వైద్య శాఖలో బదిలీలు షురూ!

ABN , First Publish Date - 2022-03-22T09:48:12+05:30 IST

Transfers begin in the medical department!

వైద్య శాఖలో బదిలీలు షురూ!

  • జాబితాకు కమిటీ ఆమోదం
  • ఒకేసారి 975 మందికి స్థానచలనం
  • ఈ రేంజ్‌లో బదిలీలు డీఎంఈలో తొలిసారి
  • ఓపీ, ఐపీ సేవలపై తీవ్ర ప్రభావం
  • వీరంతా వెంటనే జాయిన్‌ కాకుంటే ఇబ్బందే
  • మరోవైపు వాలంటరీ రిటైర్మెంట్‌, లాంగ్‌ లీవ్‌కు రెడీ


అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ)లో బదిలీల ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. వెబ్‌సైట్‌ సమస్యలు, అనేక అవకతవకల మధ్యే ఈ ప్రక్రియ ముగిసింది. మంగళవారం నుంచి 11 బోధనాసుపత్రుల్లోని వైద్యులను ట్రాన్స్‌ఫర్‌ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. డీఎంఈ అధికారులు సిద్ధం చేసిన బదిలీల జాబితాకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఒక్క రోజులోనే 975 మంది వైద్యులకు వివిధ చోట్ల పోస్టింగ్స్‌ ఇవ్వనున్నారు. వీరిలో 215 మంది ప్రొఫెసర్లు, 150 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 610 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉన్నారు. డీఎంఈ చరిత్రలో ఇలా ఒకేసారి దాదాపు వెయ్యి మంది వైద్యులను బదిలీ చేయడం ఇదే తొలిసారి. అయితే, బదిలీల తర్వాత వచ్చే సమస్యల పరిష్కారానికి ఆరోగ్యశాఖ ఎలాంటి చర్యలు తీసుకుందన్న అంశంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఒకేసారి 975 మంది వైద్యులను బదిలీ చేయడం వల్ల 11 బోధనాసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలుకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుందని సీనియర్‌ వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం బదిలీ చేయబోతున్న వారు.. కొత్త స్థానాల్లో చేయడానికి కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలి. 


975 మంది వైద్యులు ప్రస్తుతం ఉన్న చోట ఓపీ, ఐపీ సేవలు సక్రమంగా జరుగుతున్నాయి. బదిలీల వల్ల వీరంతా వెళ్లిపోతే.. ఆయా సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. పోనీ.. వీటి నిర్వహణకు ప్రభుత్వం ఏమైనా ఏర్పాట్లు చేసిందా అంటే.. అదికూడా లేదు. ప్రస్తుతం ఆయా ఆస్పత్రుల్లో ఉన్న మిగిలిన వైద్యులు ఓపీ, ఐపీ సేవలు చూసుకుంటారని చెబుతోంది. కానీ, అది సాధ్యం కాదని సీనియర్‌ వైద్యులు అంటున్నారు. బదిలీ అయిన వైద్యులు కొంత మంది చేరినా.. వెంటనే లీవ్‌ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా మంది వైద్యులు వాలంటరీ రిటైర్మెంట్‌ కోసం చూస్తున్నారు. మరికొంత మంది లాంగ్‌లీవ్‌ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. 975 మందిలో ఎక్కువ శాతం మంది లాంగ్‌లీవ్‌లోకి వెళ్తే మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవని సీనియర్‌ వైద్యులు అంటున్నారు. గత రెండు నెలల నుంచే ఓపీతో పాటు శస్త్ర చికిత్సలు పెరిగి, ఐపీ రోగుల సంఖ్య పెరుగుతోంది. బదిలీల వల్ల ఈ సేవలు మళ్లీ ఆగిపోయే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  


కంప్యూటర్‌ చెప్పిందే ఫైనల్‌!

బదిలీలు మొత్తం కంప్యూటర్‌ చెప్పినట్లే చేస్తున్నారు. జీవోను పక్కన పెట్టి కంప్యూటర్‌ ఎలాంటి ఆప్షన్‌ ఇస్తే అధికారులు దానినే ఫాలో అవుతున్నారు. ట్రైల్‌ రన్‌లో రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్స్‌కు దరఖాస్తు చేసుకున్న స్థానాల్లో కాకుండా మరొక చోట పోస్టింగ్‌లు ఇచ్చేశారు. దీనిని సరి చేసేలోపు మరోక సమస్య వచ్చింది. దరఖాస్తు దారులు ప్రస్తుతం ఉన్న స్థానాన్ని కూడా వేకెన్సీ జాబితాలో చూపిస్తోంది. నిబంధనల ప్రకారం రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్స్‌ పెట్టుకున్న వైద్యులు వారు ఆప్షన్‌ పెట్టుకున్న చోట పోస్టింగ్‌ రాకపోతే.. ప్రస్తుతం ఉన్న స్థానంలో ఉండిపోవాలి. కానీ, వారు పెట్టుకున్న ఆప్షన్స్‌లో పోస్టింగ్‌లు రాకపోవడంతో పాటు ప్రస్తుతం వారున్న స్థానాన్ని కూడా బదిలీల జాబితాలో చూపిస్తోంది. నిబంధనల ప్రకారం ఈ సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు అలా చేయడం లేదు. కంప్యూటర్‌ చెప్పిన మేరకే ట్రాన్స్‌ఫర్‌ కావాలనుకున్న వారు మాత్రమే రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్స్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఆరోగ్యశాఖతో పాటు ఎన్‌హెచ్‌ఎం విభాగంలో కూడా రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. అక్కడ అంతా సజావుగానే సాగుతోంది. కానీ, డీఎంఈ, డీహెచ్‌ విభాగాల్లో మాత్రం రివర్స్‌లో సాగుతోంది.

Updated Date - 2022-03-22T09:48:12+05:30 IST