భూమికి బదులు భూమి.. ఇంటికో ఉద్యోగం

ABN , First Publish Date - 2021-01-20T05:08:18+05:30 IST

భూమికి బదులు భూమి.. ఇంటికో ఉద్యోగం

భూమికి బదులు భూమి.. ఇంటికో ఉద్యోగం
సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్వో రమాదేవి

ట్రైబల్‌ యూనివర్సిటీ భూనిర్వాసితుల డిమాండ్‌ 

రెండు రోజులకు వాయిదా పడ్డ అభిప్రాయ సేకరణ

ములుగు, జనవరి 19: ‘మాకు జీవనాధారమైన భూములను కోల్పోవడానికి సిద్ధంగా లేం... ఒకవేళ కోల్పోవాల్సి వస్తే భూమికి బదులుగా అంతే విస్తీర్ణంలో మరోచోట భూమి కేటాయించడంతోపాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి‘ అని జాతీయ గిరిజన విశ్వ విద్యాలయ భూనిర్వాసితులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ములుగు శివారులోని గట్టమ్మ దేవాలయం ప్రాంతంలో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 40ఏళ్ల క్రితం అక్కడి ప్రభుత్వ భూమిని పలువురు నిరుపేదలకు అసైన్డ్‌ చేశారు. అందులోని 837 సర్వే నంబర్‌లోని 98.30ఎకరాల భూమిని యూనివర్సిటీ నిర్మాణం కోసం రెవెన్యూ శాఖ కేటాయించింది. ఈభూమి సేకరణ కోసం మంగళవారం ములుగులోని కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో డీఆర్వో రమాదేవి ఆధ్వర్యంలో భూనిర్వాసితులతో అభిప్రాయం, అభ్యంతరాలపై సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఎంజాయ్‌మెంట్‌ సర్వే పూర్తి చేయగా రైతులకు నోటీసులు కూడా జారీ చేశారు. సమావేశం సందర్భంగా పలువురు రైతులు తమ భూమిని ఇచ్చేందుకు నిరాకరించారు. ఎక్కువశాతం దళితులే ఉన్నారని, కుటుంబానికి మూడెకరాలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఉన్న భూమిని లాక్కోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రెండు తరాలుగా అసైన్డ్‌భూమినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. భూమికి భూమి, ఆర్హతను బట్టి యూనివర్సిటీలో కుటుంబానికో ఉద్యోగం ఇవ్వాలని, అలాగైతేనే భూములను వదులుకునేందుకు అంగీకరిస్తామని స్పష్టం చేశారు. డీఆర్వో రమాదేవి మాట్లాడుతూ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటైతే ఈప్రాంతం అభివృద్ధి చెందుతుందని, తద్వారా ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ విలువను అనుసరించి ఎకరాకు రూ.4లక్షల 58వేలను ప్రభుత్వ ధరగా నిర్ణయించామని వెల్లడించారు. అయితే ఈ మొత్తానికి భూములు ఇచ్చేదిలేదని నిర్వాసితులు మరోమారు తేల్చిచెప్పారు. రెండురోజుల్లో తిరిగి సమావేశం ఏర్పాటు చేస్తామని, తుది నిర్ణయాన్ని వెల్లడించాలని డీఆర్వో రైతులకు సూచించారు. ఈసమావేశంలో తహసీల్దార్‌ సత్యనారాయణస్వామి, డిప్యూటీ తహసీల్దార్‌ ప్రసాద్‌, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-20T05:08:18+05:30 IST