ట్రిపుల్‌ ఐటీ సీట్ల తగ్గింపు?

ABN , First Publish Date - 2021-08-30T04:08:57+05:30 IST

ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో సీట్ల తగ్గింపు యోచనపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాంకేతిక విద్యకు పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో సీట్ల సంఖ్య పెంచాల్సింది పోయి.. కుదించడమేంటనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించి ఉజ్వల భవితను ఇవ్వాలన్న సంకల్పంతో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్జీయూకేటీ)ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించారు.

ట్రిపుల్‌ ఐటీ సీట్ల తగ్గింపు?
శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌

- వసతి లేమి కారణంతో కుదింపునకు యోచన

-  విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన

- ఆలోచనను విరమించుకోవాలని విజ్ఞప్తి

(ఎచ్చెర్ల)

ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో సీట్ల తగ్గింపు యోచనపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాంకేతిక విద్యకు పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో సీట్ల సంఖ్య పెంచాల్సింది పోయి.. కుదించడమేంటనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించి ఉజ్వల భవితను ఇవ్వాలన్న సంకల్పంతో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్జీయూకేటీ)ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించారు. ఆర్జీయూకేటీ పరిధిలో శ్రీకాకుళం(ఎచ్చెర్ల), నూజివీడు, ఒంగోలు, ఆర్‌కే వ్యాలీ(ఇడుపులపాయ)లో ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లు ఉన్నాయి. సిక్కోలుకు సంబంధించి ఎచ్చెర్లలో ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ను 2016-17లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. పీయూసీ రెండేళ్లు, ఇంజినీరింగ్‌ నాలుగేళ్లు .. మొత్తంగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌  కోర్సులో ఏటా అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఏటా ఒక్కో క్యాంపస్‌లో వెయ్యి సీట్ల వంతున భర్తీ చేస్తున్నారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో వచ్చిన గ్రేడ్‌ల ఆధారంగా ట్రిపుల్‌ ఐటీలో సీట్లను కేటాయిస్తుంటారు. గత ఏడాది కొవిడ్‌ వ్యాప్తితో పదో తరగతి  పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించకుండా.. ప్రభుత్వం విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేసింది.


దీంతో ప్రవేశ పరీక్షను నిర్వహించి ట్రిపుల్‌ ఐటీ సీట్లను భర్తీ చేశారు. ఈ ఏడాదీ కూడా అదే పరిస్థితి నెలకొనడంతో.. త్వరలో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది స్థానిక ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో సీట్ల సంఖ్యను సగానికి తగ్గించాలని యోచిస్తున్నారు. క్యాంపస్‌లో వసతి సౌకర్యం పూర్తిగా మెరుగపడని కారణంగా సీట్లను 500కు తగ్గించాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ యోచనను విద్యార్థుల తల్లిదండ్రులు, సంఘాలు, రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. సీట్ల సంఖ్య తగ్గింపు ఆలోచన సరికాదని పేర్కొంటున్నాయి. ప్రతిపాదనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. 


ఇంకా నూజివీడులోనే తరగతులు

ట్రిపుల్‌ ఐటీలో చేరే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. ఎచ్చెర్ల క్యాంపస్‌లోని సీట్ల కేటాయింపులో స్థానిక అంబేడ్కర్‌ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ(విశాఖపట్నం), ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ (రాజమండ్రి) పరిధిలో విద్యార్థులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల విద్యార్థులు ఇక్కడి క్యాంపస్‌లో చదువుకొనేందుకు  ఆసక్తి చూపుతారు.


ఈ క్యాంపస్‌ ఏర్పాటై ఆరేళ్లు పూర్తవుతున్నా... పూర్తిస్థాయిలో వసతులు మెరుగుపడడం లేదు. కేవలం పీయూసీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులను మాత్రమే ఇక్కడి క్యాంపస్‌లో నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్‌ తరగతులు నూజివీడులోనే కొనసాగుతున్నాయి. 2019లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఈ క్యాంపస్‌ను సందర్శించారు. వసతులు మెరుగుపరిచి.. స్వరూపాన్ని మార్చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇంతవరకూ నెరవేరలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రూ.17కోట్ల అంచనా వ్యయంతో క్యాంపస్‌ భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కరోనా వ్యాప్తి, నిధుల సమస్యల కారణంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. 


ఈ ఏడాదీ.. అంతే

ఈ విద్యా సంవత్సరం(2021-22)లో కూడా పూర్తిస్థాయిలో విద్యార్థులకు క్యాంపస్‌లో తరగతులు నిర్వహించే అవకాశం లేదు. ప్రస్తుతం క్యాంపస్‌లో పీయూసీ-2 విద్యార్థులకు మాత్రమే ఈ నెల 23 నుంచి ఆఫ్‌లైన్‌లో తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత వసతిని చూస్తే పీయూసీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఈ క్యాంపస్‌లో తరగతులు నిర్వహించే వీలుంది. నిర్మాణంలో ఉన్న భవనాలు అందుబాటులోకి వస్తే అదనంగా మరో 1000 మంది విద్యార్థులకు తరగతులు, వసతి కల్పించే అవకాశం ఉంది. 2016-17 విద్యా సంవత్సరంలో తొలి బ్యాచ్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆరేళ్లు పూర్తిచేసుకొని త్వరలో రిలీవ్‌ కానున్నారు. వీరిని కొద్దిరోజులైనా ఇక్కడికి తీసుకువచ్చి... సొంత క్యాంపస్‌ నుంచి రిలీవ్‌ అయ్యామన్న సంతృప్తిని కల్పించాలన్న ఆలోచనలో ట్రిపుల్‌ ఐటీ అధికారులు ఉన్నారు. 


ప్రతిపాదన మాత్రమే

ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో సీట్ల కుదింపు.. కేవలం ప్రతిపాదన మాత్రమే. ఈ అంశంపై పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. 

- ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు, డైరెక్టర్‌, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌

Updated Date - 2021-08-30T04:08:57+05:30 IST