Abn logo
Aug 11 2020 @ 01:09AM

మూగవోయిన గిరిజన గొంతుక

మారుమూల ఏజెన్సీ గిరిజనగూడలో పేదవాడిగా పుట్టి పేదవాడి గానే పెరిగి పేదవాళ్ళ కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి సున్ననం రాజయ్య పేదలకు కష్టాలు ఉండకూడదు, పేదల సమస్యలు ఎదుర్కోకూడదు, వారు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నమ్మి నిరంతరం పోరాటం చేసిన రాజయ్య పేదరికంలోనే మరణించాడు. ‘నేను మరణిస్తే నా శవం మీద ఎర్ర జెండా ఉండాలి.. నాకింకేమీ వద్దు’ అనే నిష్ఠతో బతికినవాడు. పదవులు, హోదాలు మనిషిలో మార్పు తెస్తాయనే సాధారణ సూత్రీకరణకు పూర్తిగా విరుద్ధంగా బతికిన మహామనిషి రాజయ్య. ఆయన లేని లోటు చాలా బాధాకరమైనది. పేద ప్రజల, ఆదివాసుల, దళిత ప్రజల గొంతుక సున్నం రాజయ్య జీవితమంతా వారి సమస్యల పరిష్కారం కోసం బతికిన అసామాన్యుడు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల, రాజకీయం పట్ల జనసామాన్యంలో విశ్వాసం కలిగించిన ఆదర్శ నాయకుడు. 1999, 2004, 2014లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అసెంబ్లీ సమావేశాలకు ఆర్టీసీ బస్సు లేదా రైలులోనే ప్రయాణించి హాజరయ్యేవారు. ఎక్కడ హంగూ ఆర్భాటాలు లేకుండా నిరంతరం నియోజకవర్గ ప్రజలకు, గిరిజనులకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కరించడంలో నిమగ్నమయ్యేవాడు. గిరిజన హక్కుల కోసం పనిచేసేవాడు.


సుదీర్ఘ కాలంలో గిరిజనుల అటవి హక్కుల చట్టం, ఎస్‌ఎల్‌బిసి సొరంగ మార్గం, డిండి ఎత్తిపోతల పథకం, ఎఎంఆర్‌పి ప్రాజెక్టు సమస్యలపై అసెంబ్లీలోనూ, బయట పోరాడిన నాయకుడు. అసెంబ్లీలో గిరిజన భాషలో, కోయ భాషలో మాట్లాడి వారి సమస్యలను ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా ఆయన ప్రసంగించారు. గిరిజనుల అస్తిత్వం కోసం తన గళాన్ని పదునుపెట్టి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయడానికి నిరంతరం పోరాటం చేశాడు. రాజయ్య మరణం సామాజిక ఉద్యమానికి తీరని లోటు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ రాజయ్య ఉండేవాడు. నీతి నిజాయితీగా కమ్యూనిస్టు ఉద్యమాలకి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చి అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సుకోసం పాటుపడిన నాయకుడు. అనేక సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నాలుగు పార్టీలు ఆహ్వానం పలికినా నమ్మిన సిద్ధాంతం కోసం ‘చివరి శ్వాస ఉన్నంతవరకు కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగానే బతుకుతాను కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకే నా జీవితానికి అంకితం చేస్తున్నాను’ అని చెప్పిన ఆదర్శ నాయకుడు. సున్నం రాజయ్య గిరిజన ఆదివాసీ గూడలో అల్లూరి సీతారామరాజు సాహసంతో, మేడారం సమ్మక్క సారలమ్మ వారసుడుగా, కొమరం భీమ్‌ పోరాట పటిమతో, ప్రజా సమస్యల గోడు వినిపించడంలో ముందువరుసలో ఉండేవారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో కూడా కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తులు కూడా ఇలా ఉంటారా అని అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఆయన జీవిత ప్రస్థానం కొనసాగింది. పార్టీలకు, కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలతో శభాష్‌ అనిపించుకున్న వ్యక్తి రాజయ్య. సమస్యల పరిష్కారంలో నేటి యువతరం ఆయన పోరాటపటిమను ఆదర్శంగా తీసుకోవాలి.

భానోతు లక్ష్మీబాయి

Advertisement
Advertisement
Advertisement