పీలేరులో ఏడుగురు వీఆర్వోలపై బదిలీ వేటు

ABN , First Publish Date - 2021-10-05T06:33:55+05:30 IST

పాలనాపరమైన కారణాలతో పీలేరు మండలంలో ఏకంగా ఏడుగురు వీఆర్వోలపై బదిలీ వేటు పడింది.

పీలేరులో ఏడుగురు వీఆర్వోలపై బదిలీ వేటు

పీలేరు, అక్టోబరు 4: పీలేరు మండలంలో ఏకంగా ఏడుగురు వీఆర్వోలపై బదిలీ వేటు పడింది. పాలనాపరమైన కారణాలతో చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ఈ బదిలీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విధుల నిర్వహణలో అవకతవకలు, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో బదిలీ చేసినట్లు తెలుస్తోంది.పీలేరు మండలంలోనే కాకుడా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ ఇలాంటి ఆరోపణలు ఉన్న వారిని బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. పీలేరు మండలంలో సోమవారం బదిలీ వేటు పడిన ఏడుగురితో పాటు మరో ముగ్గురిని బదిలీ చేయనున్నట్లు భావిస్తున్నారు. సోమవారం బదిలీ ఉత్తర్వులు వచ్చిన వారిలో పీలేరు-1 వీఆర్వో నవీన్‌ను వి.కోట మండలం పాపేపల్లెకు, పీలేరు-2 వీఆర్వో మురళిని గంగవరం మండలం దండుపల్లెకు, పీలేరు -3 వీఆర్వో విశ్వనాథ్‌ను కలికిరి-3కు, గూడరేవుపల్లె వీఆర్వో ప్రసాదబాబును పెద్దపంజాణి మండలం రాజుపల్లెకు, దొడ్డిపల్లె వీఆర్వో సురేష్‌కుమార్‌రెడ్డిని వి.కోటకు, అగ్రహారం వీఆర్వో శ్రీనివాసులును పూతలపట్టు మండలం గాండ్లపల్లెకు, బోడుమల్లువారిపల్లె వీఆర్వో రవిప్రసాద్‌ను పిచ్చాటూరుకు బదిలీ చేశారు.వీరు పనిచేసిన గ్రామాల్లో అగ్రహారం తప్ప మిగిలిన ప్రాంతాల్లో భారీస్థాయిలో భూ ఆక్రమణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం టీడీపీ, వైసీపీ నేతల ఆరోపణాస్ర్తాల నేపథ్యంలో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి విదితమే.పీలేరు మండలంలో జరిగిన భూ కబ్జాల ఫిర్యాదులపై కలెక్టర్‌ స్పందించి ఆరుగురు తహసీల్దార్లు, 90మంది రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ జరిపించారు.  విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు విచారణలో తేటతెల్లం కావడంతో ఈ విషయమై ప్రత్యేక బృందాలు నివేదికలు సమర్పించాయి. ఈ నేపథ్యంలో దురాక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌ స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో స్థానిక అధికారులు నెల క్రితం ఆక్రమణలు తొలగించేందుకు ఉపక్రమించినప్పటికీ కోర్టుస్టే ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో నిర్మాణాలను తొలగించరాదని కొందరు అడ్డుకోవడంతో గంటల వ్యవధిలోనే వెనక్కు తగ్గాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఆగిపోయింది. ఈ క్రమంలో సోమవారం ఏడుగురు వీఆర్వోలను పాలనాపరమైన కారణాలతో బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. సంచలనం రేపిన భూ కబ్జాల వ్యవహారంపై ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారా, లేదా విధుల నిర్వహణలో అక్రమాలు, అవినీతి, విధుల దుర్వినియోగం, అలసత్వం వంటి ఆరోపణలు కారణమయ్యాయా అంటూ చర్చ జరుగుతోంది.ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా మరో 20మందికి పైగా వీఆర్వోలకు స్థానచలనం జరగనున్నట్లు వినవస్తోంది. రెండు, మూడు రోజుల్లో వీరిపై కూడా బదిలీ వేటు పడనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-10-05T06:33:55+05:30 IST