త్రిశూల వ్యూహం..!

ABN , First Publish Date - 2021-04-06T08:28:41+05:30 IST

త్రిశూల వ్యూహం..! బాహుబలి సినిమాలో శివగామి దీని గురించి చెప్పినప్పుడు.. ఈ వ్యూహాన్ని ఇప్పటి వరకు ఎవరూ అవలంబించలేదని కట్టప్ప

త్రిశూల   వ్యూహం..!

  • ‘యూ’ట్రాప్‌.. రెండు వైపులా ఊళ్లలో పాగా
  • ఛత్తీస్‌గఢ్‌లో హిడ్మా అవలంబించింది ఇదే
  • పథకం ప్రకారమే ఇన్ఫార్మర్లకు లీకులు
  • జవాన్లను 4 కిలోమీటర్ల మేర చుట్టుముట్టారు
  • వెనక్కి వెళ్లే అవకాశమే లేకుండా చేశారు
  • అందుకే భద్రతాబలగాల్లో ఎక్కువ ప్రాణనష్టం
  • దొరికిన వారిని చిత్రహింసలు పెట్టి చంపారు
  • మావోయిస్టుల చెరలో కోబ్రా కమాండో?
  • ‘ఆపరేషన్‌ ప్రహార్‌’ను నిలిపేయాలని డిమాండ్‌
  • మృతుల కుటుంబాలకు 80 లక్షలు: ఛత్తీస్‌గఢ్‌  

చర్ల, అమరావతి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): త్రిశూల వ్యూహం..! బాహుబలి సినిమాలో శివగామి దీని గురించి చెప్పినప్పుడు.. ఈ వ్యూహాన్ని ఇప్పటి వరకు ఎవరూ అవలంబించలేదని కట్టప్ప అభ్యంతరం చెబితే.. బాహుబలి ఇదే సరైన వ్యూహమంటాడు..! సరిగ్గా.. ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టు గెరిల్లా మూక దళపతి మాద్వీ హిడమా అలియాస్‌ హిడ్మా.. ఇదే వ్యూహంతో భద్రతా బలగాలను దొంగదెబ్బ కొట్టాడు. వ్యూహాత్మకంగా తన ఉనికి గురించి ఇన్ఫార్మర్లకు లీకులు ఇచ్చి.. స్వయంగా పోలీసులకు ఫోన్‌ చేసి.. వారు తన ఉచ్చులో పడేలా చేశాడు. 1,200 మంది జవాన్లను దండకారణ్యానికి రప్పించి.. లైట్‌ మెషీన్‌ గన్‌(ఎల్‌ఎంజీ), గ్రనేడ్‌ లాంచర్లతో దాడి చేశాడు.


కాగా, గెరిల్లా యుద్ధ విద్యల్లో ఆరితేరిన హిడ్మా.. తనను బంధించేందుకు బీజాపూర్‌, సుక్మా, టేకులగూడెం,రామపర్‌లోని సీఆర్పీఎఫ్‌ శిబిరాలకు చెందిన బలగాలు వస్తాయని ముందే ఊహించాడు. అటవీ మార్గంలో.. 4 కిలోమీటర్ల మేర ‘యూ’ ట్రాప్‌(యూ ఆకారంలో చుట్టు ముట్టడం) పన్నాడు. బలగాలు వెళ్తున్నంత సేపు కిమ్మనకుండా.. తమ వారి ద్వారా జవాన్ల కదలికలను తెలుసుకున్నాడు. అంతకు ముందే.. చిలిగేరు, తెర్రాం, జొన్నగూడ గ్రామాలను ఖాళీ చేయించాడు. చుట్టుముట్టు ఉన్న 30 గూడేల ప్రజలనూ తరలించాడు. అక్కడ గెరిల్లా దళాలను మోహరించాడు. యూట్రా్‌పనకు ఈ గ్రామాలను జోడించి.. త్రిశూల వ్యూహంతో సిద్ధమయ్యాడు. ‘‘శనివారం రాత్రే గ్రామాలన్నీ ఖాళీగా ఉన్నా.. మేము అనుమానించలేకపోయాం. ఆదివారం ఉదయానికి గానీ తెలియరాలేదు మేమంతా ట్రాప్‌లో చిక్కుకుపోయామని. గ్రామాల్లో జనాల్లేకపోవడాన్ని అనుమానించకపోవడమే మేము చేసిన పెద్ద పొరపాటు’’ అని బీజాపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ జవాను చెప్పడాన్ని బట్టి.. సమయం, సందర్భం వచ్చేదాకా హిడ్మా ఓపిక పట్టాడని తెలుస్తోంది.


శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి కూంబింగ్‌లో ఉన్న బలగాలు.. శనివారం రాత్రికి తిరిగి తెర్రాం శిబిరానికి చేరుకోవాల్సి ఉంది. ఆదివారం తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో.. సరిగ్గా.. రెండు వైపులా కొండలు, ఒకవైపు టేకులగూడెం, మరోవైపు జొన్నగూడ, జిహార్‌ గ్రామాలు ఉన్నాయి. పశువుల అలికిడి తప్ప మనుషుల జాడే లేదు. ఏదో జరగబోతుందని జవాన్లు గ్రహించారు. ఒకరు ‘ఎమర్జెన్సీ’ సందేశాన్ని కూడా పంపారు. అలా..జవాన్లు అలసిపోయి.. తమ ట్రాప్‌లోకి వచ్చాక మావోయిస్టులు విరుచుకుపడ్డారు. దొరికిన వారిని చిత్ర హింసలు పెట్టి చంపేశారని పోస్టుమార్టం నివేదికలు చెబుతున్నాయి. కోబ్రా దళానికి చెందిన ఓ ఇన్‌స్పెక్టర్‌ తన మేగజీన్‌ను లోడ్‌ చేసుకునే లోపే.. మూకుమ్మడిగా దాడి చేశారు. అతని రెండు చేతులను నరికేశారు. ఈ చర్యలన్నీ కూంబింగ్‌ నిర్వహించే జవాన్లను మానసికంగా దెబ్బతీయడమేనని తెలుస్తోంది.



ఎప్పటికప్పుడు సమాచారం?

జవాన్లు ట్రాప్‌లోకి వచ్చినప్పటి నుంచి.. హిడ్మా ఎప్పటికప్పుడు వారి కదలికల సమాచారాన్ని తెలుసుకున్నాడు. జవాన్ల వద్ద ఉన్న ఏకే-47, ఇతర అధునాతన ఆయుధాల కంటే శక్తిమంతమైనవి వాడాలని నిర్ణయించాడు. అందుకే.. ఏకబిగిన కాల్పులు జరిపే ఎల్‌ఎంజీలను వాడాడు. ప్రాణనష్టం ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో.. గుంపులుగా ఉన్న జవాన్లపై గ్రనేడ్‌ లాంచర్లను ప్రయోగించాడు. క్షతగాత్రులను తరలించేందుకు వచ్చిన హెలికాప్టర్‌ను కూడా..ఎల్‌ఎంజీలతో గుళ్ల వర్షం కురిపించి నిలువరించాడు.


నిజానికి ఛత్తీ్‌సగఢ్‌లో కూంబింగ్‌ దళాల వద్ద సాంకేతికతకు కొదువ లేదు. మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు యూఏవీ (మానవ రహిత డ్రోన్లు) వినియోగిస్తారు. హిడ్మా సమాచారం అందగానే.. ముందూవెనకా ఆలోచించకుండా బలగాలు ముందుకు కదిలాయి. ముందుగా డ్రోన్లతో జల్లెడ పట్టి ఉంటే.. మావోయిస్టుల వ్యూహం అర్థమై ఉండేది. అయితే,  యూఏవీల అవసరం ఉందనుకుంటే.. 24 గంటల ముందే సమాచారం అందించాల్సి ఉంటుందని, ఇక్కడ హిడ్మా ఎక్కడ తప్పించుకుంటాడో? అనే ఆలోచనతో బలగాలు ముందుకు సాగాయన్నారు.




వ్యూహాల్లో దిట్ట..!

బీజాపూర్‌ జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన పీఎల్‌జీఏ కమాండర్‌ హిడ్మా ప్రస్తుత వయసు 51 అని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) వెబ్‌సైట్‌ స్పష్టం చేస్తోంది. 1990లో అతను నక్సల్స్‌లో చేరాడు. పదోతరగతి వరకే చదివినా.. ఆంగ్లంలో గుక్కతిప్పుకోకుండా మాట్లాడగలడు. పార్టీలో విజయవంతంగా వ్యూహాలు రచిస్తాడనే పేరే అతనికి మావోయిస్టు కేంద్ర కమిటీలో చోటు కల్పించింది. 2008లో హిడ్మా స్వగ్రామం వూవర్తిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఆ సమయంలో హిడ్మా, మరికొందరు తప్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు.


Updated Date - 2021-04-06T08:28:41+05:30 IST