నిజాయితీకి బదిలీ బహుమానం!

ABN , First Publish Date - 2021-01-17T06:07:24+05:30 IST

జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్..

నిజాయితీకి బదిలీ బహుమానం!
హేమంతనాగరాజు, శ్రీకాంత్‌రెడ్డి

ఎక్సైజ్‌ డీసీ ఆకస్మిక బదిలీ వెనుక పెద్ద తలకాయలు

వైసీపీ కీలక నేత అండతో చక్రం తిప్పిన ఆ శాఖ అధికారి

అవినీతికి పాల్పడిన డిపో మేనేజర్‌ బండారం బయటకు తీస్తున్నారనే వేటు 

బదిలీకి జీవో జారీ చేయాల్సి ఉండగా మెమోతో సరి

ఎక్సైజ్‌ శాఖలో జోరుగా చర్చ

డీసీగా శ్రీకాంత్‌రెడ్డి నియామకం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కె.హేమంతనాగరాజు బదిలీ వ్యవహారం ఆ శాఖలో కలకలం రేపుతోంది. బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కూడా కాకముందే ఆయన్ను ఇక్కడ నుంచి పంపేయడం చర్చనీయాంశమైంది. అది కూడా జీవో ద్వారా కాకుండా... కేవలం మెమోతోనే బదిలీ చేయడం వివాదాస్పదమవుతోంది. జిల్లాలో ఓ అధికారి అక్రమాలను బయటకు తీస్తున్నారనే కారణంతోనే వైసీపీ కీలక నేతల అండతో హేమంతనాగరాజుపై వేటు వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


తిరుపతి ఎక్సైజ్‌ డీసీగా పనిచేస్తున్న హేమంతనాగరాజును గత నెల ఒకటిన ఖాళీగా జిల్లా డీసీ పోస్టులో నియమించారు. ఆయనకు నిజాయితీగల అధికారిగా గుర్తింపు ఉంది. ఇదిలావుంటే జిల్లాలో కీలకమైన మద్యం డిపో మేనేజర్‌గా వున్న అధికారి ఒకరు అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను గత నెల మొదటి వారంలో బదిలీ చేసింది. డిపో మేనేజర్‌గా వున్న సమయంలో ఆయన...తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని బ్రాండ్లను మాత్రమే ప్రమోట్‌ చేసి దుకాణాలకు సరఫరా చేసేవారని, ప్రభుత్వం మద్యం దుకాణాలు ఏర్పాటుచేసినప్పుడు భవన యజమానులను పర్సంటేజీలు అడిగారని, టెండర్ల సమయంలో అధికారులు, సిబ్బందికి అవసరమైన ఆహారాన్ని తన కుటుంబానికి చెందిన హోటల్‌ నుంచి పంపించి అధిక బిల్లులు డ్రా చేశారని అభియోగాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను బదిలీ చేసి ఆరోపణలపై విచారణ చేపట్టవలసిందిగా డిప్యూటీ కమిషనర్‌గా వున్న హేమంతనాగరాజును ప్రభుత్వం నియమించింది.


నిజాయితీపరుడైన అధికారిగా గుర్తింపు కలిగిన ఆయన బదిలీకి గురైన సదరు డిపో మేనేజర్‌ అక్రమాలను తవ్వితీసే పనిలో పడ్డారు. దీంతో ఆందోళన చెందిన సదరు అధికారి...తమ ఉన్నతాధికారి వద్దకు వెళ్లి ‘మీరు చేయమనడంతోనే కొన్ని బ్రాండ్లను ప్రమోట్‌ చేశాను, మీ ఆదేశాల మేరకే దుకాణాలకు ఇచ్చిన భవనాల యజమానుల వద్ద పర్సంటేజీలు తీసుకున్నాను. డీసీ విచారణలో ఆ విషయాలు బయటకు వచ్చేస్తాయి కాబట్టి నా చర్యలు తప్పకపోవచ్చు, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి...’ అంటూ కోరినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వైసీపీలో కీలక నేతను కలిసిన సదరు ఉన్నతాధికారి ఎలాగైనా డిప్యూటీ కమిషనర్‌ హేమంతనాగరాజును ఇక్కడి నుంచి బదిలీ చేయించాల్సిందిగా కోరినట్టు తెలిసింది. తక్షణం బదిలీ చేయించకపోతే డిపో మేనేజర్‌గా పనిచేసిన అధికారితో పాటు తాను కూడా ఇబ్బందుల్లో పడాల్సి వుంటుందని చెప్పడంతో సదరు కీలక నేత సరేనని బదిలీకి అంగీకారం తెలిపినట్టు తెలిసింది.


అయితే నిబంధనల ప్రకారం డీసీని బదిలీ చేయాలంటే సీఎం ఆమోదంతో జీవో జారీ చేయాల్సి వున్నప్పటికీ...అటువంటిదేమీ లేకుండా హేమంతనాగరాజును సెబ్‌కు బదిలీ చేస్తూ, విజయవాడ సెబ్‌లో పనిచేస్తున్న శ్రీకాంత్‌రెడ్డిని ఆయన స్థానంలో నియమిస్తూ మెమో జారీచేశారు. అలాగే బదిలీకి గురైన సదరు డిపో మేనేజర్‌కు తిరిగి అదే పోస్టింగ్‌ కల్పించడం విశేషం. ఒక అధికారి అక్రమాలను బయటకు రాకుండా తొక్కిపెట్టేందుకు నిజాయితీగా పనిచేస్తున్న ఉన్నతాధికారిని బలిపశువును చేయడం దారుణమని ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - 2021-01-17T06:07:24+05:30 IST