Abn logo
Sep 8 2021 @ 00:00AM

కాలక్షేపం మసాలా నావల్ల కాదు!

‘సినిమా అంటే నాలుగు రోజులు ఆడి వెళ్లిపోయేలా కాదు... నాలుగు తరాలు గుర్తుండిపోయేలా ఉండాలి’... ఇది త్రిపర్ణా బెనర్జీ అభిమతం. దిగ్గజ దర్శకుడు సత్యజిత్‌రే స్ఫూర్తితో... మన చుట్టూ ఉండే పాత్రలనే కథలుగా మలుస్తున్నారు ఆమె. స్ర్కీన్‌రైటర్‌గా, దర్శకురాలిగా, నిర్మాతగా, ప్రొఫెసర్‌గా పురస్కారాలు, ప్రశంసలెన్నో అందుకున్న ఆమె తాజా చిత్రం... ‘బూసన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవం’లో భాగమైన ‘ఏషియన్‌ ప్రాజెక్ట్‌ మార్కెట్‌’కు ఎంపికైంది. ఆ విశేషాలను త్రిపర్ణ ‘నవ్య’తో పంచుకున్నారు. ‘‘ఒక బలమైన మాధ్యమం సినిమా. దాని ద్వారా మనం చెప్పదలుచుకున్నది అన్ని వర్గాలకూ చేరుతుందని నమ్మతాను. అందుకే నా కథల్లో సామాజిక కోణం కూడా ఉంటుంది. అలాగని అవే సినిమాలు తీస్తానని కాదు. నా వల్ల ఈ సమాజానికి కాస్తయినా ప్రయోజనం చేకూరితే అది చాలు. సినిమా నాకు ఒక వ్యాపకం కాదు. నా జీవన విధానంలో భాగం. ఈ రంగంపై చిన్నప్పుడే మక్కువ కలిగింది. జార్ఖండ్‌లో స్థిరపడిన సాధారణ మధ్యతరగతి బెంగాలీ కుటుంబం మాది. నేను పుట్టింది పశ్చిమ బెంగాల్‌లోనే అయినా పెరిగిదంతా జార్ఖండ్‌లోనే. మా ఇంట్లో ఎవరికీ చిత్ర పరిశ్రమ నేపథ్యం లేదు. 


ఆ మాటలే స్ఫూర్తి... 

స్కూల్లో చదువుకొంటున్నప్పుడు పేపర్లో ప్రముఖ దర్శకుడు సత్యజిత్‌రే ఇంటర్వ్యూ ఒకటి చదివాను. అందులో ‘సినిమా అనేది సకల కళల మేళవింపు’ అన్నారు ఆయన. ఆ మాటలు నా మనసులో నాటుకుపోయాయి. నేను మొదటి నుంచి పుస్తకాలు బాగా చదివేదాన్ని. కథలు చెప్పడమంటే చాలా ఆసక్తి చూపేదాన్ని. పదమూడేళ్లప్పుడు కథలు రాయడం మొదలుపెట్టాను. కథక్‌, సంగీతం నేర్చుకున్నా. పాటలు పాడతా. పెయింటింగ్స్‌ కూడా వేస్తుంటాను. ఈ క్రమంలోనే సినిమాలపై విపరీతమైన మక్కువ పెరిగింది. అక్కడైతే చక్కని కథలు రాయవచ్చు. వాటిని వెండితెరపై అందంగా చూపించవచ్చు. నటించవచ్చు. పాటలు పాడవచ్చు. మనలోని ప్రతిభను ప్రదర్శించడానికి చక్కని వేదిక అనిపించింది. 


టీవీలతో మొదలు... 

ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మాస్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నాక ‘జీ5, హాట్‌స్టార్‌ తదితర టీవీ చానల్స్‌లో పని చేశాను. డిగ్రీలో ఉండగానే ‘పోగో’ చానల్‌లో వచ్చిన ‘గల్లీ గల్లీ సిమ్‌ సిమ్‌’కు స్ర్కిప్ట్‌ రాశాను. డిగ్రీ తరువాత అడ్వర్‌టైజింగ్‌ కంపెనీల్లో ఉద్యోగాలు చేశాను. నా కెరీర్‌ మలుపు తిరిగింది, కల నిజమైంది మాత్రం 2007లో. ‘ఫ్రోజన్‌’ హిందీ చిత్రానికి అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాను. దానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. దీన్ని లద్దాఖ్‌లో చిత్రీకరించాం. ‘టొరంటో ఫిలిమ్‌ ఫెస్టివల్‌’లో ప్రదర్శించారు. నిర్మాత, రచయితగా వ్యవహరించిన తరువాతి చిత్రానికి కూడా ప్రశంసలు అందాయి. నా రైటింగ్‌ ప్రాజెక్ట్స్‌తో ‘కేన్స్‌ చిత్రోత్సవం’లో పాల్గొనే అద్భుతమైన అవకాశం దక్కింది. ‘ట్రయల్‌ ఆఫ్‌ సత్యమ్‌ కౌశిక్‌, ద స్కూల్‌ ఇన్‌ ద క్లౌడ్‌, డార్క్‌ ఘర్‌, రాజదర్శన్‌, కలర్స్‌ ఆఫ్‌ ఉమెన్‌’ తదితర చిత్రాలు, డాక్యుమెంటరీలకు వివిధ విభాగాల్లో భాగస్వామినయ్యాను. సామాజిక అంశాలతో పాటు హర్రర్‌, క్రైమ్‌, స్పోర్ట్స్‌, యానిమేషన్‌ వంటి కథలు కూడా రాశాను... రాస్తున్నాను. అయితే ఒక సినిమా చేశానంటే అది నేను మరణించిన తరువాత కూడా గుర్తుండిపోవాలి. దానికి ఒక అర్థం ఉండాలి. అంతేకానీ కాలక్షేపం కోసం మసాలా సినిమాలు తీయను. 


అరుదైన అవకాశం... 

ప్రస్తుతం ‘రైడింగ్‌ ఆన్‌ ద మూన్‌ బోట్‌’ రూపొందిస్తున్నా. దర్శకురాలిగా నాకు ఇదే తొలి చలనచిత్రం. ఇది ప్రతిష్టాత్మక ‘ఏషియన్‌ ప్రాజెక్ట్‌ మార్కెట్‌’ (ఏపీఎం)కు ఎంపికైంది. ‘బూసన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవం’లో ఇది భాగం. వచ్చే అక్టోబర్‌లో నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా ఆన్‌లైన్‌కే పరిమితం చేశారు. ‘ఏపీఎం’ సినిమా తీయాలనుకొనే ఔత్సాహికులకు ఒక స్టార్టప్‌ లాంటిది. ఆసియాలోనే అతిపెద్ద ఫిలిమ్‌ మార్కెట్‌. అక్కడికి నిర్మాతలు, ఫైనాన్షియర్లు, డిస్ర్టిబ్యూటర్లు అందరూ వస్తారు. వారితో ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. వారికి కథ నచ్చితే పెట్టుబడికి ముందుకు వస్తారు. అలా వివిధ దేశాల నుంచి నాలుగు వందలకు పైగా వచ్చిన దరఖాస్తుల నుంచి 26 చిత్రాలను ఎంపిక చేశారు. అందులో నా సినిమా ఉండడం చాలా సంతోషంగా ఉంది. రెండేళ్ల కిందట కూడా ఇలాంటి అరుదైన అవకాశమే ఒకటి వచ్చింది. అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక ‘గ్లోబల్‌ మీడియా మేకర్స్‌ 2019’లో పాల్గొన్నాను. అమెరికా ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ విభాగం దీన్ని నిర్వహిస్తుంది. 


గ్రామీణ అమ్మాయి కథ... 

‘రైడింగ్‌ ఆన్‌ ద మూన్‌ బోట్‌’ పదమూడేళ్ల గ్రామీణ బాలిక కథ. ఆడపిల్లల చదువు, కరువు, పేదరికం, సౌకర్యాల లేమి, వాతావరణ మార్పులు, నగరీకరణ వంటి సమస్యలను స్పృశిస్తూ సాగుతుంది. వీటితో ముడిపడిన ఆ బాలిక జీవితం ఎలా మారుతుందనేది ఇందులో చూపిస్తాం. పశ్చిమ బెంగాల్‌లోని ఓ మారుమూల గ్రామంలో దీని చిత్రీకరణ జరపాలనుకుంటున్నాం. అందుకే బెంగాలీ భాషలోనే తీద్దామనుకుంటున్నా. కథ నచ్చి జపాన్‌కు చెందిన నిర్మాత, నా మిత్రురాలు ఒకామె ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందకు వచ్చారు. పదేళ్ల కిందట ‘ఏపీఎం’కు వెళ్లినప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆయనతో పరిచయం... 

నా మొదటి చిత్రం ‘ఫ్రోజన్‌’ చేస్తుండగా శివాజీ చంద్రభూషణ్‌తో పరిచయం అయింది. ఆయనకు దర్శకుడిగా అదే తొలి చిత్రం. దానికి గాను ఆయనకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. 35 చిత్రోత్సవాల్లో ‘ఫ్రోజన్‌’ని ప్రదర్శించారు. ఆ సమయంలో మా మనసులు కలిశాయి. తరువాత పెళ్లి చేసుకున్నాం. చిత్ర నిర్మాణ రంగంలో రాణించాలనుకొనే ఔత్సాహికులకు నేను చెప్పేది ఒక్కటే... అంకితభావం, నిబద్ధత ఉంటేనే ఇందులో రాణించగలరు. ముఖ్యంగా అన్ని క్రాఫ్ట్స్‌పైనా పూర్తి అవగాహన ఉండాలి. దానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. మిగతా రంగాలతో పోలిస్తే సినీ పరిశ్రమ భిన్నమైనది. జయాపజయాలు పక్కపక్కనే ఉంటాయి. విజయానికి గర్వపడకుండా... అపజయానికి కుంగిపోకుండా ఉంటేనే మనుగడ సాధించగలమని గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిశ్రమతో ఉన్న పదమూడేళ్ల అనుబంధంలో నేను గ్రహించిన సత్యం ఇది.


మకాం... హైదరాబాద్‌... 

ఒక పక్క సినిమాలు చేస్తూనే ఫిలిమ్‌ ఇనిస్టిట్యూట్స్‌లో స్ర్కీన్‌ రైటింగ్‌ పాఠాలు కూడా చెబుతున్నాను. ఏడేళ్ల కిందట మా మకాం హైదరాబాద్‌కు మారింది. కొంత కాలం ‘రామానాయుడు ఫిలిమ్‌ స్కూల్‌’తో పాటు ‘గ్లెండేల్‌ అకాడమీ’కి కన్సల్టెంట్‌గా ఉన్నాను. కొంత కాలం ‘స్టోరీబోర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిలిమ్‌ అండ్‌ డిజైన్‌’లో ప్రొఫెసర్‌గా పని చేశాను. ప్రస్తుతం నా చిత్రంపై పూర్తి దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో బ్రేక్‌ తీసుకున్నాను. ప్రాజెక్ట్‌ పనుల మీద తరచూ ముంబయి- హైదరాబాద్‌- కోల్‌కతాలకు తిరగాల్సి వస్తోంది. వీటికితోడు కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. అందుకే పూర్తి సమయం బోధనకు కేటాయించలేకపోతున్నా.’’ 

- హనుమా 

ప్రత్యేకం మరిన్ని...