ఖజానా... ఖాళీ

ABN , First Publish Date - 2021-10-06T05:39:13+05:30 IST

ప్రభుత్వ శాఖలో మౌలానే అనే ఉద్యోగి 25 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు.

ఖజానా... ఖాళీ

బిల్లులు పాస్‌.. నిధులు స్టాప్‌

నేటికీ వేలాదిమందికి అందని సర్వీసు పింఛన్లు

ఏడాదిన్నరగా ప్రభుత్వ బీమా కోసం ఉద్యోగుల నిరీక్షణ

మురిగిపోతున్న మెడికల్‌, సరెండర్‌ లీవ్‌, ఫెస్టివల్‌ బిల్లులు


కడప(కలెక్టరేట్‌), అక్టోబరు 5: ప్రభుత్వ శాఖలో మౌలానే అనే ఉద్యోగి 25 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. తన జీతంలో నెలకు 20 శాతం తక్కువ కాకుండా నెలనెలా దాదాపు రూ.20వేలకు తగ్గకుండా ప్రభుత్వ బీమా(ఏపీ జీఎల్‌ఐ)లో పొదుపు చేశాడు.  కూతురి వివాహం చేసేందుకు ఏపీ జీఎల్‌ఐలో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఖజానా శాఖలో బిల్లు పాస్‌ అయిందని, సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి నిధులు విడుదల అవుతాయని ఆశ పడ్డాడు. దరఖాస్తు చేసుకొని 10 నెలలు గడుస్తున్నా రుణం అందకపోవడంతో అప్పు చేసి బిడ్డ వివాహం చేశాడు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ము రాక పోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇలాగే వందలాది మంది ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ కరుణ కోసం నిరీక్షిస్తున్నారు. అంతేకాకుండా మెడికల్‌, సరెండర్‌ లీవ్స్‌, జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ బిల్లుల కోసం వేలాది మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నా ఖజానా శాఖలో బిల్లులు పాస్‌ అవుతున్నాయే తప్ప.. నెలల తరబడి ఒక్క పైసా కూడా ప్రభుత్వం జమ చేయడం లేదు. ఏడాదిన్నరగా దాదాపు రూ.16 కోట్ల వరకు ప్రభుత్వ బీమా సొమ్ము చెల్లింపులు జరగలేదు. 

జిల్లాలో ప్రభుత్వ ఖజానాశాఖ నిధుల లేమితో విలవిలలాడుతోంది. ఉద్యోగులకు, పింఛనుదారులకు నెలనెలా జీతాలు, పింఛన్లు ఇవ్వడం గగనమైంది. సర్వీసు పింఛన్లు 5వ తేదీ దాటినప్పటికీ వేలాదిమందికి అందించలేని దయనీయస్థితిలో ఉంది. ముఖ్యంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావల్సిన బెనిఫిట్స్‌, గ్రాట్యుటీ, జీపీఎఫ్‌, ఏపీ జీఎల్‌ఐ, సంపాదిత ఆర్జిత సెలవులకు సంబంధించిన సొమ్ము సకాలంలో అందక వందలాది మంది ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. కేవలం ఉద్యోగులకు రావాల్సిన జీతాలు, బెన్‌ఫిట్స్‌, పింఛనుదారుల బిల్లులు పాస్‌ చేయడమే జిల్లా ఖజానాశాఖ పనిగా మారింది. ఈ విషయంపై జిల్లా ఖజానాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎంఎస్‌ వెంకటేశ్వర్లును వివరణ కోరగా, సర్వీసు పింఛనుదారులకు సంబంధించి పింఛన్లు రావాల్సి ఉందన్నారు. ఉద్యోగుల బెనిఫిట్స్‌కు సంబంధించి తమ పరిధిలో బిల్లులు పాస్‌ అయ్యాయని, ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి నిధులు విడుదల చేయాల్సి ఉందన్నారు. పదవీ విరమణ పొందినవారి బెనిఫిట్స్‌ రాకపోతే తన దృష్టికి తేవాలన్నారు. 

Updated Date - 2021-10-06T05:39:13+05:30 IST