కొత్త మండలాలపై ఆదివాసీల్లో ఆశలు

ABN , First Publish Date - 2020-11-19T15:59:39+05:30 IST

ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని..

కొత్త మండలాలపై ఆదివాసీల్లో ఆశలు

ఏజెన్సీ మండలాలను పునర్విభజన చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌

జిల్లా విస్తీర్ణంలో 55 శాతం మన్యం...మండలాలు మాత్రం పదకొండే!

మండల కేంద్రానికి సుదూరంలో గ్రామాలు

కొరవడిన రహదారి, రవాణా సదుపాయాలు 

మండల కేంద్రాలకు రాకపోకలకు అష్టకష్టాలు

ఎనిమిది కొత్త మండలాల ఏర్పాటు అవశ్యం

కొత్త మండలాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంతో మరోసారి తెరపైకి పునర్విభజన అంశం


పాడేరు(విశాఖపట్నం): ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయడానికి వైసీపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇదే సమయంలో ప్రజల సౌకర్యార్థం కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నది. జిల్లాలో అనకాపల్లి, అరకులోయ/ పాడేరు కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త మండలాల ఏర్పాటు కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపడానికి జిల్లా అధికారులు సిద్ధంగా వున్నట్టు సమాచారం. 


జిల్లా విస్తీర్ణంలో సగానికిపైగా వున్న ఏజెన్సీ ప్రాంతంలో కొత్త మండలాలు ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని గిరిజనులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మండల పరిధిలోని పలు గ్రామాలు...మండల కేంద్రాలకు 50 నుంచి 120 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నాయి. ఈ గ్రామాలకు రహదారి, రవాణా సదుపాయాలు లేకపోవడంతో గిరిజనులు వివిధ పనుల కోసం మండల కేంద్రానికి రావాలంటే నానా అవస్థలు పడుతున్నారు. ప్రజల సౌలభ్యం కోసం ఏజెన్సీ మండలాలను పునర్విభజన చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం 11 మండలాలు వుండగా, మరో ఎనిమిది మండలాలను ఏర్పాటుచేయాలని కోరుతున్నాయి. ఆయా ప్రాంతాల గిరిజనుల అభిప్రాయాల మేరకు కొత్తగా ఎన్ని మండలాలు ఏర్పాటు చేయవచ్చు?, మండల కేంద్రాలుగా ఏ పంచాయతీలు వుంటే సౌలభ్యంగా ఉంటుంది?, ఏయే పంచాయతీలతో కొత్త మండలాలను ఏర్పాటు చేయవచ్చు? తదితర విషయాలపై ‘ఆంధ్రజ్యోతి’ సమగ్ర విశ్లేషణ.


కాశీపట్నం

అనంతగిరి మండలంలో కాశీపట్నం కేంద్రంగా నూతన మండలాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని పలు పంచాయతీల గిరిజనులు అంటున్నారు. అనంతగిరి మండలంలో గల కాశీపట్నం, చిలకలగెడ్డ, కొత్తూరు, ఎన్‌.ఆర్‌.పురం, భీంపోలు, గుమ్మకోట, గరుగుబిల్లి, రొంపల్లి, పినకోట, పెదకోట, కివర్ల, జీనబాడు పంచాయతీలతో కాశీపట్నం కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటుచేయాలి. 


కించుమండ

డుంబ్రిగుడ మండలం కించుమండ కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలి. డుంబ్రిగుడలో వున్న కించుమండ, కితలంగి, కొర్రా పంచాయతీలతోపాటు హుకుంపేట మండలం మజ్జివలస, పట్టాం, గత్తుం పంచాయతీలు, అనంతగిరి మండలం వేంగడ, పైనంపాడు పంచాయతీలను కించుమండ మండలంలో చేర్చాలి. కొల్లాపుట్టు పంచాయతీని అరకులోయ మండలంలో కలపాలి. 


గుత్తులపుట్టు

పాడేరు మండలం గుత్తులపుట్టును కొత్త మండలంగా ఏర్పాటుచేయాలి. పాడేరు మండలంలోని గుత్తులపుట్టు, జి.ముంచంగిపుట్టు, బడిమెల, బరిసింగి, డోకులూరు, ఇరడాపల్లి, గబ్బంగి, కించూరు, గొండెలితోపాటు పెదబయలు మండలంలోని కుంతర్ల, కిముడుపల్లి, పెదకోడాపల్లి, గంపరాయి పంచాయతీలను నూతన మండలంలో కలపాలి. మిగిలిన 17 పంచాయతీలు పాడేరులోనే ఉంటాయి.


జోలాపుట్టు

ముంచంగిపుట్టు మండలంలోని జోలాపుట్టు కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటుచేయాలి. ముంచంగిపుట్టులో 23 పంచాయతీలు వుండగా ఎనిమిది పంచాయతీలు...జోలాపుట్టు, బరడ, బుంగాపుట్టు, దోడిపుట్టు, లక్ష్మీపురం, మాకవరం, రంగబయలు, వనుగుమ్మలను జోలాపుట్టు కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త మండలంలో చేర్చాలి.


మద్దిగరువు

జి.మాడుగుల మండలం మద్దిగరువును కేంద్రంగా చేసుకుని కొత్త మండలాన్ని ఏర్పాటుచేయాలి. జి.మాడుగుల మండలంలోని నుర్మతి, కిల్లంకోట, బొయితిలి పంచాయతీలు, పెదబయలు మండలంలోని గోమంగి, గుల్లెలు, బొంగరం, ఇంజెరి, లింగేటి, గిన్నెలకోట, జామిగుడ పంచాయతీలను మద్దిగరువు మండలంలో చేర్చాలి.  


తాజంగి 

చింతపల్లి మండలం తాజంగి కేంద్రంగా మండలం ఏర్పాటుచేయాలి. దీనిలో చింతపల్లి మండలంలోని కొత్తపాలెం, తాజంగి, కిటుముల, గొందిపాకలు, పెదబరడ, శనివారం; కొయ్యూరు మండలంలోని మూలపేట, డౌనూరు; జి.మాడుగుల మండలంలోని వంజరి, గెమ్మెలి పంచాయతీలను కలపాలి.


పెదవలస

గూడెంకొత్తవీధి మండలం పెదవలస కేంద్రంగా మరో మండలాన్ని ఏర్పాటు చేయాలి. దీనిలో పెదవలస, లక్కవరపుపేట, దేవరాపల్లి, సంకాడ, అసరాడ, రింతాడ, దామనాపల్లి, వంచుల, జెర్రెల, మొండిగెడ్డ పంచాయతీలను చేర్చాలి


కొండగోకిరి

జిల్లాలో ఒక్క పద్ధతి అంటూ లేకుండా ఏర్పాటుచేసిన మండలం కొయ్యూరు. కొన్ని పంచాయతీల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే తూర్పుగోదావరి జిల్లాలో వంద కిలోమీటర్లకుపైగా ప్రయాణించాలి. అందువల్ల కొండగోకిరి కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటుచేయాలని పలు పంచాయతీల ప్రజలు చాలాకాలంగా కోరుతున్నారు. కొండగోకిరి, అడ్డాకుల, అంతాడ, బకులూరు, బాలారం, బంగారమ్మపేట, బట్టపనుకులు, చిట్టెంపాడు, గదబపాలెం, కంఠారం, కినపర్తి, కొమ్మిక, నడింపాలెం, పి.మాకవరం, ఆర్‌.కొత్తూరు, రత్నంపేట, శరభన్నపాలెం, వెలగలపాలెం పంచాయతీలతో కొండగోకిరి కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటుచేయాలి.


జిల్లా విస్తీర్ణంలో 55.5 శాతం ఏజెన్సీనే!

విశాఖపట్నం జిల్లా మొత్తం విస్తీర్ణం 11,161 చదరపు కిలోమీటర్లు. దీనిలో గిరిజన ప్రాంతమైన ఏజెన్సీ విస్తీర్ణం 6,200 కిలోమీటర్లు ఉంది. రెవెన్యూ మండలాలు మైదాన ప్రాంతంలో 35, మన్యంలో 11 ఉన్నాయి. మండల పరిషత్‌లు మైదాన ప్రాంతంలో 29, మన్యంలో 11 వున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం విశాఖ జిల్లా జనాభా 42,90,589 మంది. అందులో గిరిజన జనాభా 6,18,500 మంది వుండగా వీరిలో 5,47,951 మంది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారు. 


అరకులోయ మండలంలో కొత్తగా మరో మండలాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. అయితే హుకుంపేట మండలం బూర్జ; డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టులను అరకులోయ మండలంలో కలపాలని ఆయా పంచాయతీల ప్రజలు కోరుతున్నారు.


హుకుంపేట మండలంలో 33 పంచాయతీలు ఉన్నాయి. భౌగోళికంగా చూస్తే కొత్త మండలం ఏర్పాటు అవసరం లేదు. అయితే మజ్జివలస, పట్టాం, గత్తుం పంచాయతీలను కొత్తగా ఏర్పాటుచేసే కించుమండ మండలంలో కలపాలి. బూర్జ పంచాయతీని ఆ మండలంలో విలీనం చేయాలి.


మండలాల విభజన ఎంతో అవసరం

జిల్లా విస్తీర్ణంలో సగానికిపైగా ప్రాంతం ఏజెన్సీలోనే ఉంది. మండలాల విషయా నికి వస్తే నాలుగోవంతు మాత్రమే వున్నాయి. ప్రతి మండలంలో దాదాపు సగం పంచా యతీలు, వాటి శివారు గ్రామాలు మండల కేంద్రానికి చాలా దూరంగా వున్నాయి. సరైన రహదారులు లేకపోవడం, రవాణా సదుపా యాలు అంతంత మాత్రంగానే వుండడంతో మండల కేంద్రాలకు వెళ్లిరావాలంటే గగనమైపోతున్నది. మౌలిక సదుపాయాలు కొరవడి, గిరిజనులు దుర్భరంగా జీవిస్తున్నారు. ముఖ్యం గా ముంచంగిపుట్టు, పెదబయలు, కొయ్యూరు, అనంతగిరి, జీకేవీధి మండలాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను పునర్విభజనతోపాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏజెన్సీలో కొత్త మండలాల ఏర్పాటుకు ఇదే సరైన సమయం.

 - పి.అప్పలనర్స, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి, పాడేరు

ఏజెన్సీలో ప్రస్తుతం ఉన్న మండలాలు

అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి,  జీకేవీధి, కొయ్యూరు.


కొత్తగా ఏర్పాటు చేయాల్సిన మండలాలు

కాశీపట్నం, కించుమండ, గుత్తులపుట్టు, మద్దిగరువు, తాజంగి, జోలాపుట్టు, పెదవలస, కొండగోకిరి

Updated Date - 2020-11-19T15:59:39+05:30 IST