అడ్డగోలుగా ఇద్దరు టీచర్ల బదిలీ

ABN , First Publish Date - 2020-07-14T09:56:47+05:30 IST

జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను అడ్డగోలుగా బదిలీ చేయడంపై ఉపాధ్యాయ..

అడ్డగోలుగా ఇద్దరు టీచర్ల బదిలీ

రేపు డీఈవో కార్యాలయం వద్ద ప్యాప్టో ధర్నా


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను అడ్డగోలుగా బదిలీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు  మండిపడుతున్నారు. డీఈవో పూల్‌లో మిగులు బాటుగా ఉన్నట్లు చూపి నిబంధనలకు విరుద్ధంగా ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల క్రితం రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు తమ చిత్తానుసారం సిఫార్సు బదిలీల పేరు చెప్పి వీరిని పంపించే ఉత్తర్వులు ఇచ్చారన్నారు.  ఈ అంశంపై బుధవారం డీఈవో కార్యాలయం వద్ద ప్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నట్లు ఉపాధ్యాయులు చెప్పారు. 


బదిలీలు ఇలా..

2017లో ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. చందర్లపాడు మండలం ఏటూరు(మెయిన్‌) పాఠశాలలో పనిచేస్తున్న పి.శివాజీ, కోడూరు మండలం నార్లపాలెంలో పనిచేస్తున్న సీహెచ్‌ రఘు అప్పట్లో బదిలీ కోరుకోలేదని ఉపాఽధ్యాయులు చెబుతున్నారు. ఈ ఇద్దరినీ డీఈవో కార్యాలయంలో బయోమెట్రిక్‌ హాజరు విభాగంలో నియమించారని, తాజాగా శివాజీని విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడుకు, రఘును పెనుమలూరు మండలం గోసాల పాఠశాలకు బదిలీ చేయడం నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. సీనియారిటీ జాబితాలు లేకుండా ఇద్దరు ఉపాఽధ్యాయులను ఏ ప్రాతిపదికన బదిలీ చేశారని, డీఈవో కార్యాలయ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-07-14T09:56:47+05:30 IST