ట్రెజరీ కార్యాలయ డీడీ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-07-18T09:54:38+05:30 IST

బందరు సబ్‌ ట్రెజరీ కార్యాలయం అవినీతి అంశం జిల్లా ట్రెజరీ కార్యాలయ డీడీ మెడకు చుట్టుకుంది.

ట్రెజరీ కార్యాలయ డీడీ సస్పెన్షన్‌

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : బందరు సబ్‌ ట్రెజరీ కార్యాలయం అవినీతి అంశం జిల్లా ట్రెజరీ కార్యాలయ డీడీ మెడకు చుట్టుకుంది. జిల్లా ట్రెజరీ అఽధికారి వి.నాగ మహేష్‌ను ప్రభుత్వం శుక్రవారం సస్పెండ్‌ చేసింది. ఆయన స్థానంలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ  ఫైనాన్స్‌ అధికారి సీతాకుమారిని ఇన్‌చార్జి డీడీగా నియమించింది. జిల్లా ట్రెజరీ ఇన్‌చార్జి డీడీగా శుక్రవారం ఆమె బాధ్యతలు చేపట్టారు. 


ఎస్టీవోల అక్రమాలే కారణం

 జిల్లా ట్రెజరీ అధికారి సస్పెన్షన్‌కు  బందరు సబ్‌ ట్రెజరీలో జరిగిన  అక్రమ వ్యవహారాలే కారణంగా ట్రెజరీ ఉద్యోగులు చెప్పుకుం టున్నారు. సబ్‌ ట్రెజరీలో ఇటీవల ఏసీబీ అధికా రులు తనిఖీలు చేశారు. సబ్‌ ట్రెజరీ కార్యాల య అధికారులు ఎస్‌.నాగమల్లేశ్వరరావు, జి.శేషుకుమార్‌ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి వారిని సస్పెండ్‌ చేశారు. సుమారు కోటి రూపాయలకు పైగా ప్రభుత్వ నగదును దొడ్డిదారిన మళ్లించి, జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉన్నతాధికారులను సైతం పక్కదారి పట్టిం చినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. పెన్షనర్లకు సంబంధించి పెన్షన్‌,  ఫ్యామిలీ పెన్షన్‌, పే ఫిక్షేషన్‌, డీఎలు, హెచ్‌ఆర్‌ ఏ తదితర అంశాల్లో అధికంగా నగదు జమ అయితే దానిని రికవరీ చేసి ప్రభుత్వ పద్దు 2071కి  జమ చేయాలి. 


బందరు ఎస్‌టీవో నాగమల్లేశ్వరరావు ప్రభుత్వ ఖాతాకు ఈ నగదును  జమ చేయకుండా తన కరెంటు ఖాతాకు మళ్లించినట్లు ఏసీబీ అఽధికారుల విచారణలో వెల్లడైంది. ఏడాదిలో బందరు సబ్‌ ట్రెజరీ నుంచి  ఈతరహాలో రూ. 29లక్షలు పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. నాలుగేళ్ల లో కోటి రూపాయలు పైగా స్వాహా చేసినట్లు భావిస్తున్నారు.  ఎస్‌టీవోలు ఇంతా చేస్తున్నా జిల్లా ట్రెజరీ కార్యాలయ డీడీ పట్టించుకోక పోవడం, పాలనా పరమైన చర్యలు తీసుకోక పోవడంతో సస్పెన్షన్‌ వేటు పడింది.

Updated Date - 2020-07-18T09:54:38+05:30 IST