిబ్బందిని సంప్రదిస్తే సరిపోతుందన్నారు. కీళ్ల ఎముకలకు సంబంధించిన వైకల్యం, మానసిక దివ్యాంగులు, 100 శాతం అంధత్వ వైకల్యం కలిగి వ్యక్తులు, 100 శాతం శాశ్వత మూగ, చెవిటి వైకల్యం కలిగిన వారికి మాత్రమే రైల్వే రాయితీ పాస్‌లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎక్కడికక్కడ రైల్వేస్టేషన్లలో దరఖాస్తులను పూర్తి చేసి, గవర్నమెంట్‌ డాక్టర్‌ జారీ చేసిన రైల్వే రాయితీ సర్టిఫికెట్‌ కాపీ(రైల్వే నమూనాలో పీడీఎఫ్‌), రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ముగ్గురు డాక్టర్ల సంతకం కలిగిన సదరం సర్టిఫికెట్‌, స్వీయ సంతకంతో ఉన్న ఫొటో గుర్తింపు కార్డు రుజువు కాపీ, పుట్టిన తేదీ, చిరునామా, లేటెస్టు కలర్‌ పాస్‌పోర్టు సైజు ఫొటోలు జత చేయాలన్నారు. దరఖాస్తు అందజేసి ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ పొందాలన్నారు. వాటిని పరిశీలించిన తర్వాత అర్హత కలిగిన దివ్యాంగులకు రైల్వే శాఖ గుర్తింపు కార్డులు జారీ చేస్తుందన్నారు. కార్డు తయారైన తర్వాత ఫోన్‌ నెంబర్‌కి ఎస్‌ఎంఎస్‌ ద్వారా మెసేజ్‌ వస్తుందన్నారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లను చూపించి ఎక్కడైతే దరఖాస్తు ఇచ్చారో అక్కడ గుర్తింపు కార్డు పొందవచ్చన్నారు. స్టేషన్‌కు రాలేని వారు అథారిటీ లెటర్‌ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. రెన్యువల్‌ చేసుకొనే వారు తమ పాత కార్డుని సమర్పించాలన్నారు. ఫొటో గుర్తింపుకార్డు, పుట్టిన తేదీ రుజువు కాపీ కోసం ఆధార్‌/పాస్‌పోర్టు/పాన్‌కార్డు/ఓటర్‌ఐడీ/ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన పత్రం సమర్పించాలని సూచించారు. చిరునామా రుజువు కోసం ఆధార్‌/టెలిఫోన్‌ బిల్లు/కరెంట్‌బిల్లు/గ్యాస్‌ బిల్లు జత చేస్తే సరిపోతుందని చెప్పారు. 

 


Updated Date - 2022-01-20T05:41:01+05:30 IST