ఒకటో తారీఖు నుంచి రైళ్లు.. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చి.. తిరిగెళ్తానంటే మాత్రం..

ABN , First Publish Date - 2020-05-29T18:22:24+05:30 IST

జూన్‌ ఒకటో తేదీ నుంచి రైళ్లు కూడా నడవనున్నాయి. ఇందుకోసం రైల్వే వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రయాణికుల పట్ల ఎలా వ్యవహరించాలనే అంశంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు తయారుచేసుకున్నాయి.

ఒకటో తారీఖు నుంచి రైళ్లు.. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చి.. తిరిగెళ్తానంటే మాత్రం..

ఒకటో తారీఖు నుంచి రైళ్లు.. నిబంధనలు వర్తిస్తాయ్..!

ఎక్కడికి వెళ్లినా 14 రోజులు హోం క్వారంటైన్‌ తప్పనిసరి

కరోనా లక్షణాలు ఉంటే స్వాబ్‌... ఇనిస్టిట్యూషనల్‌ క్వారంటైన్‌

బెంగళూరు, చెన్నై నగరాల్లో పెయిడ్‌ క్వారంటైన్‌ 

విశాఖ నుంచి బయలుదేరేవి రెండే రైళ్లు

విశాఖ మీదుగా వెళ్లేవి మూడు రైళ్లు

గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెద్దగా కనిపించని డిమాండ్‌

ప్రయాణికులకు మాత్రమే స్టేషన్‌లలోకి అనుమతి

బంధువులకు నో ఎంట్రీ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): జూన్‌ ఒకటో తేదీ నుంచి రైళ్లు కూడా నడవనున్నాయి. ఇందుకోసం రైల్వే వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రయాణికుల పట్ల ఎలా వ్యవహరించాలనే అంశంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు తయారుచేసుకున్నాయి. అక్కడికి వెళ్లే ప్రయాణికులు ఆ మేరకు నడుచుకోవలసిందే. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్లేవారు తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు పాటించాలి. హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి వచ్చేవారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. రైల్వే అధికారుల వివరాల ప్రకారం...


ఏమి చేస్తారంటే...?

విశాఖపట్నం స్టేషన్‌లో రైలు దిగిన వెంటనే ప్రయాణికులకు జ్వరం ఉందా? లేదా? తెలుసుకోవడానికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తారు.  టెంపరేచర్‌ ఎక్కువగా ఉంటే...స్వాబ్‌ పరీక్షకు పంపుతారు. ఎటువంటి లక్షణాలు లేకపోతే ఇంట్లోనే 14 రోజులు వుండాలని ‘హోమ్‌ క్వారంటైన్‌’ స్టాంపు చేతిపై వేస్తారు. ఇల్లు కదలకుండా ఉండాలి. మధ్యలో ప్రభుత్వ సిబ్బంది వచ్చి తనిఖీ చేస్తారు. ఆ కాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోతే 15వ రోజు నుంచి స్వేచ్ఛగా అందరిలాగా బయట తిరగవచ్చు. 


పనులపై వచ్చేవారికి కూడా అదే నిబంధన

హైదరాబాద్‌లో వున్న వ్యక్తి విశాఖపట్నంలో బంధువులను చూడడానికో, ముఖ్యమైన సమావేశానికి హాజరు కావడానికి రావచ్చు. అటువంటివారు పని పూర్తయిన వెంటనే తిరిగి వెనక్కి వెళ్లిపోవచ్చునా? అంటూ పలువురు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఎవరికైనా నిబంధనలు ఒకటేనని, వ్యాపారులు, అధికారులు, సాధారణ ప్రజలు అంటూ వేర్వేరు నిబంధనలు లేవని రైల్వే అధికార వర్గాలు స్పష్టంచేశాయి. ఎవరైనా సరే ముందు 14 రోజులు క్వారంటైన్‌ పూర్తయిన తరువాతే ఇతర పనులు చేసుకోవాలి. క్వారంటైన్‌లో వుండగా సమావేశాలకు, బంధువుల ఇంటికి వెళతామంటే అంగీకరించరు. ఇవి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి తప్పనిసరిగా వర్తిస్తాయి. 


ఇవి తప్పనిసరి

రైలు ప్రయాణ సమయానికి గంట ముందు స్టేషన్‌లో ఉండాలి. 

మాస్క్‌ ధరించాలి. శానిటైజర్‌ దగ్గర ఉంచుకోవాలి.

ఏసీ ప్రయాణికులు అవసరమైన దుప్పట్లు వారే తెచ్చుకోవాలి.

రైల్లో ప్యాక్డ్‌ ఫుడ్‌, వాటర్‌ బాటిల్‌ మాత్రమే ఇస్తారు. సొంత ఆహారం తెచ్చుకోవడం మంచిది.

60 ఏళ్లు దాటిన వారు, పదేళ్ల లోపు వారు ప్రయాణించకుండా ఉండటం మంచిది.


తెలంగాణాలో 28 రోజులు క్వారంటైన్‌

తెలంగాణాలో హైదరాబాద్‌ సహా ఏ జిల్లాకు వెళ్లినా...మొదటి 14 రోజులు ఇన్‌స్టిట్యూషనల్‌ (ప్రభుత్వ) క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తరువాత మరో 14 రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలి. అంటే 28 రోజులు ఎవరినీ కలవకూడదు. దీనికి సిద్ధపడేవారు అక్కడికి వెళ్లాలి.


కర్ణాటకలో అయితే...?

బెంగళూరులో చాలా మంది ఆంధ్రులు పనిచేస్తున్నారు. అక్కడికి వెళ్లాలని ఇక్కడి బంధువులు, కుటుంబ సభ్యులు చాలామంది భావిస్తున్నారు. కర్నాటక ప్రభుత్వం నిబంధనలు ఏమిటంటే...మొదటి 14 రోజులు పెయిడ్‌ క్వారంటైన్‌లో ఉండాలి. ఇంకో వారం రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలి. 


తమిళనాడు అయితే...?

తమిళనాడులో చెన్నై సహా ఇతర ప్రాంతాలకు వెళితే... మొదటి 14 రోజులు పెయిడ్‌ క్వారంటైన్‌లో ఉండాలి. అంటే దానికి డబ్బులు చెల్లించాలి. ఆ తరువాత వారం రోజులు ఇంట్లో ఉండాలి. మొత్తం 21 రోజులు ఎవరినీ కలవకూడదు.


ఒడిశా అయితే...

ఎవరైనా ఒడిశా రాష్ట్రానికి వెళితే...21 రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలి. ఆ సమయంలో ఎటువంటి లక్షణాలు బయటకపోతే..ఆ తరువాత స్వేచ్ఛగా తిరగడానికి అనుమతిస్తారు.


ఏయే రైళ్లు తిరుగుతాయంటే...?

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కి గోదావరి ఎక్స్‌ప్రెస్‌, ఢిల్లీకి ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రెండు మాత్రమే వాటి సమయాల ప్రకారం నడుస్తాయి. ఫలక్‌నామా, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, బొకారో ఎక్స్‌ప్రెస్‌లు విశాఖ మీదుగా వెళతాయి. ఈ ఐదు రైళ్లు మాత్రమే తిరుగుతాయి.


బాగా తగ్గిన డిమాండ్‌

విశాఖపట్నం-హైదరాబాద్‌ మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. ప్రతిరోజూ వెయిటింగ్‌ లిస్ట్‌ 500 పైనే ఉంటుంది. ఇప్పుడు కరోనా వల్ల దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి ప్రజలు భయపడుతున్నారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి గోదావరి ఎక్స్‌ప్రెస్‌ నడుస్తున్న నేపథ్యంలో వారం రోజుల నుంచి రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారు. ఒకటో తేదీన స్లీపర్‌ క్లాస్‌ వెయింటింగ్‌ లిస్ట్‌ 160 దగ్గర ఆగింది. 2వ తేదీకి 96, 3వ తేదీకి 77, 4వ తేదీకి 64, 5వ తేదీకి 45, 6వ తేదీకి 25, 7వ తేదీకి 23, 8వ తేదీకి 7 మాత్రమే వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. 9వ తేదీన ఆర్‌ఏసీ 100, 10వ తేదీన ఆర్‌ఏసీ 65, 11వ తేదీకి ఆర్‌ఏసీ 10 దగ్గర ఆగింది. 12వ తేదీన 310 టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. అదే సెకండ్‌ క్లాస్‌ అయితే 8వ తేదీన 100, 9వ తేదీన 317, 10వ తేదీన 304, 11వ తేదీ 322, 12వ తేదీన 334 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇన్ని సీట్లు అందుబాటులో ఎన్నడూ లేవని, కరోనా వల్లనే ఖాళీగా వున్నాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.


ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తాం: చేతన్‌ కుమార్‌ శ్రీవాస్తవ, డీఆర్‌ఎం, విశాఖపట్నం

ప్రయాణికులను మాత్రమే స్టేషన్‌లోకి అనుమతిస్తాం. అది కూడా కన్ఫర్మేషన్‌ టిక్కెట్‌ ఉన్న వారిని మాత్ర మే. ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ ఉన్నవారిని అనుమతించం. ప్రయాణికులకు తోడుగా బంఽ దువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇంతకు ముందులా రాకూడదు. వారు వచ్చినా స్టేషన్‌ బయట నుంచే వెళ్లిపోవాలి.

Updated Date - 2020-05-29T18:22:24+05:30 IST