సాధారణ చప్పట్లకు.. హిజ్రాల చప్పట్లు ఎందుకు భిన్నంగా ఉంటాయి? వీటికున్న ప్రత్యేక అర్థం తెలిస్తే..

ABN , First Publish Date - 2022-01-17T13:47:08+05:30 IST

పెళ్లిళ్లలో లేదా పండుగల్లో హిజ్రాలు..

సాధారణ చప్పట్లకు.. హిజ్రాల చప్పట్లు ఎందుకు భిన్నంగా ఉంటాయి? వీటికున్న ప్రత్యేక అర్థం తెలిస్తే..

పెళ్లిళ్లలో లేదా పండుగల్లో హిజ్రాలు చప్పట్లు కొడుతూ తమ ఆశీస్సులు అందజేస్తుంటారు. ఇవి పాఠశాలలు, కళాశాలల్లో లేదా ఇతర సందర్భాల్లో వినిపించే చప్పట్లకు పూర్తి భిన్నంగా ఉంటాయి. హిజ్రాలు కొట్టే చప్పట్లు వారి గుర్తింపునకు సంబంధించినవి. ఈ చప్పట్లకు ప్రత్యేక అర్థం కూడా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేక శబ్ధంతో చప్పట్లు కొట్టడం ద్వారా హిజ్రా.. మరొక హిజ్రాని గుర్తిస్తారు. సాధారణంగా హిజ్రాలు స్త్రీల దుస్తులు ధరిస్తారు. ఒక్కోసారి వారు పురుషుల దుస్తులలోనూ కనిపిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో తమ సంఘంలోని వ్యక్తులను కలిసేందుకు వారు చప్పట్లు కొట్టడం ద్వారా తమ ఉనికిని తెలియజేస్తారు. ఎక్కడైనా వివాహాలు లేదా పుట్టినరోజులు జరుగుతుంటే అక్కడికి హిజ్రాలు వచ్చి చప్పట్లు కొట్టడం ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.  హిజ్రాలు కోపంలోనూ, సంతోషంలోనూ చప్పట్లు కొడుతూనే మాట్లాడుతుంటారు. హిజ్రాలు చప్పట్లు కొట్టేటప్పుడు ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తారు. సాధారణంగా చప్పట్లు కొట్టేటప్పుడు రెండు చేతులు నిలువుగా లేదా అడ్డంగా ఉంచి చప్పట్లు కొడతారు. అయితే హిజ్రాలు చప్పట్లు కొట్టేటప్పుడు ఒక చేతిని నిలువుగా, మరో చేతిని అడ్డంగా ఉంచి చప్పట్లు కొడతారు. ఈ సమయంలో వారి చేతుల వేళ్లు దూరంగా ఉంటాయి. ఈ క్లాప్ నుంచి ఒక ప్రత్యేక రకమైన ధ్వని వస్తుంది. ఇది చాలా పెద్దగా వినిపిస్తుంది.


కొన్నేళ్ల క్రితం సమాజ్‌వాదీ పార్టీ నేత విషంభర్‌ ప్రసాద్‌ నిషాద్‌ చేసిన ఓ ప్రకటన పెద్ద దుమారాన్ని రేపింది. హిజ్రాలు చప్పట్లు కొట్టడం ద్వారా ఎప్పుడూ జబ్బు పడరని ఆయన అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హిజ్రాలను తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఇది వారికి ఆక్యుప్రెషర్ థెరపీలాంటిదని,  దీనిని అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఇదిలావుంటే హిజ్రాలకు సంబంధించిన చాలా విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. వారి సమాజంలో కొత్త హిజ్రాను చేర్చుకునేముందు వారి శారీరక, మానసిక స్థితిని పరిశీలిస్తారు. దీనిపై నిర్థారణకు వచ్చాకనే ఆ వ్యక్తికి తమ సమాజంలో సభ్యత్వం కల్పిస్తారు. ఆ వ్యక్తిని తమ గ్రూపులో చేర్చుకున్నాక విందు ఏర్పాటు చేసి, పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. అయితే ప్రస్తుతం మారిన కాలంతో పాటు హిజ్రాలు ఉద్యోగాలలో చేరుతున్నారు. కాగా హిజ్రాలు ఒక కుటుంబంలా కలిసి జీవిస్తారు. వారిలో అత్యంత అనుభవజ్ఞులైన నపుంసకులను తమ గురువుగా భావిస్తారు. అతను వీరి కుటుంబ వ్యవస్థను నిర్వహిస్తాడు. డబ్బుల లావాదేవీలు, ఖర్చులులాంటివి ఈ గురువు ఆజ్ఞ మేరకే జరుగుతాయి.



Updated Date - 2022-01-17T13:47:08+05:30 IST