ఉద్యమ క్షేత్రమే నా ఇల్లు

ABN , First Publish Date - 2021-09-06T05:30:00+05:30 IST

మీరా సంఘమిత్ర...‘నర్మదా బచావో’ ఉద్యమంలో మేధాపాట్కర్‌తో కలిసి క్షేత్ర స్థాయి కార్యకర్తగా పనిచేశారు. ‘ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక’ కన్వీనర్‌గా మానవహక్కుల పరిరక్షణ ఉద్యమంలో ఆమె పాత్ర ప్రత్యేకం. ఒక ట్రాన్స్‌- మహిళగా సమాజం...

ఉద్యమ క్షేత్రమే నా ఇల్లు

మీరా సంఘమిత్ర...‘నర్మదా బచావో’  ఉద్యమంలో మేధాపాట్కర్‌తో కలిసి క్షేత్ర స్థాయి కార్యకర్తగా పనిచేశారు. ‘ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక’ కన్వీనర్‌గా మానవహక్కుల పరిరక్షణ ఉద్యమంలో ఆమె పాత్ర ప్రత్యేకం. ఒక ట్రాన్స్‌- మహిళగా సమాజం నుంచి వివక్ష ఎదుర్కొంటూనే, సామాజిక అసమానతలు, అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. భూనిర్వాసితుల పక్షాన న్యాయపోరాటం చేస్తున్నారు. పౌరహక్కులకు భంగం తలెత్తిన ప్రతి సందర్భంలో బాధితుల పక్షాన గళం వినిపించే సామాజిక ఉద్యమకారిణి మీరాసంఘమిత్ర తన ప్రజా ఉద్యమ జీవిత విశేషాలను నవ్యతో పంచుకున్నారు.



‘‘మొదట నేనొక న్యాయవాదిగా రాణించాలని బీఏ ఎల్‌ఎల్‌బీ చదవలేదు. చట్టాలు న్యాయానికి ఒక దారిదీపం కనుక, న్యాయశాస్త్ర విద్యను అభ్యసించాను. తద్వారా పేదలకు న్యాయసహాయం చేయాలనుకున్నాను. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే, అందుకు పూర్తి భిన్నంగా అనిపించాయి. చట్టాలు సైతం సామాన్యులకు రక్షణ కల్పించలేవని అర్థమైంది. కనుక న్యాయవ్యవస్థలో సంస్కరణల కోసం మేమంతా ఉద్యమిస్తున్నాం. ఉపా వంటి అమానవీయ చట్టాలను రద్దు చేయాలని పోరాడుతున్నాం. అసలు నా ఉద్యమ జీవితం ఎలా మొదలైంది అంటే... నేను ‘లా’ చివరి సంవత్సరం చదువుతుండగా, ఒకరోజు పట్టణ ప్రాంత నిరాశ్రయుల హక్కుల మీద మాట్లాడేందుకు మేధాపాట్కర్‌ హైదరాబాద్‌ వస్తున్నారని తెలిసింది. అప్పటి వరకు మేధా గురించి వినడమే కానీ, ఎప్పుడూ కలిసింది లేదు. మేధా ప్రసంగం వినడం కోసమే నేను ఆ సభకు వెళ్లాను. తర్వాత ఆమెను కలిసి మాట్లాడాను. అప్పుడు తాను నాకు ‘నర్మదా బచావో ఆందోళన్‌’ గురించి చెబుతూ, ఆ ఉద్యమంలో స్వచ్ఛందంగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వాళ్లు ఎవరైనా ఉంటే ముందుకురావాలని కోరారు. మేధా ప్రసంగానికి ప్రభావితమైన నేను ప్రజా పోరాటాలకే అంకితం అవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నాను.  నా చదువు పూర్తి అయిన వెంటనే, 2008లో ఉద్యమంలో పనిచేసేందుకు మధ్యప్రదేశ్‌ వెళ్లాను. అప్పటి నుంచి 2016 వరకు నర్మద పరివాహక ప్రాంతంలోని గ్రామాలు, గిరిజన తండాలే మా కార్యక్షేత్రం. నిత్యం గ్రామసభలు నిర్వహించడం, ప్రభుత్వ అధికారుల అవినీతికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు ఇసుకమాఫియాను అడ్డుకోవడం...ఇలా ప్రజల మధ్య, ప్రజలతో కలిసి పనిచేస్తూ ఒక్కోసారి సమయాన్ని కూడా మరిచిపోయేవాళ్లం. అధికారుల అవినీతిని మేమే బహిర్గతం చేసిన సందర్భాలున్నాయి. ఇక బాధితుల పక్షాన  న్యాయస్థానాల్లో పోరాడటం అంటే సరేసరి.! జ్యూడిషరీకి సంబంధించిన అంశాల్లో నా భాగస్వామ్యం మరికాస్త ఎక్కువుండేది. అయితే, మాదంతా సమిష్టి పోరాటమే.! హైదరాబాద్‌లో పుట్టి, పెరిగిన నాకు కాస్త హిందీ వచ్చు. పైగా నర్మద పరివాహకంలోని స్థానికులు మాట్లాడే ‘నిమాడి’, ‘గులాలీ’ భాషలూ నేర్చుకోవడంతో అక్కడి ప్రజలతో సులువుగా కలిసిపోగలిగాను. 


నా నిర్ణయాన్ని విభేదించారు

భూమి నిర్వాసితులతో పనిచేస్తున్న క్రమంలోనే కుల, లింగ వివక్షలు వంటి సమస్యలను అడ్రస్‌ చేయకుండా ముందుకెళ్లలేమని గుర్తించాం. ఆ విధంగా నర్మద బచావో ఆందోళన్‌ సాంస్కృతికోద్యమ స్వరూపాన్నీ అందిపుచ్చుకుంది. కుల వివక్షను పూర్తిగా రూపుమాపలేకపోయినా, స్థానిక సమస్యకు వ్యతిరేకంగా అందరినీ ఒక్కటి చేయగలిగాం. మగవాళ్లూ ఇంటి, వంట పని బాధ్యతను స్వీకరించేలా ఒక మార్పును తీసుకురాగలిగాం. నిజానికి ఆందోళన్‌లో ఆడవాళ్ల భాగస్వామ్యమే ఎక్కువ. వాళ్లే ముందుడి ఉద్యమాన్ని నడిపించారు. అదే సమయంలో అప్పటి వరకు నాది కాని రూపంలో ఉన్న నేను మీరా సంఘమిత్రగా మారాను. నాదైన అస్తిత్వంతో జీవితాన్ని ప్రారంభించాను. అంతకు ముందుగా నా నిర్ణయాన్ని మేధాతో పాటు ఇతర ఉద్యమ సహచరులతో పంచుకున్నాను. అయితే, వాళ్లంతా నా పట్ల సహృదయతతో మెలిగారు. కానీ అప్పటి వరకు ఒక రూపంలో చూసిన నన్ను నాదైన అస్తిత్వంతో చూసేందుకు చాలామంది కాస్త ఇబ్బందిపడ్డారు. నా పరిస్థితిని అర్థం చేసుకోడానికి మేధాతో సహా మరికొందరికి కొంత సమయం పట్టింది. అయితే, ప్రజలు, నన్ను ఎలా స్వీకరిస్తారో అనే భయం నాలోనూ ఉంది. కానీ కల్మషం లేని ఆ గ్రామీణులు నా సమస్యను అర్థం చేసుకున్నారు. జలసింధి గిరిజన ప్రాంతంలోని ఒకామె అయితే, ‘నీ జీవితం... నీ నిర్ణయం దీదీ’ అని హత్తుకుంది. అప్పుడు నాకు వాళ్లమీద మరింత గౌరవం పెరిగింది.


రాజ్యాంగ గౌరవ యాత్ర...

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణతో పాటు లౌకికవిలువలను కాపాడటం కోసం 1991లో మేధాతో పాటు మరికొందరు సామాజిక ఉద్యమ కారులు కలిసి ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక(ఎన్‌ఏపీఎం)ను నెలకొల్పారు. నర్మద బచావో ఆందోళన్‌తో పాటు నేను ఎన్‌ఏపీఎం కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేదాన్ని. తర్వాత కాలంలో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక కన్వీనర్‌గా మరింత ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో ఎన్‌ఏపీఎం కార్యాచరణలో పూర్తిగా నిమగ్నమయ్యాను. దేశంలో నెలకొన్న అసహన వాతావరణానికి వ్యతిరేకంగా 2018లో ‘రాజ్యాంగ పరిరక్షణ యాత్ర’ పేరుతో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రాజ్యాంగ హక్కులను ప్రచారం చేశాం. ‘యువసంవాద్‌’ పేరుతో సామాజిక, రాజకీయ అంశాలపై యువతతో జాతీయ స్థాయి చర్చాకార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పుడు ప్రజా స్వాతంత్య్రం లక్ష్యంగా ‘జన ఆజాదీ 75’ నినాదంతో ఏడాది పాటు ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం. 


ఇంటి నుంచే తొలి పోరాటం...

మీరా సంఘమిత్ర... ఇది నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. నా అస్తిత్వాన్ని చాటుకునే క్రమంలో నాకు నేను ఇష్టంగా పెట్టుకున్న పేరది. సంఘానికి నేనెప్పుడూ ఒక మిత్రురాలిగా ఉండాలనేదే ఆ పేరును ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవడానికి గల ప్రధాన కారణం. ఇలా సొంతంగా మాకు మేమే పేరు పెట్టుకోవడం దగ్గర నుంచి మొదలవుతుంది మా జీవితం. అసలు మా పోరాటం కూడా ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. భారతీయ సమాజంలో తామే అధికులమంటూ ఆధిపత్యం చలాయించే సోకాల్డ్‌ కులంలో పుట్టాను. దాంతో మనుషులను మనుషులుగా గుర్తించని ఆ కులం తాలూకూ అవలక్షణాలనూ చాలా దగ్గరగా చూడగలిగాను. చాలా సందర్భాల్లో ఆ కుటుంబాల్లోని పితృస్వామ్య భావజాలపు అహంకారాన్నీ, అణచివేతనూ నిలదీశాను. ఇతరుల పట్ల కుల అహంకారంతో వ్యవహరించే వారి అమానవీయ ప్రవర్తనే ఒక విధంగా నన్ను ప్రజాస్వామ్య దృక్పథం వైపు మళ్లించింది. బంధు, మిత్రుల్లో కులాధిపత్యాన్ని అనుభవిస్తున్న చాలామంది విద్యావంతులు పాత సంప్రదాయాలను వదిలించుకొని, మోడ్రన్‌గా బతకాలనుకుంటారు. కానీ వారెవరూ ప్రగతిశీల దృక్పథాన్ని ఇష్టపడకపోవడం గమనించాను. కనుకే వారంతా ఎప్పుడూ రిజ్వర్వేషన్లమీద పడి ఏడుస్తుంటారు. కుల అసమానతలు మాత్రం పోకూడదు అంటారు. ఇరుకు బుద్ధులు అంతకు మించి ఆలోచిస్తాయని నేనూ అనుకోవడం లేదు. 


మహిళా రైతుల సమస్యలు...

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలమీద గ్రామీణులకు ఎంతవరకు అవగాహనుందో తెలుసుకుందామని ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని కొందరు మహిళా రైతులను కలిసి చర్చించాము. భూమి హక్కులేని మహిళలే వ్యవసాయ రంగానికి వెన్నుముక. అయినా, వాళ్లను రైతుగా ప్రభుత్వాలు గుర్తించడం లేదు. వ్యవసాయ పద్ధతులమీద మగవాళ్లకన్నా ఎక్కువ అవగాహన కలిగిన ఆడవాళ్లకు సహకరించే వ్యవస్థలు ఒక్కటీ లేవు. ఒక మహిళ తాను పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకోగలిగిన పరిస్థితి అంతకన్నా లేదని అర్థమైంది. మూడు కొత్త సాగు చట్టాల వల్ల మహిళా రైతు, కూలీలు ఎక్కువ నష్టపోతారు. వ్యవసాయ కార్పొరేటీకరణతో మరింత శ్రమ దోపిడీకి గురవుతారు. పంటల ఎంపికపై సాధికారతను, స్వతంత్రతనూ కోల్పోతారు. 





వాళ్లంతా నా కుటుంబ సభ్యులే!

నాకంటూ వ్యక్తిగత జీవితం మరొకటి ఉందని నేననుకోవడం లేదు. ప్రజా ఉద్యమ క్షేత్రమే నా ఇల్లు. సమాజంలోని బాధితులంతా నా కుటుంబ సభ్యులే.! గతంలో కంటే ఇప్పుడు ప్రజా ఉద్యమాల అవసరం మరింత పెరిగిందనిపిస్తుంది. రైల్వే, విశాఖ ఉక్కు పరిశ్రమ..ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేస్తూ, దేశాన్ని కార్పొరేట్లకు అమ్మేస్తున్న పాలకులను ఒకవైపు చూస్తున్నాం. మరోవైపు వారే మతం పేరుతో మనుషుల మధ్య విద్వేషాలు కలిగించడమూ చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామిక ఉద్యమ శక్తులన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నమ్ముతాను.  


ఆదివాసీల ఆప్యాయత

పుణేకి చెందిన ప్రయాస్‌ స్వచ్ఛంద సంస్థ తరపున ‘తెలంగాణలో థర్మల్‌ విద్యుత్‌  కేంద్రాలు - పర్యావరణం’ అంశంపై క్షేత్ర స్థాయి అధ్యయనం చేసేందుకు చాలా గ్రామాలు, తండాలు, ఆదివాసీ ప్రాంతాలు తిరిగాను. నేను ఆ ఊర్లకు వెళ్లినప్పుడు, మొదటగా ‘ఈ వ్యక్తి ఎవరు’ అన్నట్టుగా అక్కడివారంతా కాస్త సందేహంగా చూసేవారు. కొత్త వ్యక్తులను అలా చూడటం సహజం కూడా. తర్వాత వాళ్లతో మాట్లాడుతున్న క్రమంలో నన్ను తమ వ్యక్తిగా భావించి, చాలా ఆత్మీయంగా మసులుకునేవాళ్లు. ఒక గూడెంలో అయితే, కొందరు మహిళలు నాకు తలదువ్వి, పూలు పెట్టిమరీ మురిసిపోయారు. అలా చాలా సందర్భాల్లో ఆదివాసీల ప్రేమాభిమానాలు, ఆప్యాయతలను పొందగలిగాను.


- కె. వెంకటేష్‌



Updated Date - 2021-09-06T05:30:00+05:30 IST