అన్నిటికీ ఎదురుచూపులే

ABN , First Publish Date - 2021-04-16T09:39:07+05:30 IST

‘‘నాకు పాజిటివ్‌ తేలినా ఫరవాలేదు. మా చావు మేం చస్తాం. ముందు పరీక్ష చేయండి. కరోనా సోకిందో లేదో తెలుసుకుంటే చాలు.

అన్నిటికీ ఎదురుచూపులే

టెస్ట్‌ నుంచి చికిత్స దాకా  ప్రజలకు చుక్కలే

విలయమై రాష్ట్రాన్ని అల్లాడిస్తున్నా

సెకండ్‌వేవ్‌ను ఎదుర్కొనే సన్నద్ధత ఏదీ? 

రెమ్‌డెసివిర్‌కి చాలా ఆలస్యంగా టెండర్‌

రెండో డోస్‌ లేకుండా ఉత్సవ్‌లో అత్యుత్సాహం

ఒక్కరోజే వాడేసి జనం ప్రాణాలతో చెలగాటం

ఒక డోసు తీసుకొన్నవారికి రెండో డోసు కరువు

పరీక్షల కోసం రోజంతా జనం పడిగాపులు

చికిత్స విషయంలోనూ బాధితులకు అవస్థలు

దొరికినంత పిండేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు

మామూలుగా ఉంటే  రోజుకు రూ.25 వేలు

వెంటిలేటర్‌ అవసరమైన కేసులకు రూ.లక్ష

ధరల నియంత్రణలో ఆరోగ్య శాఖ విఫలం

రాష్ట్రాన్ని చుట్టేస్తోంది కరోనా విలయం. కరోనా పరీక్షల కోసం పడిగాపులు... 

ఆస్పత్రుల్లో పడకల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూపులు.. 


మూడు గంటల్లో బెడ్‌ అందించాలనే ప్రభుత్వ పెద్దల మాటలు... ఇలా కొత్త వైరస్‌ దెబ్బకి రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు మొదలయ్యాయి! కరోనా సోకిన బాధితులు సాధారణ పరిస్ధితుల్లో ఉంటే రోజుకు రూ.25 వేలు... వెంటిలేటర్‌పై ఉంటే ఒకరోజుకు లక్ష అంటూ ప్రైవేటు ఆస్పత్రులు దోచేస్తున్నాయి. ‘‘వ్యాక్సిన్‌ వేయించుకో... కరోనా నుంచి కాపాడుకో ’’అన్న నినాదం గోడలకే పరిమితం. సమయం పూర్తి అయినా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ లబ్ధిదారులకు అందడం లేదు. కరోనా నుంచి కాపాడే సంజీవని రెమ్‌డెసివిర్‌ నిల్వలూ నిండుకున్నాయి. 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘నాకు పాజిటివ్‌ తేలినా ఫరవాలేదు. మా చావు మేం చస్తాం. ముందు పరీక్ష చేయండి. కరోనా సోకిందో లేదో తెలుసుకుంటే చాలు. బతికేదీ చచ్చేదీ దేవుడు చూసుకుంటాడు’’...విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఒక పెద్దావిడ ఆవేదన ఇది. ఒక్క రాజధాని నగరంలోనే కాదు. రాష్ట్రం నలుమూలలా ఇప్పుడు ఇదే పరిస్థితి! రాష్ట్రంలో రోజువారీగా వేల కేసులు నమోదు అవుతున్నాయి.


ప్రతి జిల్లాల్లో వేలమంది కరోనా అనుమానంతో పరీక్షల కోసం ప్రభుత్వ ల్యాబ్‌లు, సెంటర్ల ముందు క్యూ కడుతున్నారు. షెడ్యూల్‌ ప్రకారం, ప్రతి జిల్లాల్లో రోజుకు 2500 నుంచి 3000కు మించి కరోనా పరీక్షలు నిర్వహించాలి. కరోనా తొలి దశలో కొంతమేర పాటించారు. అప్పట్లో రోజుకు 60 వేలు నుంచి 70 వేల మందికి పరీక్షలు చేశారు. ఒకానొక దశలో రోజుకు 80 వేల మందికి కూడా పరీక్షలు నిర్వహించిన దాఖలాలున్నాయి. ఇప్పుడు ఈ సంఖ్య రోజుకు 30 నుంచి 35 వేలు మించడం లేదు. 30 వేలకు మించి పరీక్షలు చేయవద్దు అంటూ ఆరోగ్యశాఖ కమిషనర్‌ నుంచి జిల్లాలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ‘కనీసం పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ లేదా నెగిటివ్‌ అని చెబితే మా తిప్పలు మేం పడతాం’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


సంజీవని ఎక్కడ?

కరోనా రోగులకు రెమ్‌డెసివిర్‌ సంజీవని లాంటిది. ప్రాణాప్రాయ స్థితిలోకి వెళ్లిన బాధితుల్ని కూడా ఈ ఇంజక్షన్‌ బయటపడేస్తుంది. అలాంటి రెమ్‌డెసివిర్‌ కొరత రాష్ట్రంలో తీవ్రంగా ఉంది. ఉత్పత్తులు తగ్గిపోవడంతో మార్కెట్‌లో చాలా తక్కువ నిల్వలు ఉన్నాయి. కరోనా మొదటి విడతలో రెమ్‌డెసివిర్‌ను భారీగా ఉపయోగించారు. ఇప్పుడు ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు మళ్లీ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌పై పడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఈ ఇంజక్షన్‌ కొరత తీవ్రమైంది. కొన్ని కంపెనీలు ఇదే అదునుగా భావించి ఇంజక్షన్‌ను బ్లాక్‌ మార్కెట్‌ చేసేశాయి. మొన్నటి వరకూ రూ.2 వేల నుంచి రూ.2500 మధ్యలో దొరికిన రెమ్‌డెసివిర్‌ ధరను ఇప్పుడు ఽసాధారణ ప్రజలు కొనుగోలు చేయలేని స్థాయికి తీసుకువెళ్లారు.


మరోవైపు ఆరోగ్యశాఖ విషయానికి వస్తే, ఈ నెల 13వ తేదీ నాటికి ఆరోగ్యశాఖ వద్ద 81,659 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలో ప్రభుత్వాస్పత్రుల్లో 30 వేల ఇంజెక్షన్లు ఉపయోగించారు. 15వ తేదీ సాయంత్రం నాటికి రాష్ట్రంలో వాటి నిల్వలు 57,303కు చేరాయి. నిజానికి, రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ వస్తుందని వైద్య నిపుణులు ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ కళ్లు తెరవని ఆరోగ్యశాఖ, ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులు మందులు సిద్ధం చేసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాయి. ముఖ్యం గా రెమ్‌డెసివిర్‌కు సంబంధించిన టెండర్లు పది రోజుల క్రితం పిలిచారు. ఇందులో ఒక్క కంపెనీ ఎల్‌1 వచ్చింది. గతంలో ఏపీఎంఎ్‌సఐడీసీకి ఈ ఇంజక్షన్లు సరఫరా చేసిన కంపెనీకి ఇప్పటి వరకూ బిల్లులు చెల్లించలేదు. సుమారు రూ.40 కోట్ల వరకూ బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు అదే కంపెనీని పిలిచి లక్ష ఇంజక్షన్లు సరఫరా చేయాలని అధికారులు కోరారు. దానికి ఆ కంపెనీ ససేమిరా అని చెప్పేసింది.


పాత బిల్లులు చెల్లిస్తేనే, కొత్త అర్డర్‌ తీసుకుంటామని తేల్చిచెప్పింది. మరోవైపు కొత్తగా టెండర్‌ దక్కించుకున్న కంపెనీ కూడా మే రెండో వారానికిగానీ సరఫరా చేయలేమని తేల్చిచెప్పేసింది. వైద్య నిపుణులు సెకండ్‌ వేవ్‌పై హెచ్చరించినప్పుడే కళ్లు తెరిచి టెండర్లు పిలుచుకుని అర్డర్లు సిద్ధం చేసుకుని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆరోగ్యశాఖ వర్గాలే అంటున్నాయి.  మరోవైపు రాష్ట్రంలో మల్టీ విటమిన్‌ బిళ్లలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. దీంతో కొన్ని ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా బాధితులకు ఈ బిళ్లలు ఇవ్వకుండానే చికిత్స అందిస్తున్నారు. 


చస్తున్నా అదే సంఖ్య..

మార్చి రెండోవారం నుంచి రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైంది. అప్పట్లో రోజుకు యాభై, వంద కేసులు చొప్పున నమోదయ్యేవి. చూస్తుండగానే వాటి సంఖ్య వేలల్లోకి చేరిపోయుంది. మరణాలూ భయపెడుతున్నాయి. అయితే, ఈ వేవ్‌ తొలిరోజు నుంచి నేటి వరకూ ఆరోగ్యశాఖ జరిపే పరీక్షల సంఖ్యలో మటుకు మార్పులేదు. 


ఇదేనా రికార్డు డోసు!

రాష్ట్రానికి ఈ నెల 12వ తేదీన వచ్చిన 4.40 లక్షల కోవిషీల్డ్‌, 13వ తేదీన వచ్చిన రెండు లక్షల కోవాగ్జిన్‌లను మొదటి డోసు, రెండో డోసు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ బుధవారం అందించేశారు. ఆ ఒక్కరోజే ఆరులక్షల మందికి ‘టీకా ఉత్సవ్‌’లో వ్యాక్సిన్‌ అందించి.. దేశంలోనే రికార్డులు స్పష్టించినట్టు గొప్పలు చెప్పుకొన్నారు. గురువారంనాటికి వ్యాక్సిన్‌ లేకుండా చేశారు.


 వచ్చిందింత.. వేసిందెంత?

రాష్ట్రంలో వ్యాక్సిన్‌ అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వం అందరికీ వ్యాక్సిన్‌ వేస్తామని చెబుతున్నా... ప్రజలకు నచ్చిన వ్యాక్సిన్‌ వేయించుకునే అవకాశం ఇవ్వడం లేదు. ఇక రెండో డోస్‌ కోసమైతే ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రానికి ఇప్పటి వరకూ కేంద్రం సుమారు 40 లక్షల డోసులు అందించింది. తామిచ్చిన వ్యాక్సిన్‌లో సగం మాత్రమే ఉపయోగించుకుని... మిగిలిన సగం రెండో డోస్‌ కోసం స్టోర్‌ చేయాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇవేమి పట్టించుకోకుండా... వచ్చిన వ్యాక్సిన్‌ను వచ్చినట్లు రాష్ట్రంలో మొదటి డోస్‌కే వాడేశారు. రెండో డోస్‌కు తీవ్ర కొరతకు ఇదే కార ణం. ముఖ్యంగా కొవాగ్జిన్‌ విషయంలో ప్లానింగ్‌ లేకుండా ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు.


రాష్ట్రంలో ఎక్కడా కొవాగ్జిన్‌ రెండవ డోస్‌కు వ్యాక్సిన్‌ లేదు. ఇప్పటి వరకూ సుమారు 9 లక్షల మందికి కోవాగ్జిన్‌ అందించారు. ఇందులో కేవలం 2.5 నుంచి 3 లక్షల మందికి మాత్రమే మొదటి డోస్‌ అందింది. కేంద్రం ఈ నెల 13వ తేదీన మరో 2లక్షల డోస్‌లు పంపించింది. దీనిని కూడా ప్లాన్‌ చేయకుండా ‘టీకా ఉత్సవ్‌’లో వాడేశారు. చాలాచోట్ల ఒక ప్లాన్‌ లేకుండా టీకా డోసులు వృథా చేశారు. 


పడకల కోసం పాట్లు...

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 31,710 యాక్టివ్‌ కేసులున్నాయి. కానీ ఆరోగ్యశాఖ అందుబాటులో ఉంచిన పడకల సంఖ్య 15,845 మాత్రమే. ఇందులో 2121 ఐసీయూ బెడ్లు, 9461 సాధారణ పడకలు, 4258 జనరల్‌ వార్డుల్లోని పడకలు అందుబాటులో ఉంచారు. 31,710 మందిలో సగం మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నా చాలామంది ఆస్పత్రుల్లోనే ఉన్నారు. మరోవైపు రోజు వారి కేసులసంఖ్య వేలల్లో ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా బాధితులకోసం పడకల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల కోసం రాష్ట్ర స్థాయి, జిల్లా ఆస్పత్రులను ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. కానీ ప్రస్తుతం రాష్ట్ర, జిల్లా స్థాయి ఆస్పత్రుల ఊసే ఎత్తడం లేదు. ఉన్నవాటితో సరిపెట్టుకోండి అన్నట్లుగా ఆరోగ్యశాఖ తీరు ఉంది.


సీఎం చెప్పిన విధంగా మూడు గంటల్లో పడకలు దొరికే పరిస్థితి ఎక్కడా లేదు. ప్రతి ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజాప్రతినిధులో, అధికారులో చెబితే తప్ప బెడ్‌ ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే అదునుగా తీసుకుని ప్రైవేటు ఆస్పత్రులు రెచ్చిపోతున్నాయి. కరోనా బాధితులు సాధారణ పరిస్థితుల్లో ఉంటే రోజుకు రూ.25 వేలు, వెంటిలేటర్‌పై ఉంటే మాత్రం రోజుకు లక్షల వరకూ వసూళ్లు చేస్తున్నారు. నిబంధన ప్రకారం కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ధరలు నిర్ణయించింది. నాన్‌ క్రిటికల్‌ కేర్‌ బాధితులకు రోజుకు రూ. 3250 మాత్రమే చార్జ్‌ చేయాలి. ఎంత సీరియస్‌ కేసు అయినా రోజుకు రూ.10,380లకు మించి బిల్లు వేయరాదు. కానీ ప్రైవేటు ఆస్పత్రులు ఈ నిబంధనలు గాలికి వదిలేసి, బాధితుల్ని పిండేస్తున్నాయి.


కొంత మంది రోగులు ప్రాణాలు నిలుపుకోవడానికి ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితులు దాపురించాయి. మరోవైపు అందరికీ ఆరోగ్యశ్రీలో ఉచితంగా కరోనా చికిత్స చేస్తామంటూ సర్కారు పెద్దలు ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ రోజు వరకూ ఒక్క నెట్‌వర్క్‌ ఆస్పత్రి కూడా కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేసిన దాఖలాలు లేవు. పైగా డీఎంహెచ్‌వోలు, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్లు ప్రైవేటు ఆస్పత్రులతో కుమ్మకై, కరో నా బాధితుల్ని అక్కడకు తరలిస్తూ కమిషన్లు తీసుకునే స్థాయికి వెళ్లారు.

Updated Date - 2021-04-16T09:39:07+05:30 IST