చైనాతో కటీఫ్‌ సరఫరా వ్యవస్థలకు నష్టమే

ABN , First Publish Date - 2020-10-30T06:28:32+05:30 IST

భారత్‌ సహా ప్రపంచంలోని పలు దేశాలు తమ ఉత్పత్తి కేంద్రాలను చైనా నుంచి తరలించడం సరఫరా వ్యవస్థలకు పెను అవరోధంగా మారుతుందని చైనీస్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హాంకాంగ్‌కు చెందిన బిజినెస్‌ స్కూల్‌ అధ్యయనంలో తేలింది...

చైనాతో కటీఫ్‌ సరఫరా వ్యవస్థలకు నష్టమే

  • హాంకాంగ్‌ బిజినెస్‌ స్కూల్‌ అధ్యయన నివేదిక


భారత్‌ సహా ప్రపంచంలోని పలు దేశాలు తమ ఉత్పత్తి కేంద్రాలను చైనా నుంచి తరలించడం సరఫరా వ్యవస్థలకు పెను అవరోధంగా మారుతుందని చైనీస్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హాంకాంగ్‌కు చెందిన బిజినెస్‌ స్కూల్‌ అధ్యయనంలో తేలింది. కొవిడ్‌-19 మహమ్మారికి మూలస్థానం అయినందున చైనా నుంచి ఉత్పత్తి కేంద్రాల తరలింపునకు పలు దేశా లు ప్రయత్నిస్తున్నాయి. కాని ప్రస్తుత అనుసంధానిత ప్రపంచంలో సరఫరా వ్యవస్థలన్నీ చైనాపైనే మితిమీరి ఆధారపడినందున ఆ ప్రయత్నం వల్ల మొదటికే మోసం వస్తుందని ఆ అధ్యయనం నిర్వహించిన సీయూహెచ్‌కే బిజినెస్‌ స్కూల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డెసిషన్‌ సైన్స్‌ అండ్‌ మేనేజీరియల్‌ ఎకనామిక్స్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జింగ్‌ వూ హెచ్చరించారు. మరోపక్క చైనాలో కొవిడ్‌ తగ్గుముఖం పట్టి సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవగా... ప్రపంచంలోని ఇతర దేశాలన్నింటికీ వైరస్‌ విస్తరించి లాక్‌డౌన్లు, మాంద్యంలో చిక్కుకోవడం కూడా ఉత్పాదక కేంద్రాలను తరలించాలనుకునే కంపెనీలకు ప్రతికూలాంశమని ఆయన స్పష్టం చేశారు.


చైనాలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 29 వరకు షట్‌డౌన్‌ నిబంధనలు వర్తించినప్పటికీ మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 6 మధ్యలో క్రమంగా వాటిని తొలగిస్తూ రావడంతో సరఫరా వ్యవస్థలన్నీ తిరిగి సాధారణ స్థితికి చేరాయని తేల్చారు. చైనాతో బంధాన్ని కొనసాగిస్తున్న కంపెనీలకు ఇది కలిసివచ్చిందన్నారు. చైనాతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలనుకున్నప్పటికీ ఆయా కంపెనీల క్రెడిట్‌ రిస్క్‌ను కూడా తగ్గించలేదని తేల్చిచెప్పారు. కంపెనీలు తమ పరపతి రేటింగ్‌ను హెడ్జ్‌ చేసుకునేందుకు ఉపయోగించే సాధనం క్రెడిట్‌ డీఫాల్ట్‌ స్వాప్‌ (సీడీఎస్‌) కోణంలో కూడా అధ్యయనం చేసినట్లు వూ చెప్పారు. 


Updated Date - 2020-10-30T06:28:32+05:30 IST