వెళ్లొస్తాం..

ABN , First Publish Date - 2022-01-17T05:26:18+05:30 IST

సంక్రాంతి సెలవులకు జిల్లాకు వచ్చిన బంధువులు సంతోషంగా పండగని జరుపుకొని తిరుగు ప్రయాణమయ్యారు.

వెళ్లొస్తాం..
తిరుగు ప్రయాణికులతో బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ కిటకిట

సంక్రాంతి వచ్చినవారు తిరుగు ప్రయాణం

రద్దీగా మారిన రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లు

గుంటూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సెలవులకు జిల్లాకు వచ్చిన బంధువులు సంతోషంగా పండగని జరుపుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే వివిధ మార్గాల్లో పయనమయ్యారు. దీంతో బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. జిల్లాకు ఎక్కువమంది హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారు కావడంతో అటు వైపు వెళ్లే బస్సులు కిక్కిరిసిపోయాయి. రెగ్యులర్‌తో పాటు ప్రత్యేక రైళ్లు, సువిధ స్పెషల్‌ రైళ్లలోనూ టిక్కెట్‌లు బుకింగ్‌ అయ్యాయి. వ్యక్తిగత వాహనాల్లో వచ్చిన వారు రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కారణంగా గుంటూరు - నార్కెట్‌పల్లి - హైదరాబాద్‌ మార్గం రద్దీగా మారిపోయింది. ఆర్‌టీసీతో పాటు ప్రైవేటు ట్రావెల్స్‌ ఏజెన్సీలు స్పెషల్‌ బస్సులు నడిపాయి.  గత ఏడాది కరోనా తొలి దశ కారణంగా సంక్రాంతికి పెద్దగా బంధువులు స్వస్థలాలకు రాలేకపోయారు. ఈ సంవత్సరం మాత్రం ఎక్కువమంది వీలు చేసుకొని పండగకి గత గురువారమే వచ్చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు భోగి పండగ రోజు ముందే వచ్చి మూడు రోజుల పండగని కుటుంబ సభ్యుల మధ్యన సంతోషంగా జరుపుకొన్నారు. దీంతో డెల్టా, పల్నాడులోని పల్లెలకు కొత్త కళ వచ్చింది. కొంతమంది జిల్లాలోని సూర్యలంక సముద్రతీరం, కోటప్పకొండ, అమరావతి, నాగార్జునసాగర్‌, ఎత్తిపోతల, అమరావతి రాజధాని తదితర పర్యాటక ప్రదేశాలను ఈ మూడు రోజుల్లో సందర్శించారు. సినిమా ప్రదర్శనలపై ఎలాంటి కరోన ఆంక్షలు లేకపోవడంతో పండగకి వచ్చిన చిత్రాలను కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లి చూసి ఆనందించారు. షాపింగ్‌లు కూడా చేయడంతో మాల్స్‌ రద్దీగా మారాయి. ఆదివారం కనుమ పండగని ధూందాంగా జరుపుకొన్నారు. ఉదయాన్నే మాంసం, చికెన్‌, చేపల దుకాణాలకు వెళ్లి వారికిష్టమైనవి కొనుగోలు చేసి ఆరగించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుగు ప్రయాణాలు ప్రారంభం కావడంతో జాతీయ రహదారి, హైదరాబాద్‌ స్టేట్‌ హైవే రద్దీగా మారడం ప్రారంభమైంది. అలానే సాయంత్రం వెళ్లిన విజయవాడ - లింగంపల్లి, గుంటూరు - సికింద్రాబాద్‌(వయా కాజీపేట) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లలోని భోగీలు కిక్కిరిసిపోయి ప్రయాణీకులు వెళ్లారు. అలానే రాత్రికి గుంటూరు వచ్చి సికింద్రాబాద్‌ వెళ్లిన రెగ్యులర్‌, ఏసీ, సువిధ రైళ్లు కూడా అత్యంత రద్దీగా మారాయి. 

తెలంగాణ పాఠశాలలకు సెలవులతో...

తెలంగాణలో పాఠశాలలకు ఈ నెలాఖరు వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ఆదివారం ఉదయం అక్కడి ప్రభుత్వం ప్రకటించడంతో కొంతమంది మాత్రం తమ తిరుగు ప్రయాణాన్ని విరమించుకొన్నారు. ఉద్యోగస్థులు మాత్రం వెళ్లారు. ఈ కారణంగా కొన్ని రైళ్లల్లో ఊహించని విధంగా రాత్రి కరెంట్‌ బుకింగ్‌లో టిక్కెట్‌లు లభించాయి. దాంతో ఎవరైతే టిక్కెట్‌లు అడ్వాన్స్‌గా బుకింగ్‌ చేసుకోలేకపోయారో వారు కరెంట్‌ బుకింగ్‌లో టిక్కెట్లు రిజర్వు చేసుకొని వెళ్లారు. కొందరు మాత్రం సోమవారం వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకొన్నారు. 

 

Updated Date - 2022-01-17T05:26:18+05:30 IST