బదిలీ కావాల్సిందే!

ABN , First Publish Date - 2021-06-16T07:25:28+05:30 IST

గోలు నగర పాలకసంస్థ, మున్సిపాలిటీల పరిధిలోని పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ కావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

బదిలీ కావాల్సిందే!

మున్సిపాలిటీల్లో పని చేస్తున్న‘పరిషత్‌’ టీచర్లకు సర్కారు షాక్‌

4వ కేటగిరీ ప్రాంతాలకు బదిలీ చేయాలని ఉత్తర్వులు

ఈనెల 20లోపు కౌన్సెలింగ్‌ 

ఒంగోలు విద్య, జూన్‌ 15 : ఒంగోలు నగర పాలకసంస్థ, మున్సిపాలిటీల పరిధిలోని పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ కావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో కోర్టును ఆశ్రయించిన వారందరినీ 4,3 కేటగిరీ స్కూళ్లలో మిగిలిపోయిన పోస్టుల్లో నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి ఈనెల 16 నుంచి 30తేదీ లోపు కౌన్సెలింగ్‌ నిర్వహించి కొత్తస్థానాలు కేటాయించాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు ఆదేశించారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల వలన 46 మంది ఉపాధ్యాయులపై బదిలీ వేటు పడనుంది. 

గత ఏడాది నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీల సందర్భంగా ఒంగోలు నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల పరిధిలోని జడ్పీ, మండల పరిషత్‌ పాఠశాలల్లో పని చేస్తున్న కొందరు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. వీరికి ఎనిమిది సంవత్సరాల సర్వీసు పూర్తయిన తప్పని సరిగా స్థానచలనం కావాల్సి ఉన్నప్పటికీ కోర్టు నుంచి స్టే ఉత్తర్వుల పొందారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న తాము అక్కడి పాఠశాలల్లో విలీనమయ్యేందుకు అంగీకారం తెల్పినందున తమను బదిలీల ప్రక్రియ నుంచి మినహాయించాలని వీరు కోర్టుకు విన్నవించారు. అయితే ఉపాధ్యాయుల విలీన ప్రకియకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వెలువడనందున వీరి విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో వీరందరిపై ప్రస్తుతం బదిలీ వేటు పడనుంది. వారిలో మార్కాపురం  మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఒక హెచ్‌ఎం, ఒంగోలు నగర పాలక సంస్థ, కందుకూరు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న 9 మంది స్కూలు ఆసిస్టెంట్లు, ఒంగోలు, కందుకూరు, కనిగిరిలలో పనిచేస్తున్న 36 మంది సెకండిగ్రేడ్‌ టీచర్లు ఉన్నారు.  


మార్గదర్శకాలు ఇవీ.. 

హైకోర్టును ఆశ్రయించిన ఉపాఽధ్యాయులకు స్థానాల కేటాయింపులో పాటించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. వీరిని క్యాటగిరీ-4, క్యాటగిరీ-3లోని అసలు ఉపాధ్యాయులు లేని సూళ్లు, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో నియమించాల్సి ఉంటుంది. ఈనెల 16 నుంచి 30లోపు వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించి కొత్త స్థానాలు కేటాయించమన్నారు. వీరి బదిలీ ద్వారా మున్సిపాలిటీల్లోని పాఠశాలల్లో ఏర్పడ్డ ఖాళీలను పనిసర్దుబాటు ద్వారా భర్తీ చేయమని సూచించారు.  


Updated Date - 2021-06-16T07:25:28+05:30 IST