టెస్టుల కంటే చికిత్స ముఖ్యం

ABN , First Publish Date - 2021-05-14T08:06:40+05:30 IST

కరోనా పరీక్షల కంటే చికిత్సే ముఖ్యమని.. అందుకే ఇంటింటి సర్వే చేసి, లక్షణాలున్నవారిని గుర్తించి మందుల కిట్లను అందజేస్తున్నామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు చెప్పారు

టెస్టుల కంటే చికిత్స ముఖ్యం

లక్షణాలు కనిపించగానే మందులు వాడితే మంచిది

పరిస్థితి తీవ్రమై ఆస్పత్రిపాలు అయ్యే ప్రమాదం ఉండదు

ఇంటింటి సర్వేలో 70 లక్షల ఇళ్లలో స్ర్కీన్‌ చేశాం

ఇప్పటిదాకా 2.6 లక్షల మందుల కిట్లు పంపిణీ చేశాం

రాష్ట్రంలో మరణాలు, కేసులు, పాజిటివిటీ తగ్గుముఖం

ప్రైవేటువారు ప్రత్యామ్నాయ మందులను వాడాలి

ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: డీహెచ్‌ శ్రీనివాసరావు


హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): కరోనా పరీక్షల కంటే చికిత్సే ముఖ్యమని.. అందుకే ఇంటింటి సర్వే చేసి, లక్షణాలున్నవారిని గుర్తించి మందుల కిట్లను అందజేస్తున్నామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు చెప్పారు. వైద్య విద్య సంచాలకుడు రమే్‌షరెడ్డితో కలిసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్షణాలు కనపడగానే త్వరితగతిన మందుల వాడకాన్ని ప్రారంభించడం వల్ల చాలా మంది ఆస్పత్రుల్లో చేరే పరిస్థితి రాకుండా బయటపడుతున్నారని శ్రీనివాసరావు తెలిపారు. లక్షణాలున్నవారికి వెంటనే చికిత్స ప్రారంభించకుండా రోగ నిర్ధారణ పరీక్షల పేర జాప్యం చేస్తే విలువైన సమయాన్ని కోల్పోయినట్టు అవుతుందన్నారు. సకాలంలో చికిత్స అందక పరిస్థితి తీవ్రంగా మారి ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం ఏర్పడుతుందని వివరించారు. అందుకే తాము ఇంటింటి సర్వే చేస్తున్నట్టు చెప్పారు. ఈ సర్వేలో భాగంగా 24,887 వైద్య బృందాలు ఇప్పటిదాకా 70లక్షల ఇళ్లలో 5,05,204 మందిని స్ర్కీన్‌ చేసి.. వారిలో లక్షణాలున్న 2.60 లక్షల మందికి కిట్లను పంపిణీ చేసినట్టు చెప్పారు. వారిలో 0.5-1ు మందికి సాధారణ ఫ్లూ లక్షణాలున్నాయని, అది కొవిడ్‌ అయినా కాకపోయినా.. మందుల వల్ల సీరియస్‌ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో మందులు ఇచ్చినట్టు తెలిపారు. ఇలాంటి కొత్త విధానాలను తెలంగాణ ప్రభుత్వమే ప్రారంభిస్తుందని.. ఇదివరకు మన రాష్ట్రం యాంటీజెన్‌ టెస్టులను ప్రారంభించగానే కేంద్రం దానినే అనుసరించిందని గుర్తు చేశారు.


రాష్ట్రంలో కేసులు తగ్గుతున్నాయి..

నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వంటి చర్యలు, ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల రాష్ట్రంలో కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గుముఖం పడుతున్నట్టు డీహెచ్‌ తెలిపారు. ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతున్నాయన్నారు. రాబోయే వారాల్లో కేసులు మరింత తగ్గే అవకాశం ఉంటుందని.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పేషంట్ల అడ్మిషన్లు తగ్గడం ప్రారంభమైందని తెలిపారు. రాష్ట్రంలో మరణాల రేటు కూడా తగ్గుముఖం పట్టిందని, ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలో 71,221 పరీక్షలు నిర్వహించగా 4,693 మందికి పాజిటివ్‌ వచ్చిందని, 6,576 మంది కోలుకున్నారని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 33 మంది చనిపోయారని వెల్లడించారు.


వ్యాక్సిన్‌ లభ్యత ఆధారంగానే..

లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని.. టెస్టులు, చికిత్సలు, వ్యాక్సిన్ల కోసం వెళ్లే ప్రజలు దారిలో ఆపే పోలీసులకు ఆ వివరాలు చెప్పి వెళ్లొచ్చని డీహెచ్‌ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడినవారికి, రెండో డోసు వేసుకోవాల్సిన వారికి మాత్రమే టీకా ఇస్తున్నట్లు చెప్పారు. ‘‘ఈ నెలాఖరు నాటికి ఇంకా 15 లక్షల మందికి రెండో డోసు వేయాల్సి ఉంది. వారికి వ్యాక్సినేషన్‌ కొనసాగిస్తాం. వారు ఆన్‌లైన్‌లో స్లాట్లు బుక్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొవిషీల్డ్‌ రెండో డోసును 6 నుంచి 8 వారాల మధ్య తీసుకోవాలి. కొవాగ్జిన్‌ అయితే.. 4 నుంచి 6 వారాల మధ్య తీసుకోవాలి. రెండో డోసు ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిది. అందరికీ టీకా అందుతుంది. 18-44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్‌ లభ్యతను బట్టి వేయడం జరుగుతుంది. వీరి కోసం ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందిస్తోంది’’ అని శ్రీనివాసరావు పేర్కొన్నారు.


పడకలకు ఇబ్బంది లేదు..

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పేషెంట్లకు కావాల్సిన పడకలు అందుబాటులో ఉన్నాయని గడల చెప్పారు. గత సెప్టెంబరు 3 నాటికి రాష్ట్రంలో కొవిడ్‌ చికిత్సనందించే ప్రభుత్వ ఆస్పత్రులు 42 ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్యను 110కి పెంచామని, కొవిడ్‌ చికిత్స అందించే ప్రైవేటు ఆస్పత్రుల సంఖ్య 194 నుంచి 1051కి పెరిగిందని తెలిపారు. ఫస్ట్‌వేవ్‌లో 18,232 పడకలుంటే ఇప్పుడు 53,568కి పెరిగాయని వివరించారు. వీటిలో 5,783 ఆక్సిజన్‌ బెడ్స్‌, 2,867 ఐసీయూ బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయన్నారు. రెమ్‌డెసివిర్‌, ఇతర ఔషధాలపై మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలోని స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షిస్తోందని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం రోజూ 450 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను కేటాయిస్తోందని, ఇందులో 430 మెట్రిక్‌ టన్నులను వాడుతున్నామని వెల్లడించారు. కరోనా పేషంట్లకు వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లకు ప్రత్నామ్నాయంగా ఇతర మందులు మార్కెట్‌లో ఉన్నాయని, వాటిని వినియోగించాలని సూచించారు.


ప్రజలు గుమిగూడొద్దు..

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా విధి లేని పరిస్థితుల్లోనే పభుత్వం లాక్‌డౌన్‌ను విధించిందని.. ప్రజలు దీన్ని అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించాలని గడల సూచించారు.  లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిచ్చిన ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మార్కెట్లు, మద్యం షాపుల వద్ద జనం గుమిగూడుతున్నారని, ఇది కేసులు పెరగడానికి కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌లో 20 గంటల పాటు ఇళ్లలో ఉండి, మళ్లీ గుమిగూడడం వల్ల చేజేతులా పరిస్థితిని నాశనం చేసుకున్నట్లువుతుందని అన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరూ సామాజిక బాధ్యతగా నిబంధనలు పాటించాలన్నారు. పెళ్లిళ్లు, అంత్యక్రియల విషయంలో అనుమతించిన సంఖ్యలోనే హాజరు కావాలని తెలిపారు.


బ్లాక్‌ ఫంగ్‌సపై భయాలొద్దు డీఎంఈ రమేశ్‌రెడ్డి

బ్లాక్‌ ఫంగ్‌స ఇప్పటిది కాదని, దీనిపై ప్రజలు భయాందోళన చెందవద్దని వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి సూచించారు. బ్లాక్‌ ఫంగస్‌ ఎప్పటి నుంచో ఉందని, తీవ్ర మధుమేహం, ఇతరత్రా జబ్బులున్నవారికి, స్టెరాయిడ్స్‌ను ఎక్కువగా వినియోగించిన వారికే ఈ సమస్య వచ్చే ముప్పుందని వివరించారు. ప్రతి కొవిడ్‌ పేషంట్‌కూ ఈ సమస్య రాదని, భయపడొద్దని సూచించారు. గాంధీ ఆస్పత్రిలో ఏడు బ్లాక్‌ ఫంగస్‌ కేసులున్నట్లు వచ్చిన వార్త నిజం కాదని.. ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ముగ్గురు రోగులు మాత్రమే గాంధీ ఆస్పత్రికి ఆ సమస్యతో వచ్చారని తెలిపారు. ప్రసుతం రాష్ట్రంలో 15-20 వేల మంది డాక్టర్లు పీజీ సీట్ల కోసం ప్రిపేర్‌ అవుతున్నారని, ఇలాంటివారు తాత్కాలిక ప్రాతిపదికన వైద్యం అందించడానికి ముందుకు రావాలని కోరారు. కేంద్రం 51 ఆక్సిజన్‌ జనరేటర్లను మంజూరు చేసిందని చెప్పారు.

Updated Date - 2021-05-14T08:06:40+05:30 IST