Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD : సొంత వాహనంగా Ambulance.. కీలక హోదాలో ఉండి ఇదేం పని సారూ...!

  • ఓ అధికారి నిర్వాకం
  • గిరిజనుల సేవలో ఉండాల్సిన వాహనం నగరంలో..
  • ఐదేళ్లుగా సొంత పనులకే వాహనం వినియోగం 
  • విచారించి చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు

హైదరాబాద్‌ సిటీ : రాష్ట్ర ఆరోగ్యశాఖ రవాణా విభాగంలో అతనో ఉన్నతాధికారి. బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన ఆ అధికారి స్వలాభం చూసుకున్నాడు. గిరిజనులకు ఉపయోగపడాల్సిన అంబులెన్స్‌ను సిటీకి తెచ్చుకుని సొంత వాహనంగా వాడుకుంటున్నాడు. కావాల్సినట్లుగా దాన్ని మలుచుకుని దర్జాగా తిరుగుతున్నాడు.


ఖమ్మం జిల్లా గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన ఆయన ఐదేళ్ల క్రితం నగరానికి బదిలీ అయ్యాడు. ప్రస్తుతం ఆరోగ్య శాఖ రవాణా విభాగంలో కీలక హోదాలో పని చేస్తున్నాడు. ఖమ్మం జిల్లా నుంచి బదిలీపై వచ్చిన అధికారి తనతో పాటు ఓ అంబులెన్స్‌ను కూడా ఇక్కడికి తెచ్చుకున్నాడు. అక్కడి గ్రామాలు, తండాల్లో తిరగాల్సిన అంబులెన్స్‌ నగర రోడ్లపై తిరుగుతోంది. అందులో రోగులు, వారి సంబంధీకులు కాకుండా ఓ అధికారి దర్జాగా కూర్చొని తిరుగుతున్నా డు. అంబులెన్స్‌ అన్న ధీమాతో చలానాలు పడవని రోడ్లపై ఇష్టానుసారంగా డ్రైవింగ్‌ సాగుతోంది. వాహన పత్రాలు కూడా రెన్యువల్‌ చేయలేదు. ఆంధ్రజ్యోతికి అందిన సమాచారంతో దీనిపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారిని వివరణ కోరగా.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

గిరిజనుల అంబులెన్స్‌..

నిత్యావసర వస్తువులకే కిలోమీటర్ల మేర నడిచే గిరిజనులు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు పడే పాట్లు అతనికి తెలియనివి కావు. ఎమర్జెన్సీలో వారి అవసరార్థం ఆరోగ్య శాఖ తరఫున కొన్ని అంబులెన్స్‌లు కేటాయించారు. ఏదైనా ప్రమాదం, అనారోగ్యం.. లాంటి సమయాల్లో ఆ అంబులెన్స్‌లు వారిని ఆదుకుంటాయి. వారికి చెందాల్సిన అంబులెన్స్‌ నగర రోడ్లపై షికార్లు కొడుతోంది. అక్కడ అంబులెన్స్‌ల కొరత ఉందనే విషయం గిరిజనులకు అర్థం కాకపోవడం.. ఇక్కడ అంబులెన్స్‌ సొంత అవసరాలకు తిరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడం ఈ అధికారికి కలిసొచ్చింది. అంబులెన్స్‌ను నగరానికి తరలించి ఐదేళ్లుగా అందులోనే తిరుగుతున్నాడు.

నచ్చినట్లుగా మార్చుకుని...

అంబులెన్స్‌ అంటే దానిపై వేషభాషలు వేరుగా ఉంటాయి. అంబులెన్స్‌లా కనిపించకుండా వాహనాన్ని మాడిఫై చేయించాడు. వెనక స్ట్రెచర్‌ ఉన్న సీటు భాగంలోనే మరో రెడు సీట్లు అమర్చి కూర్చోడానికి వీలుగా మార్పించాడు. వాహనానికి డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి అదే శాఖకు చెందిన మెకానిక్‌ కావడం గమనార్హం. వాహనం నగర రోడ్లపై నిబంధనలను బేఖాతరు చేస్తూ తిరుగుతుండడంతో రాంగ్‌సైడ్‌, సిగ్నల్‌ జంపింగ్‌, అతివేగం లాంటి ఉల్లంఘనలు కూడా బాగానే ఉన్నాయి. వాహనంపై సుమారు 10 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అంబులెన్స్‌ కదా చలానాలు ఎలా విధిస్తారనే ప్రశ్న కూడా వస్తుంది. కానీ వాహనాన్ని చూస్తే అది అంబులెన్స్‌లా కనిపించదు. (అలా ఓ ప్రైవేట్‌ వాహనంగా... జాగ్రత్తగా మెయింటెయిన్‌ చేస్తూ) ట్రాఫిక్‌ పోలీసులకు సైతం అంబులెన్స్‌ అనే భావన కల్గించకుండా వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారు.

ట్యాక్స్‌ ఫ్రీ..

అంబులెన్స్‌ పేరిట రిజిస్టర్‌ అయి ఉన్న (ఏపీ 20టీసీ 2701) వాహనం డాక్యుమెంట్లను పరిశీలించగా ట్యాక్స్‌ ఫ్రీ వాహనం అని ఉంది. అంతే కాకుండా 2013లో డీఎంహెచ్‌ఓ, ఖమ్మం పేరిట రిజిస్టర్‌ అయిన వాహనానికి ఇప్పటి దాకా ఎలాంటి రెన్యూవల్స్‌ చేయలేదు. ఫిట్‌నెస్‌ 2015లోనే గడువు తీరిపోయింది. ఇన్సూరెన్స్‌ పత్రాలు కూడా రెన్యూవల్‌ కాలేదు. ట్యాక్సు చెల్లింపులు కూడా జరగలేదు. రోడ్లపై మాత్రం తిరుగుతోంది. విషయాన్ని ఆ శాఖ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లగా.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని ఆంధ్రజ్యోతికి తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement