అయ్యో... గిరిజన తల్లులారా!

ABN , First Publish Date - 2022-06-05T07:55:02+05:30 IST

ఆ 12 మందీ రెక్కాడితే గానీ డొక్కాడని గిరిజన మహిళలు! వారికి చిన్న చిన్న పిల్లలున్నారు. కొందరైతే పాలిచ్చే

అయ్యో... గిరిజన తల్లులారా!

12 మంది నిరుపేద మహిళలు జైల్లో

అటవీ భూమి చదును చేశారని ఆరోపణ

పోడు భూమి సాగుచేస్తున్నాం: బాధితులు

అర్ధాకలితో బాధితుల పిల్లలు

బాధితుల్లో ఒకరు బాలింత

విడుదల చేయించాలని సర్కారుకు వినతి

మంచిర్యాల కోయపోచగూడలో ఘటన


మంచిర్యాల, దండేపల్లి: జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఆ 12 మందీ రెక్కాడితే గానీ డొక్కాడని గిరిజన మహిళలు! వారికి చిన్న చిన్న పిల్లలున్నారు. కొందరైతే పాలిచ్చే తల్లులు కూడా. ఆ మహిళలపై అటవీశాఖ అధికారులు కేసు పెట్టి జైలుకు పంపారు. ఇన్ని తిండగింజల కోసం ఏళ్లుగా తమ అధీనంలో ఉన్న భూ ములను పంటల కోసం చదును చేయడమే వారు చేసిన నేరమైంది. అటవీ భూముల్లోకి ప్రవేశించారనే ఆరోపణలతో వారిని ఆ శాఖ అధికారులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడా బాధిత కుటుంబసభ్యుల ఆవేదన వర్ణణాతీతం. వండిపెట్టే వారు లేకపోవడంతో పెద్దలు, పిల్లలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. బాధితుల్లో ఒకరు పాలిచ్చే తల్లి ఉండటంతో తల్లికి దూరమైన ఆ శిశువుకు పోతపాలే దిక్కవుతున్నాయి.


మంచిర్యాల జిల్లా దం డేపల్లి మండలం కోయపోచగూడలో నెలకొన్న పరిస్థితి ఇది. ఈ నెల 1న గ్రామానికి చెందిన దోసండ్ల గంగవ్వ, శ్యామల,  సునీత, లచ్చవ్వ, మద్దికుంట శైలజ, గుడిపెల్లి చిన్న లక్ష్మి, పెద్ద లక్ష్మి, మద్దికుంట రజిత, సత్తవ్వ, రాజవ్వ, మోడ్తె పోశవ్వ, జైనేని లావణ్యపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చారు. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్‌ విధించడంతో ఆదిలాబాద్‌ జైలుకు తరలించారు. మరో 19 మందికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. 

 

జీవనం కోసం పోడే దిక్కు

కోయపోచగూడ గిరిజన గ్రామ జనాభా 200. ఇక్కడ 52 కుటుంబాలు జీవిస్తున్నాయి. అంతా నిరుపేదలే. ఏ కుటుంబానికీ పట్టా భూమి సెంటు కూడా లేదు. కొందరు తడకలల్లుతూ, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటే, ఇంకొందరు ఏళ్లుగా పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామ శివారులోని సుమారు 150 ఎకరాల్లో  చెట్ల పొదలు, ముళ్ల కంపలు తొలగించి సాగు చేస్తున్నారు. ఈ భూములు అటవీశాఖకు చెందినవని కావడంతో గిరిజనులపై అధికారులు కేసులు నమోదు చేశారు. కవ్వాల్‌ అభయారణ్యంలోకి అక్రమంగా, ఆయుధాలతో చొరబడ్డారని, చెట్లు నరికి అడవిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు చేశారు. 


పోడు భూముల కోసం పోరాటం 

2003 నుంచి 2009 దాకా ఇక్కడి గిరిజనుల్లో కొందరు పోడు భూముల కోసం పోరాటం చేశారు. ఆ తర్వాత అటవీ అధికారులు కేసులు పెడుతుండటంతో భయపడి నిలిపివేశారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించడంతో గిరిజనుల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం డిసెంబరులో పోడు భూములకు దరఖాస్తులు కూడా స్వీకరించింది. 2005 కంటే ముందు నుంచి పోడు భూముల్లో సాగు చేస్తున్న వారికి హక్కు పత్రాలు ఇస్తామని ప్రకటించింది. దీంతో గతంలో సాగు చేసిన భూముల్లో గిరిజనులు మళ్లీ పంటలు వేసేందుకు ప్రయత్నిస్తుండగా అటవీ అధికారులు అరెస్టు చేశారు. గిరిజనులు 2005కు పూర్వం సాగులో లేరని భూములు అటవీశాఖకే చెందుతాయని అధికారులు వాదిస్తుండగా, తాతలనాటి కాలం నుంచే తాము సాగు చేసుకొని జీవిస్తున్నామని, హక్కు పత్రాలు ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.  


తండ్రి మృతి, తల్లి జైలుకు 

కోయపోచగూడకు చెందిన దోసండ్ల సుశాంత్‌ (7) తండ్రి ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. జైలుకు వెళ్లిన మహిళల్లో  బాలుడి తల్లి తల్లి శ్యామల కూడా ఉన్నారు. దీంతో సుశాంత్‌ ఒంటరివాడయ్యాడు. ప్రస్తుతం బాబాయి ఎల్లయ్య వద్ద ఉంటున్నాడు. 


ఇద్దరు పిల్లలకు తిండి పెట్టే దిక్కులేదు

మాకు గుంట భూమి లేదు. కూలీ పనులు చేసుకుంటున్నం. చెట్లు కొట్టినారని ఆడోళ్లను జైలుకు పంపినరు. మాకు   ఇద్దరు పిల్లలు. నా భార్య రజిత జైలుకు వెళ్లడంతో పిల్లలకు తిండి పెట్టే దిక్కులేకుండా పోయింది. తల్లి కోసం పిల్లలు ఏడుస్తున్నరు. నా భార్యకు బెయిల్‌ ఇచ్చి ఇంటికి పంపించండి.  

మద్దికుంట శంకర్‌


హక్కు పత్రాలు ఇయ్యాలె

పోడు వ్యవసాయం చేసుకుని జీవించే మాకు ప్రభుత్వం హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలి. అధికారులు చిత్రహింసలు పెడుతున్నరు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నం. భూముల కోసం పోరాడుతున్నం. అటవీ సమీపంలోనే నివాసం ఉంటున్నం. వన్యప్రాణులకు, జీవరాశులకు ఏనాడు ప్రమాదం తలపెట్టలేదు. నా భార్య గంగవ్వ జైలుకు వెళ్లడంతో మూడు సంవత్సరాల పాప జమున తల్లికోసం తల్లడిల్లుతున్నది.  - దోసండ్ల చిన్న పోచం


ఫాంహౌస్‌ ముట్టడిస్తాం: సోయం 

పోడు భూముల సమస్య పరిష్కరించకుంటే ఫాంహౌస్‌ ముట్టడిస్తామని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు హెచ్చరించారు. పోడు భూముల పోరాటంలో జైలుపాలైన గిరిజన మహిళా కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ గిరిజన మహిళలపై పెట్టిన కేసులను ఎత్తివేసి వారిని జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  అర్హత కలిగిన ఆదివాసీ గిరిజనులందరికీ  పోడు భూములను పంపిణీ చేసి పట్టాలు అందించాలని కోరారు. 

Updated Date - 2022-06-05T07:55:02+05:30 IST