ఘనంగా ప్రారంభమైన సర్పంచ్‌ల శిక్షణా తరగతులు

ABN , First Publish Date - 2021-07-23T05:22:27+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్పంచ్‌ల శిక్షణా తరగతులు జిల్లాలోని 5 కేంద్రాలలో గురువారం ఉద యం 9 గంటలకు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఘనంగా ప్రారంభమైన సర్పంచ్‌ల శిక్షణా తరగతులు
గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల శిక్షణా కరదీపికను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

 ఐదు కేంద్రాలలో 157 మందికి శిక్షణ


కడప(రూరల్‌), జూలై 22: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్పంచ్‌ల శిక్షణా తరగతులు జిల్లాలోని 5 కేంద్రాలలో గురువారం ఉద యం 9 గంటలకు ఘనంగా ప్రారంభమయ్యాయి. కడప డీపీఆర్‌సీలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాద్‌రెడ్డి, పులివెందుల లో పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రొద్దుటూరులో డీఎల్‌పీవో శివకుమారి, బద్వేల్‌లో మండల ప్రత్యేకాధికారి, రాజంపేటలో డీఎల్‌పీవో నాగరాజు ప్రారంభించారు. ఆయా శిక్షణా కేంద్రాలలో జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి, డీపీవో ప్రభాకర్‌రెడ్డి, కడప డీపీఆర్‌సీ కో-ఆర్డినేటరు సురేష్‌, మాస్టర్‌ ట్రైనర్స్‌ తదితర అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామ పంచాయతీ పాలనపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ సందేశాన్ని దృశ్య శ్రవణ విధానం ద్వారా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వినిపించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల శిక్షణా కరదీపికను ప్రారంభించి సర్పంచ్‌లకు అందజేశారు.

157 మంది సర్పంచ్‌లకు శిక్షణ : జిల్లాలో 792 మంది సర్పంచ్‌లు ఉండగా జూలై 22 నుంచి 24 వరకు మొదటి బ్యాచ్‌ శిక్షణలో భాగంగా 157 మందికి మాత్రమే శిక్షణను ప్రారంభించారు. మొదటి రోజు 5 అంశాలపై అవగాహన కల్పించారు.  కొవిడ్‌ నిబంధనలను అనుసరించి శిక్షణకు హాజరైన సర్పంచ్‌లకు, అధికారులకు, సిబ్బందికి సంబంధిత వైధ్యాధికారులు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. శానిటైజర్‌, మాస్క్‌లను అందుబాటులో ఉంచారు. శిక్షణలో భౌతికదూరాన్ని పాటించారు. 


సర్పంచ్‌లు గ్రామ స్వరాజ్యానికి పునాదులు : ఎమ్మెల్యే

సర్పంచ్‌లు గ్రామ స్వరాజ్య సాధనకు పునాధిలాంటి వారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి పేర్కొన్నారు. కడప జడ్పీ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో గురువారం కమలాపురం, రాయచోటి నియోజక వర్గాల సర్పంచ్‌లకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి ప్రధాని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత ప్రాముఖ్యమైన వారో గ్రామ పంచాయతీలో సర్పంచ్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందన్నారు. అంతటి గురుతర బాధ్యత ఉన్న సర్పంచ్‌లు గ్రామ పంచాయతీ పాలనపై సమగ్రమైన అవగాహన పెంపొందించుకొని గ్రామ స్వరాజ్య సాధనకు నడుం బిగించాలన్నారు. జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి, డీపీవో ప్రభాకర్‌రెడ్డిలు సర్పంచ్‌ల విధులు-బాధ్యతలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మాట్లాడారు.  


తనిఖీ చేసిన జాయింట్‌ కలెక్టర్‌

కడప డీపీఆర్‌సీ భవనంలో సర్పంచ్‌లకు ఇస్తున్న శిక్షణ తరగతులను జాయింట్‌ కలెక్టర్‌(అభివృద్ధి) సాయికాంత్‌ వర్మ గురువారం తనిఖీ చేశారు. సర్పంచ్‌ల మొద టి రోజు శిక్షణ సాయంత్రం 5-30 గంటలకు ముగుస్తుందనగా అర్ధగంట ముందు  కేంద్రానికి వచ్చారు. సర్పంచ్‌ల హాజరును పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లు, సదుపాయాల గురించి సర్పంచ్‌లను అడిగి తెలుసుకున్నారు. శిక్షణను సద్వినియోగం చేసు కోవాలని సూచించారు.

 

 

Updated Date - 2021-07-23T05:22:27+05:30 IST