ప్రైవేటు రూట్లలో రైలు టికెట్‌ ధరలు ప్రైవేటు ఇష్టానికే

ABN , First Publish Date - 2020-09-19T07:04:07+05:30 IST

దేశంలో కొన్ని రైల్వే రూట్లను ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం.. ఆ మార్గాల్లో రైలు టికెట్ల ధరలను నిర్ణయించుకునే హక్కును కూడా ప్రైవేటు ఆపరేటర్లకే వదిలేసింది.

ప్రైవేటు రూట్లలో రైలు టికెట్‌ ధరలు ప్రైవేటు ఇష్టానికే

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: దేశంలో కొన్ని రైల్వే రూట్లను ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం.. ఆ మార్గాల్లో రైలు టికెట్ల ధరలను నిర్ణయించుకునే హక్కును కూడా ప్రైవేటు ఆపరేటర్లకే వదిలేసింది. ఆ స్వేచ్ఛను వారికి ఇచ్చినట్టు రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ వెల్లడించారు. అయితే, ఆ రైళ్లు తిరిగే మార్గాల్లో ఏసీ బస్సులు, విమానాలు కూడా నడుస్తున్నాయని.. ప్రైవేటు ఆపరేటర్లు టికెట్‌ ధరలను నిర్ణయించే ముందు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. మరింత మంది పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 109 మార్గాల్లో రైళ్లను నడిపేందుకు ప్రైవేటు పెట్టుబడిదారుల నుంచి ప్రభుత్వం ‘రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌ (ఆర్‌ఎ్‌ఫక్యూ)’, అలాగే రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో అల్‌స్టోమ్‌ ఎస్‌ఏ, బొంబార్డియర్‌ ఇన్‌కార్పొరేషన్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ వంటి సంస్థలు ఇందుకు ఆసక్తి చూపాయి. ఈ ప్రాజెక్టు వల్ల వచ్చే ఐదేళ్లలో రైల్వే రంగంలో దాదాపు రూ.55 వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. 


యూజర్‌ చార్జీలు..

దేశంలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో టికెట్‌ చార్జీల్లో భాగంగా యూజర్‌ చార్జీలు కూడా వసూలు చేయడానికి రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటిన్నింటిలో ఈ చార్జీలు వసూలు చేయబోమని.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే 10-15 శాతం స్టేషన్లలో మాత్రమే (700 నుంచి 1050 స్టేషన్లలో) వసూలు చేస్తామని రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.


ఆధునికీకరించిన 50 స్టేషన్లలో మాత్రమే ఈ చార్జీలు వసూలు చేయాలని తొలుత భావించామని.. తర్వాత దాదాపు 1000 స్టేషన్లలో వసూలు చేయాలని నిర్ణయించామని ఆయన వివరించారు. యూజర్‌ చార్జీగా తక్కువ మొత్తాన్ని మాత్రమే వసూలు చేస్తామని వీకే యాదవ్‌ స్పష్టం చేశారు. ఆ సొమ్మును స్టేషన్ల ఆధునికీకరణకు వినియోగిస్తామని.. ఆ పని పూర్తయ్యాక ఆ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని పేర్కొన్నారు. విమానాశ్రయాల్లోలాగా.. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను రైల్వే స్టేషన్లలో కల్పించాలంటే యూజర్‌ చార్జీలు వేయక తప్పదని వీకే యాదవ్‌ అన్నారు. 


Updated Date - 2020-09-19T07:04:07+05:30 IST