2,309 మంది టీచర్ల బదిలీ

ABN , First Publish Date - 2021-01-17T06:11:21+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. శనివారం సాయంత్రం వరకు జిల్లాలో 2,309 మందిని బదిలీ చేశారు.

2,309 మంది టీచర్ల బదిలీ

ఎస్జీటీలు 1,335, స్కూల్‌ అసిస్టెంట్లు 844 మంది

మరో 130 మంది ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. శనివారం సాయంత్రం వరకు జిల్లాలో 2,309 మందిని బదిలీ చేశారు. ఇందులో 130 మంది ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 1,335 మంది ఎస్జీటీలు, నాన్‌ లాంగ్వేజ్‌ కేటగిరీలో 521 మంది, లాంగ్వేజ్‌ కేటగిరీలో 323 మంది స్కూల్‌ అసిస్టెంట్లు ఉన్నారు. ఏజెన్సీలో 602 మందికి, మైదాన ప్రాంతంలో 1707 మందికి బదిలీ అయ్యింది. ఇంకా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పండిట్ల బదిలీలు కావలసి ఉంది. జిల్లాలో మొత్తం మూడు వేల ఖాళీలకు 5,051 మంది బదిలీ కోసం వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. ఈ నెల 13న తొలుత ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు అందాయు. తరువాత సంక్రాంతి రోజు స్కూల్‌ అసిస్టెంట్లకు, 15న ఎస్జీటీలకు బదిలీలు పూర్తిచేశారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్న టీచర్లు పండుగ సెలవులైనా ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లో రిలీవ్‌ అయి కొత్తగా పోస్టింగ్‌ పొందిన పాఠశాలల్లో చేరిపోయారు. ఇప్పటికి ఇంకా విధుల్లో చేరని టీచర్లు వెంటనే కొత్తచోట రిపోర్టు చేయాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి ఆదేశించారు. 


25 మందికి హెచ్‌ఎంలుగా పదోన్నతి

జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తూ సీనియారిటీ జాబితాలో వున్న 25 మందికి తాత్కాలిక ప్రాతిపదికన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించారు. వీరికి శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో పాఠశాలలు కేటాయించారు. కాగా డీఈవో పూల్‌లో వున్న 70 మంది పండిట్లను బదిలీ చేస్తూ డీఈవో లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.  


అభ్యంతరాలపై అప్పీల్‌కు అవకాశం

భీమునిపట్నం-రూరల్‌: ఉపాధ్యాయుల బదిలీలపై  అప్పీల్‌ చేసుకోవడానికి విద్యా శాఖ అవకాశాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను శనివారం విడుదల చేసింది. గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు ఆర్‌జేడీకి, ఇతర ఎస్జీటీలు, స్కూలు అసిస్టెంట్లు...జిల్లా విద్యాశాఖాధికారికి ఉత్తర్వులు అందిన పది రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి. బదిలీ జరిగిన వారు కొత్త పాఠశాలల్లో చేరినప్పటికీ అప్పీల్‌ చేసుకోవచ్చు. ఉపాధ్యాయుల అప్పీల్‌పై 15 రోజులలో రాతపూరకంగా జవాబు అందుతుంది. కొత్తగా బదిలీ అయిన ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలల్లో ఈ నెల 18 నుంచి బయోమెట్రిక్‌ హాజరు వేయాలని విద్యాశాఖాధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-17T06:11:21+05:30 IST