5,000 మంది మహిళలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా శిక్షణ

ABN , First Publish Date - 2021-01-19T05:54:13+05:30 IST

దళిత యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి దళిత్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (డిక్కీ) అనేక చర్యలు తీసుకుంటోంది.

5,000 మంది మహిళలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా శిక్షణ

స్టార్ట్‌పలకు ప్రోత్సాహం

డిక్కీ ప్రెసిడెంట్‌ రవి కుమార్‌ వెల్లడి 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దళిత యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి దళిత్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (డిక్కీ) అనేక చర్యలు తీసుకుంటోంది. అలోచన నుంచి వినూత్న ఉత్పత్తి అభివృద్ధి, స్టార్టప్‌ ఏర్పాటు, తీసుకున్న రు ణం తిరిగి చెల్లించే వరకూ దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటున్నట్లు డిక్కీ జాతీయ ప్రెసిడెంట్‌ నర్రా రవికుమార్‌ తెలిపారు. గత ఐదేళ్లలో టీ-ప్రైడ్‌ కార్యక్రమం కింద తెలంగాణలో 1,500 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా డిక్కీకి 30 చాప్టర్లు, 10 వేల మంది సభ్యులు ఉన్నారని అన్నారు.


కంపెనీలతో ఒప్పందాలు : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారు చేసిన వస్తువులను పెద్ద కంపెనీలు కొనుగోలు చేసే విధంగా ఒప్పందాలు కుదర్చుడంలో డిక్కీ దృష్టి పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్‌ 132 రకాల ఉత్పత్తులను కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.432 కోట్లని వివరించారు. ప్రభుత్వ కంపెనీలు కొనుగోలు చేసే ఉత్పత్తుల్లో 4 శాతం తప్పనిసరిగా వీరి నుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఏడాది ప్రభుత్వ కంపెనీలకు దళిత పారిశ్రామికవేత్తలు రూ.6,000 కోట్ల విలువైన ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. 


అన్ని జిల్లాలకు విస్తరణ: డిక్కీని దేశం లో అన్ని జిల్లా స్థాయి కేంద్రాలకు విస్తరించనున్నట్లు రవి కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌ సహా ఏడు చోట్ల బిజినెస్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా 5,000 మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు గాను ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. అంబేడ్కర్‌ సోషల్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ మిషన్‌ కింద 5,000 మంచి అలోచనల నుంచి ఎంపిక చేసిన కొన్ని ఆలోచనలను స్టార్ట్‌పలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. కాగా ఐఎ్‌ఫసీఐ వెంచర్‌ ఫండ్‌ కింద రూ.15 కోట్ల వరకూ రుణం పొందొచ్చని, ఈ ఫండ్‌ కింద రూ.600 కోట్ల నిధులు ఉన్నాయని, ప్రతి ఏడాది రూ.200 కోట్లు వచ్చి చేరుతున్నాయని వివరించారు. స్టాండప్‌ ఇండియా కింద రూ.కోటి హమీలేని రుణం ఇస్తున్నారని రవి కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2021-01-19T05:54:13+05:30 IST