దేశ చరిత్రలో తొలిసారి లాల్‌చౌక్ క్లాక్ టవర్‌పై రెపరెపలాడిన త్రివర్ణపతాకం

ABN , First Publish Date - 2022-01-26T21:25:05+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో బుధవారంనాడు అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమైంది. అక్కడి ప్రఖ్యాత లాల్ చౌక్ ఏరియాలోని..

దేశ చరిత్రలో తొలిసారి లాల్‌చౌక్ క్లాక్ టవర్‌పై రెపరెపలాడిన త్రివర్ణపతాకం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో బుధవారంనాడు అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమైంది. అక్కడి ప్రఖ్యాత లాల్ చౌక్ ఏరియాలోని ఘంటా ఘర్ (క్లాక్ టవర్)పై త్రివర్ణ పతాకం రెపరెలాడింది. 73వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పలువురు స్థానికులు ఈ జెండాను ఎగురవేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లాల్‌చౌక్ ఘాంటా ఘర్‌పై జాతీయపతాకం ఎగురవేయడం ఇదే మొదటిసారి.


లాల్‌చౌక్ ప్రాంతంలో ఎన్‌జీవోలు, ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్థానికులు 73వ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ఇద్దరు స్థానిక యువకులు సాజిద్ యూసుఫ్ షా, సహిల్ బషీర్‌లు ఒక క్రేన్‌ సాయంతో క్లాక్ టవర్ పైవరకూ వెళ్లి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ''స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇక్కడ పాకిస్థాన్ జెండాలు మత్రమే ఎగిరేవి. శాంతికి భంగం కలిగిస్తూ వచ్చిన పాకిస్థాన్ ప్రేరేపిత వ్యక్తులు ఈ జెండాలు ఎగుర వేసేవారు. 370వ అధికరణ రద్దు తర్వాత ఇక్కడి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. నయా కశ్మీర్‌ అంటే ఏమిటని జనం అడుగుతున్నారు? ఇవాళ ఎగురవేసిన త్రివర్ణ పతాకమే నయా కశ్మీర్‌కు అర్ధం చెబుతుంది. ఇదే జమ్మూకశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నది కూడా. మాకు పాకిస్థాన్ జెండాలు అక్కర్లేదు. మేము శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నాం'' అని జెండా ఆవిష్కరణ అనంతరం స్థానికుడు ఒకరు తెలిపారు.


కశ్మీర్ రాజకీయాలకు సంబంధించి లాల్‌చౌక్‌లోని క్లాక్ టవర్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. దేశంలోనే కాకుండా, జమ్మూకశ్మీర్‌లోని పెద్దపెద్ద నేతలు గతంలో క్లాక్‌ టవర్‌పై జెండా ఎగురవేసే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు. దీనిపై స్థానిక యువకుడు సాజిత్ యూసుఫ్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో జాతీయ జెండా ఎగరని ప్రాంతం ఇదొక్కటేనని, గతంలో చాలా మంది ప్రయత్నించినప్పటికీ తామే తొలిసారిగా సక్సెస్ అయ్యామని అన్నాడు. భారతీయులుగా జాతీయ జెండాను ఎగురవేయడం తమకెంతో సంతోషాన్ని కలిగించదని చెప్పాడు.

Updated Date - 2022-01-26T21:25:05+05:30 IST