ఉపాధ్యాయులకు బదిలీలు

ABN , First Publish Date - 2021-01-17T05:10:19+05:30 IST

ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ తుది అంకానికి చేరింది. జిల్లాలో ఎస్జీటీలకు శనివారం స్థానాలను కేటాయించారు. బదిలీలు పొందిన ఉపాధ్యాయులు వెనువెంటనే ఆయా పాఠశాలల నుంచి రిలీవయ్యారు. తమకు కేటాయించిన కొత్త పాఠశాలలో ఆదివారం చేరనున్నారు.

ఉపాధ్యాయులకు బదిలీలు

 

తుది అంకానికి చేరిన ప్రక్రియ

ఎట్టకేలకు ఎస్జీటీలకు స్థానాలు కేటాయింపు

సాలూరు రూరల్‌/ కలెక్టరేట్‌, జనవరి 16: ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ తుది అంకానికి చేరింది. జిల్లాలో ఎస్జీటీలకు శనివారం స్థానాలను కేటాయించారు. బదిలీలు పొందిన ఉపాధ్యాయులు వెనువెంటనే ఆయా పాఠశాలల నుంచి రిలీవయ్యారు. తమకు కేటాయించిన కొత్త పాఠశాలలో ఆదివారం చేరనున్నారు.

ఉపాధ్యాయ బదిలీల పర్వం నెలల తరబడి కొనసాగుతున్న విషయం విదితమే. ఈ బదిలీల్లో తుది అంకమైన ఉపాధ్యాయులకు స్థానాలకు కేటాయింపు ఈ నెల 13న ఆరంభమైంది. తొలి విడతగా ఎల్‌ఎఫ్‌ఎల్‌ (ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు) హెచ్‌ఎంలకు బదిలీ స్థానాలను కేటాయించారు. ఆ సమయంలో స్థానిక ఎన్నికల ప్రకటన రావడంతో కోడ్‌ అమల్లోకి వచ్చింది. బదిలీలకు బ్రేక్‌ పడిందని ఉపాధ్యాయులు భావించారు. ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు కొట్టివేయడంతో బదిలీలకు మార్గం సుగమం అయ్యింది. బదిలీలకు మళ్లీ కోడ్‌ అడ్డంకి రాకుండా ఉండేందుకు ఈ నెల 18లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేసేలా విద్యాశాఖ సత్వర చర్యలు చేపట్టింది. కోర్టు కేసులున్న కొన్ని కేడర్ల ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కాకుండా ఎల్‌ఎఫ్‌ఎల్‌, పాఠశాల సహాయకులు, ఎస్జీటీలను బదిలీలు చేశారు. తొలుత ఎల్‌ఎఫ్‌ఎల్‌కు బదిలీస్థానాలు కేటాయించారు. జిల్లాలో ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు 106 మంది, పాఠశాల సహాయకులు ఇంగ్లీషు 260 మంది, గణితం 299 మంది, ఫిజికల్‌ సైన్స్‌ 248, బయోలాజికల్‌ సైన్స్‌ 218 మంది,సాంఘిక శాస్త్రం 232 మంది, ఎస్జీటీ 2428 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తప్పనిసరి బదిలీల ఉపాధ్యాయులందరికి కొత్త స్థానాలను కేటాయించారు. రిక్వెస్ట్‌ బదిలీల్లో పలువురికి బదిలీ అవకాశం లభించింది. రిక్వెస్ట్‌ బదిలీ కోరిన కొందరికి తాము ఎంపిక చేసిన స్థానాలను లభించకపోవడం ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలోనే ఉండాల్సి వచ్చింది. బదిలీలు దాదాపుగా పూర్తికావచ్చాయి. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితర కొద్ది మందికి మాత్రమే బదిలీలు నిర్వహించాల్సి ఉంది. 


Updated Date - 2021-01-17T05:10:19+05:30 IST