రిజర్వేషన్‌ ఉంటేనే రైలు ప్రయాణం

ABN , First Publish Date - 2020-05-28T09:38:05+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పటి వరకు నిలిచిపోయిన రైళ్లు జూన్‌ 1నుంచి రాకపోకలు

రిజర్వేషన్‌ ఉంటేనే రైలు ప్రయాణం

జూన్‌ 1నుంచి జిల్లాకు ప్రత్యేక రైళ్లు


ఖమ్మం మామిళ్లగూడెం, మే 27: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పటి వరకు నిలిచిపోయిన రైళ్లు జూన్‌ 1నుంచి రాకపోకలు సాగించనున్నాయి. రైల్వేశాఖ చరిత్రలోనే ఇంత వరకు 55రోజుల  పాటు రైళ్లు బంద్‌కావడం ఇదే ప్రథమం. అయితే ప్రయాణికుల పరిస్థితి దృష్ట్యా జూన్‌ 1నుంచి రైళ్లు నడపడానికి ఆశాఖ కసరత్తు చేపట్టింది. దీనికోసం ఖమ్మం రైల్వేస్టేషన్‌ మీదుగా జూన్‌ 1నుంచి నాలుగు రైళ్లు నడువనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు.


ఈ రైళ్లలో ప్రయాణించాలంటే విధిగా రిజర్వేషన్‌ టిక్కెట్‌ను ప్రయాణికులు తీసుకోవాల్సిందేని ఆదేశాలు జారీ చేసింది. రైళ్లలో భౌతికదూరం పాటిం చడంతో పాటు విధిగా మాస్క్‌ను ధరించాలి. ఖమ్మం స్టేషన్‌లో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు రిజర్వేషన్‌ కౌంటర్‌ను తెరచి ఉంచుతామన్నారు. అయితే ఈ టిక్కెట్లు ఆన్‌లైన్‌లోనూ రిజర్వ్‌ చేసుకునే అవకాశం ఉంది. ప్రయాణికులు విధిగా ముందస్తుగానే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.


ఖమ్మం స్టేషన్‌కు వచ్చే రైళ్లు 

07202 సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు రైలు సాయంత్రం 5-10కి, 01019 ముంబయ్‌ నుంచి భువనేశ్వర్‌ మధ్యాహ్నం 12గంటలకు, 02805  విశాఖ నుంచి న్యూఢిల్లీ ఉదయం 5-45కి, 02728 హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణానికి వెళ్లడానికి రాత్రి 9-12గంటలకు ఖమ్మం స్టేషన్‌కు వస్తాయి. దిగువకు వచ్చే రైళ్లు 07201 గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు ఉదయం 8-36కి, 01020 భువనేశ్వర్‌ నుంచి ముంబైకి ఉదయం 6-34కి, 02806 న్యూఢిల్లీ నుంచి విశాఖపట ్టణానికి రాత్రి 8-01, విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌కు రాత్రి 8-48కి ఖమ్మం స్టేషన్‌కు చేరుకుంటాయి. 

 

రిజర్వేషన్‌ టిక్కెట్‌ ఉండాల్సిందే..ప్రసన్నకుమార్‌, చీఫ్‌ కమర్షియల్‌ అధికారి, ఖమ్మం

జూన్‌ 1నుంచి నిర్వహించే రైళ్లకు సాధారణ టిక్కెట్‌ లేదని ప్రయాణికులు విధిగా రిజర్వేషన్‌ టిక్కెట్‌ను తీసుకోవాలి. సాధారణ టిక్కెట్లను విక్రయించడం లేదు. రైళ్లలో నిల్చొని ప్రయాణించడాన్ని అనుమతించేది లేదు. అంతే కాదు ప్రయాణికులు రైలు రావడానికి ముందస్తుగానే స్టేషన్‌కు చేరుకోవాలి. స్టేషన్‌లో శుక్రవారం నుంచి రిజర్వేషన్‌ కౌంటర్‌ అందుబాటులోకి తీసుకొచ్చాం.

Updated Date - 2020-05-28T09:38:05+05:30 IST