రైళ్లలోకి చొరబడిన దొంగలు అక్కడి ఫ్యాన్లను చోరీ చేయలేరు.. దీని వెనుక పెద్ద కథే ఉంది.. అదేమిటంటే..

ABN , First Publish Date - 2022-01-03T17:40:59+05:30 IST

భారతీయ రైల్వే ప్రతీరోజూ కొన్ని లక్షల మంది..

రైళ్లలోకి చొరబడిన దొంగలు అక్కడి ఫ్యాన్లను చోరీ చేయలేరు.. దీని వెనుక పెద్ద కథే ఉంది.. అదేమిటంటే..

భారతీయ రైల్వే ప్రతీరోజూ కొన్ని లక్షల మంది ప్రయాణీకులను వారివారి గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. ప్రయాణీకులకు రైళ్లలో పలు సౌకర్యాలను కూడా కల్పిస్తుంది. రైల్వే ఆస్తులను జాగ్రత్తగా కాపాడాలని ప్రయాణికులకు సూచిస్తుంటుంది. ఈ సందర్భంలో రైల్వేకు సంబంధించి పదేళ్ల క్రితం జరిగిన ఒక ఘటన ప్రస్తావనకు వస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో 18 బోగీల రైలును ఎటువంటి లాకింగ్ సిస్టమ్ లేకుండా పట్టాలపైనే నిలిపి వదిలేశారు. దీనిని గమనించిన దొంగలు బోగీలలోకి చొరబడి తమ హస్తలాఘవం చూపిస్తూ అక్కడున్న ఫ్యాన్లను, లైట్లను, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. ఆ తరువాత దొంగలు పోలీసులకు పట్టుబడ్డారు. ఇప్పుడు రైళ్లలోని ఫ్యాన్ల గురించి తెలుసుకుందాం. రైళ్లలో ఫ్యాన్ల చోరీలు జరగకుండా ఉండేందుకు రైల్వేశాఖ ప్రత్యేక విధానాన్ని అవలంబిస్తుంది. ఈ ఫ్యాన్లను సాధారణ ఫ్యాన్ల మాదిరిగా ఉపయోగించేందుకు వీలుండదు. 




రైళ్లలో వినియోగానికి మాత్రమే ఈ ఫ్యాన్లు ఉపయోగపడతాయి. ఈ ఫ్యాన్లకు ఉన్న ప్రత్యేక సాంకేతికత కారణంగా వాటిని మన ఇళ్లలో ఉపయోగించేందుకు అవకాశం ఉండదు. సాధారణంగా మన ఇళ్లలో ఏసీ (ఆల్ట్రనేటివ్ కరెంట్), డీసీ(డైరెక్ట్ కరెంట్) విద్యుత్ వినియోగిస్తుంటాం. వీటిలో ఏసీ విద్యుత్ వినియోగిస్తే, దానిలో అత్యధికంగా 220 ఓల్టులు ఉంటుంది. ఇక డీసీ వినియోగానికి వస్తే 5,12 లేదా 24 ఓల్టులు ఉంటుంది. అయితే రైళ్లలో ఉపయోగించే ఫ్యాన్లలో 110 ఓల్టుల విద్యుత్ వద్ద వినియోగం అవుతుంది. ఈ ఫ్యాన్లు కేవలం డీసీలో మాత్రమే పనిచేస్తాయి. ఇళ్లలో వినియోగించే ఏసీ విద్యుత్ 220 ఓల్టుల వరకూ, డీసీ విద్యుత్ 24 ఓల్టుల వరకూ ఉంటుంది. అయితే రైళ్లలో వినియోగించే ఫ్యాన్ 110 ఓల్టుల డీసీ కరెంటు వద్దనే పనిచేస్తుంటాయి. ఫలితంగా ఈ ఫ్యాన్లను ఇళ్లలో వినియోగించడం సాధ్యం కాదు. దొంగలు రైళ్లలోని ఫ్యాన్లను చోరీ చేసినప్పటికీ వాటిని వారు వినియోగించలేరు. కాగా రైల్వే ఆస్తుల చోరీకి పాల్పడితే నిందితులపై సెక్షన్ 380 కింద కేసు నమోదు చేస్తారు. నిందితుడు దోషిగా తేలితే ఏడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. 

Updated Date - 2022-01-03T17:40:59+05:30 IST