మళ్లీ కలకలం

ABN , First Publish Date - 2020-05-05T10:34:04+05:30 IST

రేపోమాపో జిల్లా గ్రీన్‌జోన్‌లోకి చేరబోతుందని సంతోషపడుతున్న జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

మళ్లీ కలకలం

జగిత్యాలవాసికి కరోనా పాజిటివ్‌...

కరీంనగర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స

పాజిటివ్‌ వ్యక్తితో కలెక్టరేట్‌ ఉద్యోగికి బంధుత్వం 

అతడికి సన్నిహితంగా మెదలడంతో క్వారంటైన్‌కు తరలింపు


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌): రేపోమాపో జిల్లా గ్రీన్‌జోన్‌లోకి చేరబోతుందని సంతోషపడుతున్న జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. జిల్లాలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఒకరికి తాజాగా కరోనా పాజిటివ్‌ రావడం, ఆయన ఐదు రోజులపాటు  జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు తెలవడం ఈ ఆందోళనకు కారణమవుతున్నది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి సమీపబంధువైన కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆయనతో సన్నిహితంగా మెదిలినట్లు వెల్లడైంది.


దీంతో కలెక్టరేట్‌లో కూడా కలకలం బయలు దేరింది. ప్రైవేట్‌ ఆస్పపత్రిలో ఐదు రోజులపాటు అతనికి చికిత్సను అందించిన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌, వార్డుల్లో పని చేసే సిబ్బంది, వారి కుటుంబసభ్యులు సుమారు 70 నుంచి 80 మందిని క్వారంటైన్‌కు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో 17 మందికి ప్రైమరీ కాంటాక్టు ఉన్నదని నిర్ధారించుకున్నారు. వారందరికి కరోనా పరీక్షలు చేయించాలని జిల్లా యంత్రాంగం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రైమరీ కాంటాక్టు ఉన్న 17 మంది ఎవరెవరనిని కలిశారన్నది విచారిస్తున్నారు.


వాళ్ల కుటుంబసభ్యులను కూడా హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారని సమాచారం. ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన కరోనా పాజిటివ్‌ వ్యక్తితో సన్నిహితంగా మెదిలిన బంధువును, అతనిని హైదరాబాద్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లిన అంబులెన్సు డ్రైవర్‌ను, ఒక ప్రైవేట్‌ రోగ నిర్ధారణ కేంద్రంలో అతనికి స్కానింగ్‌ చేసిన మరో ఇద్దరు టెక్నీషియన్లను గుర్తించి క్వారంటైన్‌లోకి పంపాలని నిర్ణయించారని పేర్కొంటున్నారు. 


కేన్సర్‌ చికిత్స కోసం చేరి..

జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్ళపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అనారోగ్యానికి గురికావడంతో ఏప్రిల్‌ 23న జగిత్యాల పట్టణంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నాడు. అతడిని పరీక్షించిన డాక్టర్‌ కరీంనగర్‌కు వెళ్లి స్కానింగ్‌ తీసుకొని రావాలని సూచించడంతో మరుసటి రోజు ఒక ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు వచ్చి స్కానింగ్‌ చేయించుకున్నాడు. ఏప్రిల్‌ 25న జగిత్యాలకు వెళ్లి డాక్టర్‌కు స్కానింగ్‌ రిపోర్టు చూపించగా కేన్సర్‌గా అనుమానించిన ఆ డాక్టర్‌ కరీంనగర్‌లోని మరో ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్ళాలని సూచించాడు. దీంతో సదరు వ్యక్తి ఆరోజు ఇంటికి వెళ్లి ఏప్రిల్‌ 26న ఆదివారం కావడంతో 27న కరీంనగర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సకోసం చేరాడు. ఏప్రిల్‌ 27 నుంచి మే 1వ తేదీ మధ్యాహ్నం వరకు అతను ఆ ప్రైవేట్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందాడు.


ఆస్పత్రివర్గాల సలహా మేరకు అతడు మే 1వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్‌లోని నిమ్స్‌కె వెళ్లి అడ్మిట్‌ అయ్యాడు. మరుసటి రోజు అతడి పరిస్థితి క్లిష్టంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లమని చెప్పారని, అక్కడి డాక్టర్లు నిరాకరించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారని సమాచారం. గాంధీ ఆస్పత్రిలో అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా వ్యాధి సోకిందని మే 3వ తేదీన తేలింది. దీంతో సదరు వ్యక్తి, భార్యను, అతనిని ఆస్పత్రికి తీసుకవెళ్లిన సోదరుడి కుమారుడిని కరీంనగర్‌లో పరీక్షల కోసం తీసుకవెళ్లిన మరో వ్యక్తిని, ఆటో డ్రైవర్‌ను కూడా క్వారంటైన్‌కు తరలించారు. ఆస్పత్రికి వెళ్లక ముందు ఆ వ్యక్తి ఎవరెవరిని కలిశాడన్న విషయం అధికారులు విచారిస్తున్నారు. మార్చిలో 10 మంది ఇండోనేషియన్లు, ఇద్దరు యూపీకి చెందిన వ్యక్తులు మతప్రచారానికి రావడంతో జిల్లాలో కరోనా వ్యాధికి బీజం పడింది. ఇండోనేషియా నుంచి వచ్చిన 10 మందికి, వారికి సహాయకులుగా వ్యవహరించిన స్థానికులు ఇద్దరికి, వారిలో ఒకరి తల్లి, సోదరికి కూడా కరోనా వ్యాధి సోకింది.


దీంతో అత్యధిక కేసులు వచ్చిన జిల్లాగా కరీంనగర్‌ కరోనా తొలిరోజుల్లో రాష్ట్రంలోనే కలకలం సృష్టించింది. దీంతో మార్చి 18న కరీంనగర్‌లో ముకరంపుర, కశ్మీరుగడ్డ ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఆ తర్వాత మర్కజ్‌ లింకులో మరో ఐదుగురు జిల్లావాసులకు కరోనా వ్యాధి సోకింది. దీంతో కరీంనగర్‌లోని నాలుగు ప్రాంతాలను, హుజురాబాద్‌లోని నాలుగు ప్రాంతాలను కట్టడి ప్రాంతాలుగా ప్రకటించి చర్యలు తీసుకున్నారు. ఇక్కడి వైద్య, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌శాఖల అధికారులు సమన్వయంగా వ్యవహరించి కరోనాను వ్యాపించకుండా కట్టడి చేయడంతో 19 కేసులకే కరోనా పరిమితమై పోయింది. క్రమేపి 18 మంది చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జి అయ్యారు. జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఇంకా చికిత్స పొందుతున్నాడు. ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారించిన నాటి నుంచి 20 రోజులు గడిచిపోయాయి. వరుసగా 21 రోజుల పాటు కొత్తగా కరోనా కేసులేవి రాకపోతే జోన్‌ను మార్చేస్తారు.


కరీంనగర్‌ ప్రస్తుతం ఆరెంజ్‌ జోన్‌లో ఉండగా మరో రెండు రోజుల్లో గ్రీన్‌ జోన్‌లోకి మారే అర్హత వస్తుందని, అందరూ భావించి కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే భయం వీడుతున్నారు. ఈ దశలో జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడం ఆయన ఐదురోజులపాటు కరీంనగర్‌లో చికిత్సపొందడం ఆయన బంధువు కలెక్టరేట్‌లో ఉద్యోగం చేస్తుండడంతో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. మళ్లీ ఎవరికి కరోనా వ్యాధి సోకుతుందో ఆ ప్రైవేట్‌ ఆస్పత్రి, ప్రైవేట్‌ రోగ నిర్ధారణ కేంద్రంలో ఎంత మందికి కరోనా ముంపు పొంచి ఉందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.   


Updated Date - 2020-05-05T10:34:04+05:30 IST